Skip to main content

TGPSC Group I Exam: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు 74% హాజరు.. ప్ర‌శ్న‌ల తీరు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ ఆదివారం నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
74percent attendance for Group-1 Preliminary Exam

4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 3.02లక్షల మంది మాత్రమే హాజరైనట్టు టీజీపీఎస్సీ ప్రాథమికంగా వెల్లడించింది. క్షేత్రస్థాయి నుంచి వచ్చే లెక్కల తర్వాత హాజరుశాతంపై స్పష్టత వస్తుందని కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రిలిమినరీ పరీక్ష కీ అతి త్వరలో కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూడాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 21 నుంచి గ్రూప్‌–1 ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. 

చదవండి: TGPSC Group 1 Prelims-2024 Question Paper with Key - Click Here

సులభతరంగా ప్రశ్నలు... 

ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు సులభతరంగా ఉన్నట్టు అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ మొదటిసారిగా చేపడుతోంది. రెండేళ్ల క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసి, రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.

వివిధ కారణాల వల్ల వాటిని కమిషన్‌ రద్దు చేసింది. గత ప్రశ్నపత్రంతో పోలిస్తే తాజాగా వచ్చిన ప్రశ్నలు సులభంగా, కొన్ని అత్యంత సులభంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు చెప్పారు. ఈ క్రమంలో గతంతో పోలిస్తే కటాఫ్‌ మార్కులు పెరిగే అవకాశం లేకపోలేదు. 

చదవండి: Narendra Modi: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. 72 మందితో కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం ఇదే..

మధ్యలో బయోమెట్రిక్‌ హాజరు స్వీకరణ  

పరీక్ష ఉదయం 10.30గంల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. పరీక్షకు హాజరయ్యే అభర్థులు కనీసం గంట ముందు రావాలని, బయోమెట్రిక్‌ హాజరు స్వీకరణ ఉంటుందని కమిషన్‌ తెలిపింది. పరీక్షకు ముందు లేదా పరీక్ష తర్వాత హాజరు స్వీకరణ చేపట్టాల్సి ఉండగా, చాలాచోట్ల అధికారులు పరీక్షకు మధ్యలో బయోమెట్రిక్‌ హాజరు స్వీకరించారు.

సరిగ్గా ప్రశ్నలు చదివి జవాబులు ఇచ్చే సమయంలో బయోమెట్రిక్‌ హాజరు స్వీకరణ ప్రక్రియ చిర్రెత్తించిందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పరీక్షకేంద్రాలకు రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడినట్టు చెప్పారు. నగర శివారు ప్రాంతాల్లోని చాలా పరీక్ష కేంద్రాలు ప్రధానరహదారికి లోపలికి ఉండడం..ఆదివారం కావడంతో ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలు సైతం దొరక్క అవస్థలు పడినట్టు వాపోయారు. 

సీసీ కెమెరాల ద్వారా పరిశీలన  

టీజీపీఎస్సీ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌(సీసీకెమెరా) ద్వారా పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించినట్టు నవీన్‌ నికోలస్‌ తెలిపారు. పరీక్ష పక్కాగా నిర్వహించామని, నిర్వహణలో కీలకపాత్ర పోషించిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి కమిషన్‌ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  

మద్యంమత్తులో గ్రూప్‌–1 విధులకు.. 

తిమ్మాపూర్‌: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించే అన్వర్‌ మీర్జా పర్వేజ్‌బేగ్‌కు తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాల బీ–వింగ్‌లో గ్రూప్‌–1 పరీక్ష విధులు కేటాయించారు. మద్యం తాగి విధులకు హాజరయ్యాడు.

విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించడంతో తోటి సిబ్బంది ఎల్‌ఎండీ ఎస్సైకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై చేరాలు పరీక్షకేంద్రం వద్దకు వెళ్లి అన్వర్‌ మీర్జాను అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా.. రీడింగ్‌ 173 వచ్చింది. దీంతో అతడిని విధుల నుంచి తప్పించారు. 
 

Published date : 10 Jun 2024 01:39PM

Photo Stories