Skip to main content

Monkeypox: మాయదారి రోగమే కానీ...

మంకీపాక్స్‌ వైరస్‌ అంతర్జాతీయ స్థాయిలో కలవరపెడుతున్న అత్యవసర ప్రజారోగ్య పరిస్థితి  అంటూ జూలై 23న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గరిష్ఠ స్థాయి హెచ్చరిక జారీ చేయడంతో కలకలం మొదలైంది.
global health emergency
global health emergency

75కి పైగా దేశాల్లో 16 వేల మంకీపాక్స్‌ కేసులు బయటపడడంతో ఈ వ్యాధి అంతర్జాతీయ వార్త అయింది. మంకీపాక్స్‌ వైరస్‌ అంతర్జాతీయ స్థాయిలో కలవరపెడుతున్న అత్యవసర ప్రజారోగ్య పరిస్థితి  అంటూ జూలై 23న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గరిష్ఠ స్థాయి హెచ్చరిక జారీ చేయడంతో కలకలం మొదలైంది. నిన్నమొన్నటి దాకా సురక్షితంగా ఉన్నామనుకున్న మన దేశంలోనూ కేరళలో మొదలై ఢిల్లీ వరకు గత పది రోజుల్లో మొత్తం 4 కేసులు బయటపడ్డాయి. తాజాగా తెలంగాణలో మరో అనుమానిత కేసుతో అప్రమత్తత అవసరమని అర్థమవుతోంది. 

Also read: Human Genome Sequence: మనిషిలో సుమారు ఎన్ని వేల జీన్స్‌ ఉంటాయి?

2009 నుంచి గత 14 ఏళ్ళలో జికా, ఎబోలా, పోలియో, స్వైన్‌ఫ్లూ, కోవిడ్‌ తదితర 7 సార్లే అంతర్జాతీయ అత్యవసర స్థితిని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. వాటిలో గత మూడేళ్ళలో వచ్చినవి – కోవిడ్, మంకీపాక్స్‌. హఠాత్తుగా తలెత్తి, అంతర్జాతీయ సరిహద్దులు దాటి, దేశాలన్నీ కలసి సమష్టి చర్యలు చేపట్టాల్సిన వ్యాధుల విషయంలోనే డబ్ల్యూహెచ్‌ఓ ఇలా ప్రకటిస్తుంటుంది. పెరుగుతున్న కేసులతో మంకీపాక్స్‌పై భారత ప్రభుత్వం సైతం ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిం చాల్సి వచ్చింది. నిజానికి, డబ్ల్యూహెచ్‌ఓ తాజా ప్రకటన కన్నా చాలా ముందే మన ప్రభుత్వం మేల్కొంది. మే నెలాఖరుకే ఇది సంక్షోభంగా పరిణమించవచ్చని భావించి, మంకీపాక్స్‌పై రాష్ట్రా లకూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్క కేసొచ్చినా, వ్యాధి విస్ఫోటనంగానే భావించాలంది.

Also read: WHO: కోవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌కు పేరు ఎలా వచ్చింది?

కొంతకాలంగా అమెరికా, ఐరోపాలలో మంకీపాక్స్‌ విరివిగా కనిపిస్తోంది. ఆఫ్రికాలో ఈ వ్యాధి సాధారణమైనా, భారత్‌లో చాలా ఏళ్ళ తర్వాత ఈ వ్యాధి పొడసూపడంతో ఆగి, ఆలోచించాల్సి వస్తోంది. అయితే, కరోనాలా మంకీపాక్స్‌ శ్వాసకోశ వ్యవస్థను ఇబ్బంది పెట్టదు. త్వరితగతిన వ్యాప్తి చెందదు. ప్రాణాంతకం కాదు కాబట్టి, అతిగా ఆందోళన పడాల్సిన పని లేదు. మంకీపాక్స్‌కు ఇప్పటి దాకా నిశ్చయమైన రోగనిరోధక చికిత్సంటూ లేకున్నా, మశూచికి ఇతర దేశాల్లో వాడిన 2వ, 3వ జనరేషన్‌ టీకాలు దీనికీ 85 శాతం మేర పనిచేస్తాయని ప్రస్తుతమున్న అవగాహన. కరోనా పుణ్యమా అని అత్యవసర స్థితిని ఎదుర్కోవడంలో వచ్చిన అనుభవంతో మన దేశం అడుగేయాలి. చికిత్స కన్నా నివారణే మిన్న గనక రోగుల క్వారంటైన్, సన్నిహిత కాంటాక్ట్‌ల ట్రేసింగ్, టెస్టింగ్, టీకాలు ముఖ్యం. ఈ వ్యాధి నిజంగానే ఓ విస్ఫోటనం కాకుండా చూసేందుకు అదే మార్గం. 

Also read: జికా వైరస్‌ను మొదట ఏ దేశంలో గుర్తించారు?

