TSPSC Group 4 Exam 2023 Rule : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పరీక్షకు మహిళల తాళిబొట్టు, మెట్టెల నిబంధనపై చైర్మన్ ఇచ్చిన క్లారిటీ ఇదే..!
ఒకవైపు అత్యధిక సంఖ్యలో పోస్టులు.. మరోవైపు అత్యధిక సంఖ్యలో అభ్యర్థులుండటంతో టీఎస్‌పీఎస్సీ వ్యూహాత్మక కార్యాచరణతో చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో 9 వేల గ్రూప్–4 ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటికి 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో.. రాత పరీక్ష రాసే అభ్యర్థులకు కొన్ని నిబంధనలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా మహిళలు పరీక్ష రాయాలంటే తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీంతో చాలా మంది మహిళలు సంప్రదాయాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. తాజాగా ఈ విషయంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే యువతీయువకుల కోసం ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఉంటాయని, సరిపడా మహిళా సిబ్బందిని కూడా నియమించామని అన్నారు. అంతేకాకుండా పరీక్షకు హాజరయ్యే మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని నిబంధనేమి లేదని స్పష్టం చేశారు. హిందూ సంప్రదాయాలను కించపరుస్తున్నారంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని జనార్ధన్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 2,878 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్–4 పరీక్షల నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక లైజన్ అధికారి, ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు. ఈ పరీక్షా కేంద్రాల పరిధిలో దాదాపు 40 వేల పరీక్ష హాల్‌లలో అభ్యర్థులను సర్దుబాటు చేస్తారు. ఒక్కో పరీక్ష హాలులో గరిష్టంగా 24 మంది అభ్యర్థులుంటారు.
చదవండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్-3 ఉద్యోగాలు.. పరీక్షా విధానం ఇదే..
పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్ల పాత్ర కీలకం. దీంతో ఇన్విజిలేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ సైతం టీఎస్‌పీఎస్సీ ఇచ్చింది. జూలై 1న శనివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు.
పరీక్ష కేంద్రంలో..
గ్రూప్–4 ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆశావహులు సైతం భారీగా ఉన్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల పరిశీలన, నిర్ధారణకు టీఎస్‌పీఎస్సీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇన్విజిలేటర్లకు సైతం నిర్ధారణ బాధ్యతలు అప్పగించింది. తొలుత పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే సమయంలో అభ్యర్థి హాల్‌టిక్కెట్‌తో పాటు గుర్తింపు కార్డులు పరిశీలిస్తారు. ఆ తర్వాత అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
అభ్యర్థులకు కనీసం బెల్టు సైతం అనుమతించబోమని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే తేల్చి చెప్పింది. పరీక్ష హాలులో అభ్యర్థిని ఇన్విజిలేటర్ మరోమారు తనిఖీ చేస్తారు. హాల్ టికెట్‌లోని ఫోటో ద్వారా, అభ్యర్థి ఫోటో గుర్తింపు కార్డు ద్వారా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఓటీఆర్‌లో ఉన్న సంతకం ఆధారంగా అభ్యర్థి చేసిన సంతకాన్ని పరిశీలిస్తారు. నామినల్‌రోల్స్ పైన సంతకం తప్పనిసరి చేసింది. దీంతో పాటు అభ్యర్థి వేలిముద్రను పరీక్ష హాలులోనే సమర్పించాలి.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగాల స్డడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, గైడెన్స్, ఆన్‌లైన్ టెస్టులు, సక్సెస్ స్టోరీలు మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
ఓఎంఆర్ షీట్లో బ్లూ/బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది. హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని కమిషన్ స్పష్టం చేసింది.
ఐదు పద్ధతుల్లో ఎక్కడ పొరపాటు గుర్తించినా అభ్యర్థిని పరీక్షకు అనుమతించమని టీఎస్‌పీఎస్సీ తేల్చిచెప్పింది. గ్రూప్–4 పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. ఓఎంఆర్ జవాబు పత్రంలో అభ్యర్థి ముందుగా హాల్‌టిక్కెట్ నంబర్, ప్రశ్నపత్రం కోడ్‌ను బబ్లింగ్ చేయాలి. ఓఎంఆర్ జవాబు పత్రంపై అభ్యర్థి హాల్‌టిక్కెట్ నంబర్, ఫోటో ఉంటాయని వస్తున్న ఊహాగానాలను పట్టించుకోవద్దని కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది.