WhatsApp:మీ వాట్సాప్ పని చేయట్లేదా? మీ నెంబర్ బ్యాన్ అని చూపిస్తుందా? అయితే ఇలా చేయండి..
మెటా కంపెనీ పరిధిలో పని చేస్తున్న వాట్సాప్ ద్వారా ఇంటర్నెట్ ఆధారిత మెసేజ్‌ల దగ్గరి నుంచి వీడియో కాల్స్ దాకా, వ్యక్తిగత అవసరాల నుంచి ఆఫీసుల పనుల దాకా.. అన్నీ నడిచిపోతున్నాయి. అయితే ఐటీ రూల్స్ 2021 అమలులోకి వచ్చాక.. వాట్సాప్ భారత్‌లో తన యూజర్లపై ఎక్కువ అజమాయిషీ చెలాయిస్తోంది.
నిబంధనలను ఉల్లంఘింస్తే..
వాట్సాప్ అకౌంట్లను క్రమం తప్పకుండా భారత్‌లో అకౌంట్లను బ్యాన్ చేస్తూ వస్తోంది. పైగా Intermediary Guidelines and Digital Media Ethics Code ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించిన అకౌంట్లనే బ్యాన్ చేస్తున్నట్లు మంత్లీ కంప్లైయన్స్ రిపోర్టుల్లో చెబుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి దాదాపు రెండు కోట్ల వాట్సాప్ అకౌంట్లను నిషేధిత జాబితాలోకి చేర్చిందని తెలుస్తోంది.
ఇంతకీ వాట్సాప్ అకౌంట్లను ఎందుకు బ్యాన్ చేస్తుందో కారణాలు తెలుసా?
ఫేక్ అకౌంట్లు..
వేరే వ్యక్తి పేరు మీద, నెంబర్ మీద వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడం. ఇలాంటి వ్యవహారాలు దృష్టికి వస్తే వాట్సాప్ వాటిని బ్యాన్ చేస్తుంది.
కాంటాక్ట్ లిస్ట్‌లో లేనోళ్లకు..
కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నెంబర్లకు ఎక్కువ మెసేజ్‌లు పంపడాన్ని.. అనుమతులు లేని సంభాషణలుగా గుర్తిస్తుంది వాట్సాప్. అందుకే బ్యాన్ విధిస్తుంది. ఒకవేళ తెలిసిన వ్యక్తి అయినా సరే, నోటికి నెంబర్ గుర్తున్నా సరే.. కచ్చితంగా కాంటాక్ట్‌లో సేవ్ చేసుకున్నాకే ఛాటింగ్ చేయండి.
థర్డ్ పార్టీ యాప్‌లతో..
వాట్సాప్ మెసేంజర్ కాకుండా థర్డ్ పార్టీలు యాప్‌లు ఉపయోగించినా ఈ సమస్య ఎదురవుతుంది. ఉదాహరణకు.. వాట్సాప్ డెల్టా, జీబీ వాట్సాప్, వాట్సాప్ ఫ్లస్.. ఇలాంటివన్నమాట. వీటిని వాట్సాప్ ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదు. ప్రైవసీ కోణంలో ఆ అకౌంట్లను నిషేధిస్తుంది. కాబట్టి, వాటిని డిలీట్ చేయండి. అఫీయల్ యాప్‌కు మొమరీ స్పేస్ ఎక్కువైనా వాడేయండి.
ఎక్కువమంది బ్లాక్ చేసినా..
ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఎక్కువ మంది యూజర్లు బ్లాక్ చేసినా సరే.. ఆ అకౌంట్‌ను వాట్సాప్ నిషేధిస్తుందని తెలుసా?. కాబట్టి, అడ్డగోలు కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవడం, అవసరం లేకున్నా వాళ్లకు మెసేజ్‌లు పంపడం, ఫార్వార్డ్ మెసేజ్‌లు పంపడం చేయడం తగ్గిస్తే మంచిది.
ఫిర్యాదుల ఫలితం కూడా..
ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఎక్కువ మంది రిపోర్ట్ చేసినా, ఎక్కువ మంది ఫిర్యాదులు చేసినా.. ఆ అకౌంట్‌ను వాట్సాప్ బ్యాన్ చేసేస్తుంది.