జంతువుల నుంచి వచ్చే ‘జూనోటిక్‌ వ్యాధుల’కు మంకీపాక్స్‌ ఉదాహరణ. ప్రధానంగా కోతులు, ఎలుకలు, ఉడుతల లాంటి జంతువులకు సన్నిహితంగా మెలగడంతో వ్యాపించే మంకీపాక్స్‌ వైరస్‌ సైతం మశూచి కారక వైరస్‌ల కుటుంబానికి చెందినదే. కరోనాలా భారీగా కేసులు రాకపోయినా, దానిలా ఇది ప్రాణాంతకం కాకపోయినా మంకీపాక్స్‌పై జాగ్రత్త తప్పదు. సాధారణంగా వ్యాధి ప్రబలిన విదేశాలకు వెళ్ళి వచ్చినవారిలో, మరో రోగికి సన్నిహితంగా మెలిగినవారిలోనే 14 నుంచి 21 రోజుల్లో మంకీపాక్స్‌ బయటపడుతోంది. నూటికి 99 కేసులు మగవారిలో, అదీ స్వలింగ సంపర్కుల్లోనే కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణమేదీ చేయకపోయినా ఢిల్లీలో ఒకరికి ఈ వ్యాధి రావడంతో రోగి ఎవరితో సన్నిహితంగా తిరిగారు, లైంగిక అభిరుచి ఏమిటనేది కీలకమైంది. 

Also read: కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాధి- లక్షణాలు,ప్రభావం, చికిత్స

మంకీపాక్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో హెచ్‌ఐవీ బాధితులు సహా కొన్ని వర్గాల వ్యక్తులకు కళంకం ఆపాదించే ముప్పుంది. పరోక్షంగా తమ లైంగిక అభిరుచులను బయటపెట్టి, తమపై ముద్ర వేస్తారనే భయం ఉంటుంది. కాబట్టి, నిఘా కేంద్రాలు, లైంగిక ఆరోగ్యశాలల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ర్యాండమ్‌ టెస్టింగ్‌ చేయాలి. ఎయిడ్స్‌పై రహస్య స్క్రీనింగ్‌ నిర్వహించిన అనుభవం మనకుంది గనక, జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (నాకో)తోనే ఆ పని చేయించవచ్చు. ఆర్టీపీసీ ఆర్‌ కిట్లు, టీకాలు, చికిత్సా విధానాలను సర్కారు సత్వరం సిద్ధం చేయాలి. 1980లకే మనం దేశం నుంచి మశూచిని పారదోలాం. అలా దేశంలో నూటికి 70 మంది మశూచి టీకాలు వేయించుకోని వారే. దానికి వాడే మందులూ మన దగ్గర అందుబాటులో లేవు. గనక ముందుజాగ్రత్తగా విదేశాల నుంచి మందులు తెప్పించడం, టీకాల ఉత్పత్తిని ప్రోత్సహించడం అవసరం. 

Also read: విజ్ఞాన శాస్త్రం-ఆవిష్కరణలు

డెన్మార్క్‌లోని పరిశోధనాశాలలో 1958లో కోతుల్లో మంకీపాక్స్‌ను కనుగొన్నారు. 1970లో నేటి డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో మనుషుల్లో తొలిసారి ఇది బయటపడి, ఆఫ్రికా దేశాల్లో ప్రబలింది. ఇవాళ మధ్య, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో సాధారణ జలుబు లాంటి ఎండెమిక్‌గా మారిందనేది చరిత్ర. కాబట్టి, ఆందోళన బదులు అంతర్జాతీయ సమాజం పరస్పర సహకారంతో, సమష్టి ప్రయత్నాలతో, వ్యాప్తిని అడ్డుకొనే పనిచేయాలి. ఇది మరో మహమ్మారిగా మారకుండా జాగ్రత్త పడాలనేదే డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలోని సారాంశంగా గ్రహించాలి. ఇప్పటికే కరోనాతో జాగ్రత్తలు అలవాటయ్యాయి గనక ప్రభుత్వమూ ప్రజల్లో చైతన్యం పెంచాలి. రోగనిరోధక శక్తి తక్కువుండే చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకే మంకీపాక్స్‌ కొంత ప్రమాదకరం. లేదంటే 3 వారాల స్వీయ నిర్బంధం, తగిన ఉపశమన చికిత్సలతో నాలుగు వారాల్లో ఆరోగ్యవంతులు కావచ్చని గుర్తించాలి. వాట్సప్‌ల పుణ్యమా అని అసత్య సమాచారం ప్రబలే ప్రస్తుత పరిస్థితుల్లో చేయాల్సిందల్లా – భయపెట్టడం కాదు... అవగాహన కల్పించి అప్రమత్తం చేయడమే! 

Also read: ‘నిపా’ వైరస్ వ్యాప్తి - లక్షణాలు

Published date : 27 Jul 2022 03:32PM

Photo Stories