Skip to main content

Aadhar card : మరణించిన వ్యక్తుల పాన్‌కార్డ్‌, ఆధార్‌ కార్డులు భద్రపరచాలా? వ‌ద్దా..?

మన గుర్తింపుకు ఆధార్‌, పాన్‌కార్డులే ఆధారాలు. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా పాస్‌పోర్ట్‌ కావాలన్నా ఆఖరికి సిమ్‌కార్డ్‌ తీసుకోవాలన్నా ఈ కార్డులే కీలకంగా మారుతాయి.
aadhar card
aadhar card

అయితే ఓ వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ పాన్ ఏం చేయాలో చాలా మందికి తెలియదు. దానికి సంబంధించిన వివరాలు మీ కోసం..

ఆధార్‌, పాన్‌ కార్డులు పోగొట్టుకుంటే పలు అనర్థాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక మరణించిన వారి కార్డులను ఎన్ని రోజులని భద్రపరచాలని సందేహం కూడా విలువైనదే. అయితే మరణించిన వ్యక్తి ఐటీ రిటర్న్స్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పాన్ కార్డును జాగ్రత్తగా భద్రపరచాలి. ఐటీ రిటర్న్స్ లోని నగదు బ్యాంకు ఖాతాలో జమ అయ్యేంత వరకు పాన్ కార్డు యాక్టివ్ గా ఉండాలి. ఉద్యోగి డిపార్టుమెంట్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు మనుగడలో ఉండాలి. ఇవన్నీ పూర్తయ్యాక ఇక ఆ అకౌంట్ ను క్లోజ్ చేయవచ్చు. 

ఎలా క్లోజ్‌ చేయాలి..?
పాన్‌ కార్డు క్లోజ్‌ చేయాలంటే.. తొలుత ఆదాయపు శాఖకు అప్లికేషన్ ఇవ్వాలి. ఇందులో వారి పూర్తి వివరాలను పొందపరచాలి. వ్యక్తి పేరు పాన్ కార్డు నంబర్ మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. వీటన్నింటిని జత చేసి ఐటీ శాఖకు అప్లికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం పాన్ కార్డు క్లోజ్ అవుతుంది. 

చట్టపరంగా వారసులే..
పాన్‌కార్డు క్లోజింగ్‌కి సంబంధించిన దరఖాస్తుని మరణించిన వారి చట్టపరమైన వారసులే సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జరిగే ప్రక్రియలో కూడా వారసులే కీలకం. ఇతరులు చేయడానికి వీలులేదు. 

బదిలీకి అవకాశం..
మరణించిన వారి పాన్‌ కార్డుని వారి వారసుల అభ్యర్థన మేరకు వేరే వారికి బదిలీ చేయోచ్చు. భవిష్యత్ లో ఆ పాన్ కార్డుతో అవసరం ఉంటుంది అనుకుంటే క్లోజ్ చేయకూడదు. ఆదాయపు శాఖకు చెల్లించాల్సిన పని లేదు. అయితే ముందుముందు ఎలాంటి ఉపయోగం లేదని భావిస్తే మాత్రం క్లోజ్ చేయడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అది దుర్వినియోగం జరిగితే లేనిపోని చిక్కులు వస్తాయని చెబుతున్నారు.

జాగ్రత్తే..
గ్యాస్ సిలిండర్ నుంచి రైల్వే టికెట్ బుకింగ్ వరకు ఆధార్‌కార్డుది అవసరం. అందుకే ఆధార్ అనేది చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా తప్పనిసరి. మరణించిన వారి ఆధార్ కార్డు ఏం చేయాలనేది కొందరి సందేహం. అయితే పాన్ కార్డు లాగా ఆధార్ ను రిటర్న్ చేసే వెసలుబాటు లేదు. ఆధార్ నంబర్ ఒకరికి కేటాయిస్తే.. ఆ మనిషి బతికి ఉన్నా మరణించినా కూడా అతనికే వర్తిస్తుంది. ఎందుకంటే దానిపై సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. కాబట్టి ఆధార్ కార్డును క్లోజ్ చేసుకునే అవకాశం లేదు. అయితే ఇది దుర్వినియోగం అవ్వకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.

Published date : 03 Nov 2021 11:21AM

Photo Stories