జికా వైరస్ను మొదట ఏ దేశంలో గుర్తించారు?
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. జూలై 9న ఎయిమ్స్కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించింది. ఈ బృందం కేరళలో పరిస్థితులను సమీక్షించడంతోపాటు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందజేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. బృందంలో సీనియర్ వైద్యులతోపాటు అంటువ్యాధుల నిపుణులు ఉన్నారని పేర్కొన్నారు.
జికా వైరస్ను మొదట ఎక్కడ గుర్తించారు?
1947లో ఉగాండాలోని జికా అడవిలో ఉండే కోతుల్లో మొదటగా కొత్త రకం వైరస్ను కనుగొన్నారు. దోమల ద్వారా వ్యాపించే అవకాశమున్నట్టు గుర్తించారు. ఆ అడవి పేరుతోనే జికా వైరస్గా పేరుపెట్టారు. 1952లో మొదటిసారిగా ఉగాండా, టాంజానియాల్లో మనుషులకు జికా వైరస్ సోకినట్టుగా తేలింది. తర్వాత మెల్లగా ఇతర దేశాలకు విస్తరించింది. 2015–16లో జికా వైరస్ మహమ్మారిగా మారింది. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని చాలా దేశాల్లో జికా వైరస్ ప్రతాపం చూపింది.
నాడీ మండలంపై ప్రభావం...
జికా వైరస్ లక్షణాలు మరీ ఇబ్బందిపెట్టే స్థాయిలో ఉండవు. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాల నొప్పులు ఉంటాయి. కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. బయటికి వైరస్ లక్షణాలు ఏమీ కనబడకపోయినా కూడా.. ‘గిల్లేన్ బారే సిండ్రోమ్ (నాడులు దెబ్బతిని చేతులు, కాళ్లపై నియంత్రణ దెబ్బతినడం, వణికిపోవడం)’ తలెత్తే ప్రమాదం ఉంటుంది.
గర్భస్థ శిశువులకు ప్రమాదం...
గర్భిణులకు సంబంధించి మిగతా చాలా రకాల వైరస్లతో పోలిస్తే జికా వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది గర్భంలోని శిశువులకు కూడా వ్యాపించి మైక్రోసెఫలీ (మెదడు సరిగా ఎదగదు. తల పైభాగం కుంచించుకుపోతుంది), ఇతర సమస్యలకు కారణం అవుతుంది.
ఎలా వ్యాపిస్తుంది?
- డెంగ్యూ, చికున్గున్యా, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులను వ్యాప్తి చెందించే ఎడిస్ రకానికి చెందిన దోమల ద్వారానే జికా వైరస్ కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు పగటిపూట మాత్రమే కుడతాయి.
- లైంగిక ప్రక్రియ ద్వారా, రక్తం ద్వారా కూడా వ్యాపిస్తుంది. గాలి, నీళ్లు, బాధితులను తాకడం వంటి వాటి ద్వారా ఇది సోకే అవకాశం లేదు. రక్త పరీక్ష ద్వారా ఈ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు.
- ఈ వైరస్ సోకినా కూడా.. ప్రతి పది మందికిగాను ఇద్దరిలో మాత్రమే లక్షణాలు ఉంటాయి.
- వ్యక్తులను బట్టి శరీరంలో మూడు రోజుల నుంచి 14 రోజుల మధ్య ఈ వైరస్ సంఖ్యను పెంచుకుని, లక్షణాలు బయటపడతాయి. వారం రోజుల్లోగా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.
- జికా వైరస్కు సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి చికిత్సగానీ, వ్యాక్సిన్గానీ ప్రస్తుతం అందుబాటులో లేవు. లక్షణాలను బట్టి సాధారణ మందులనే వినియోగిస్తారు.