మాల్‌వేర్ లింక్స్..
మాల్‌వేర్(వైరస్)తో కూడిన లింక్స్, స్మార్ట్‌ఫోన్‌లకు ప్రమాదం కలిగించే లింక్స్‌గానీ, ఏపీకే ఫైల్స్ రూపంలో ఉండే ఫైల్స్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లకు పంపినా వాట్సాప్ ఆ అకౌంట్లను నిషేధిస్తుంది.
అసభ్య సందేశాలు..
పోర్న్ సంబంధిత కంటెంట్, అసభ్య సందేశాలు, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే సందేశాలు, బెదిరింపులు, వేధింపులు, విద్వేషపూరిత సందేశాలు.. ఇతరులకు పంపినా సరే బ్యాన్ తప్పదు!.
హింసను ప్రేరేపించినా..
ఈరోజుల్లో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల నుంచే ఫేక్ కంటెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అందుకే హింసను ప్రేరేపించేవిగా ఉండే కంటెంట్‌ను ఫార్వార్డ్ చేసినా బ్యాన్ వేస్తుంది వాట్సాప్. వీటితో పాటు ఘర్షణలకు ప్రేరేపించే పోస్టులు, పిల్లలపై జరిగే అకృత్యాలకు సంబంధించిన కంటెంట్ ప్రమోట్ చేసినా వాట్సాప్ బ్యాన్ తప్పదు.
కాబట్టి, బ్యాన్ పరిధిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడడండి. అలాగే వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేయడం అనేది రిపోర్ట్ లేదా అవతలి వాళ్ల ఫిర్యాదుల ఆధారంగా జరుగుతుంటుంది. పర్సనల్ అకౌంట్లతో పాటు గ్రూపులు ఇందుకు అతీతం కాదు. గ్రీవియెన్స్ చానెల్‌తో పాటు రకరకాల టూల్స్ ఇబ్బందికారక అకౌంట్ల(ఫిర్యాదుల ఆధారంగా)ను నిశీతంగా పరిశీలించాకే.. వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేస్తుంది. ఈ బ్యాన్ టెంపరరీగా లేదంటే శాశ్వతంగా ఉండొచ్చు. తాత్కాలిక నిషేధం ఎత్తివేతకు వాట్సాప్ సపోర్ట్ టీంకి మెయిల్ పెడితే సరిపోతుంది.
ఏం చేయాలంటే..
వాట్సాప్ బ్యాన్ అని కనిపించే స్క్రీన్ షాట్‌ను.. అన్‌బ్యాన్(బ్యాన్ ఎత్తేయమంటూ) రిక్వెస్ట్ చేస్తూ support@whatsapp.com కు మెయిల్ పెట్టాలి. అప్పుడు ఎందుకు బ్యాన్ చేసిందో వివరణ ఇస్తూనే.. వీలైతే అన్‌బ్యాన్ చేయడానికి వాట్సాప్ ప్రయత్నిస్తుంది. ఒకవేళ అన్‌బ్యాన్ కన్ఫర్మ్ మెసేజ్ గనుక వస్తే.. యాప్‌ను అన్-ఇన్‌స్టాల్ చేసి, తిరిగి ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే ప్లేస్టోర్‌లో అప్‌డేట్ కొట్టినా సరిపోతుంది.
ఒకవేళ మళ్లీ మళ్లీ బ్యాన్ మెసేజ్ వస్తుంటే.. ఈసారి support@whatsapp.com కు మరోసారి రిక్వెస్ట్ మెయిల్ (ఇంతకు ముందు.. ఇప్పటివి స్క్రీన్ షాట్స్‌తో) పెట్టొచ్చు. అప్పుడు సరైన వివరణ దక్కుతుంది. ఒకవేళ పర్మినెంట్ బ్యాన్ సంకేతాలు గనుక అందితే మాత్రం.. నెంబర్ మార్చేడయం తప్ప మరో మార్గం ఉండదని వాట్సాప్ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొని ఉంది. మీ తరపున గనుక ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు లేకుంటే.. grievance_officer_wa@support.whatsapp.comకు మెయిల్ చేయడం ద్వారా సమస్యకు ఓ పరిష్కారం పొందవచ్చు.