Skip to main content

Tallest Top 10 Statues In India : భారతదేశంలో అత్యంత‌ ఎత్తైన టాప్ 10 భారీ విగ్రహాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏ దేశంలోనైనా.. విగ్రహాలు చరిత్రకు గుర్తులు. చరిత్రలో నిలిచిపోయే ఎందరో మహానుభావులు,మహాత్ములు, దేవతలను భారీ విగ్రహాల రూపంలో ప్రతిష్టించారు.
Tallest Top 10 Statues In India Telugu News
Tallest Top 10 Statues In India Details

భారతదేశంలో ఎన్నెన్నో ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి. అయితే అత్యంత ఎత్తుగా ఉన్న టాప్‌-10 విగ్రహాలు ఎక్కడెక్కడ.. ఎన్ని ఉన్నాయో. చూడండి..

ఈ విగ్రహాలు సదరు ప్రముఖలను గుర్తు చేయడమే కాకుండా పర్యాటక పరిశ్రమను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో అత్యంత పొడవు, ఎత్తుగా నిర్మించిన విగ్రహాలు ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయి. ఇందులో చరిత్రకెక్కిన వ్యక్తులతో పాటు దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లో నర్మదా సరోవర్ డ్యామ్ దగ్గర నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అత్యంత ఎత్తైనది. 597 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైనది.

1. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్ర‌త్యేక‌త‌లు ఇవే..:

Statue of Unity Details in Telugu

ముఖ్యంగా గుజరాత్‌లో నర్మదా సరోవర్ డ్యామ్ దగ్గర నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అత్యంత ఎత్తైనది. 597 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైనది.

స్వతంత్ర భారతావనికి తొలి హోమ్ మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఐరన్ మ్యాన్‌గా భారతీయుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఎన్నో చిన్న చిన్న సంస్థానాలను దేశంలో విలీనం చేయించేందుకు ఆయన కృషి మరువలేనిది. రాజకీయ నాయకుల్లో ఆజానుబాహుడిగా చెప్పుకునే ఆ మహోన్నత వ్యక్తిని కలకాలం గుర్తుంచుకునేలా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2013లో సంకల్పించింది. వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మాణానికి పూనుకుంది. చకాచకా పనులు మొదలుపెట్టింది.

సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ఈ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో నిర్మించారు. సర్దార్ సరోవర్ డ్యామ్‌కు కింద, డ్యామ్ వైపు చూస్తున్నట్లు ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ విశేషాలు ఇవే..
☛ దేశంలోని ఐక్యత, సమగ్రతకు చిహ్నంగా ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అని నామకరణం చేశారు.
☛ 182 మీటర్ల (600 అడుగులు) ఎత్తున్న ఈ విగ్రహం న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెండింతల పెద్దది.
☛ గుజరాత్‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్ నుంచి 200 కి.మీ. దూరంలో ఈ విగ్రహం ఉంది.
☛ ఈ విగ్రహం నిర్మాణంలో మొత్తం 2500 మంది కార్మికులు పాల్గొన్నారు. వీరిలో వందల కొద్ది చైనా కార్మికులు ఉన్నారు. 5000 కంచు పలకలతో విగ్రహం పూర్తిచేయడానికి వీరంతా రాత్రింబవళ్లు కష్టపడ్డారు.
☛ స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు వెళ్లడానికి గుజరాత్‌లోని కెవాడియా పట్టణం నుంచి సాధు దీవి వరకు 3.5 కి.మీ. హైవేను నిర్మిస్తున్నారు.
☛ ఈ విగ్రహాన్ని చాలా దృఢంగా నిర్మించారు. సెకెనుకు 60 మీటర్ల వేగంతో వీచే గాలులను, వైబ్రేషన్, భూకంపాలను ఈ విగ్రహం తట్టుకుని నిలబడుతుంది.
☛ ఈ విగ్రహం తయారీలో 22500 మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను వినియోగించారు.
☛ స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి అయిన ఖర్చు సుమారు రూ.2990 కోట్లు
సంబంధిత వార్తలు

2. సమతామూర్తి రామానుజాచార్య విగ్రహం : 

Statue of Equality Details in Telugu

తెలంగాణలోని హైదరాబాద్‌లో 216 అడుగుల ఎత్తులో నిర్మించిన సమతామూర్తి రామానుజాచార్య విగ్రహం. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన కూర్చున్న విగ్రహం. రామానుజాచార్యుల విగ్రహం హైదరాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉంది. దీనికి 'స్ట్యాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ'గా పేరు పెట్టారు.

వెయ్యేళ్ల క్రితమే కులమతాలకతీతంగా మనుషులంతా ఒక్కటేనని చాటిన ఐక్యతామూర్తి.. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన మహనీయుడు శ్రీరామానుజాచార్య. ప్రపంచానికి సమతా సిద్ధాంతాన్ని నేర్పించిన గురువు. ఆ మహానుభావుడు అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భం.. మరో వెయ్యేళ్లు సమతా సిద్ధాంతాన్ని చాటే అత్యద్భుత ఘట్టం ఇది.

విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు.. 
ఈ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 2013 లో ప్రారంభమైన ఈ ఆలోచనలు.. 2014లో విగ్రహా రూపంలో నిర్మాణం ప్రారంభం అయింది. రామానుజాచార్యుల శ్రీమూర్తి 14 రకాల నమూనాలను చినజీయర్‌స్వామి తయారు చేయించారు. అందులో మూడింటిని ఎంపిక చేసి, వాటిలో బాగా వచ్చిన రూపురేఖలను మిళితం చేసి, మరో నమూనా తయారు చేశారు. విగ్రహం పూర్తిగా పంచలోహాలతో తయారైంది. ఇందులో 83 శాతం రాగి వినియోగించగా.. వెండి, బంగారం, జింక్‌, టైటానియం లోహాలను వినియోగించి తయారు చేశారు. 
☛ ఈ వాస్తవ విగ్రహం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. రామానుజాచార్య చేతిలోని త్రిదండం (సాధారణంగా వైష్ణవ పీఠాధిపతుల చేతిలో ఉంటుంది) ఎత్తు 135 అడుగులు.
☛ మొత్తం వేదిక ఎత్తు 54 అడుగులు, పద్మ పీఠం ఎత్తు 27 అడుగులు. ఈ వేదికకు భద్రపీఠం అని పేరు పెట్టారు.
☛ కింద పీఠంతో కలపి 216 అడుగులు ఉంటుందీ విగ్రహం. ఆ విగ్రహం ఉండే పీఠంపై 54 కలువ రేకులు, వాటి కింద 36 ఏనుగు శిల్పాలు, కలువ రేకులపై 18 శంఖాలు, 18 చక్రాలు, విగ్రహం దగ్గరకు ఎక్కడానికి 108 మెట్లు ఉన్నాయి.
☛ వివిధ ద్రవిడ రాజ్యాల శిల్ప రీతుల మేళవింపు ఈ విగ్రహంలో కనిపిస్తుంది. విగ్రహం చేతి వేళ్ల గోర్ల నుంచి 135 అడుగుల భారీ దండం వరకూ ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ నిర్మాణం చేశారు. విగ్రహంలో రామానుజులు ధ్యాన ముద్రలో కనిపిస్తారు.
☛ ఆ భద్రపీఠంలో 120 కేజీల బంగారు విగ్రహం పెడుతున్నారు. రామానుజాచార్య 120 ఏళ్లు జీవించారని, కాబట్టి అన్ని కేజీల బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు ప్రకటించారు.

3. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహం.. :

hanuman statue srikakulam

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మడపంలోని.. వంశధార నది సమీపంలో ఉన్న 52 మీటర్ల (171 అడుగుల) ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ హనుమాన్ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహంగా పేరొందింది. 2020లో ప్రారంభించిన ఈ విగ్రహం భారతదేశంలోనే ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా నిలిచింది.

4. పంచముఖ హనుమాన్ విగ్రహం :

Panchmukhi Hanuman karnataka news telugu

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా కునిగల్‌లో 49 మీటర్లు (161 అడుగల) ఎత్తుతో ఈ పంచముఖ హనుమాన్ విగ్రహం ఉంది. 2022లో స్థాపించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పంచముఖ హనుమాన్ గా ఇది పేరొందింది. 

5. ముతుమలై మురుగున్ విగ్రహం :

ముతుమలై మురుగున్ విగ్రహం Telugu news

తమిళనాడులోని సేలంలో 44.5 మీటర్ల (146 అడుగుల) ఎత్తుతో ముతుమలై మురుగున్ విగ్రహం ఉంది. ఇది 2022లో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహంగా పేరొందింది. తమిళనాడులో మురుగన్ స్వామి అంటే కార్తికేయ భక్తులు చాలా మంది ఉన్నారు. కార్తికేయ పార్వతి, శంకరుల మొదటి కుమారుడే మురుగన్‌స్వామి. 

6. వైష్ణో దేవీ విగ్రహం :

వైష్ణో దేవీ విగ్రహం ఉత్తరప్రదేశ్‌

ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ లో 43 మీటర్ల (141 అడుగుల) ఎత్తుతో వైష్ణో దేవీ విగ్రహం ఉంది ఈ విగ్రహాన్ని 2010లో నిర్మించారు. దేశంలో మాతా వైష్ణో దేవికి చాలా మంది భక్తులు ఉన్నారు.

7. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండో.. విగ్రహం :

వీర అభయాంజనేయ స్వామి విగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలోని పరిటాల పట్టణంలో 41 మీ (135 అడుగులు) ఎత్తుతో వీర అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంది. 2003లో స్థాపించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండో ఆంజనేయ స్వామి విగ్రహంగా పేరొందింది. 

8. తిరువల్లువర్ విగ్రహం :

తిరువల్లువర్ విగ్రహం

తమిళనాడులోని కన్యాకుమారి వద్ద 40.5 మీర్లు(133 అడుగుల) ఎత్తులో ఈ తిరువల్లువర్ విగ్రహం ఉంది. 2000 సంవత్సరంలో నిర్మించిన ఈ విగ్రహం తిరుక్కురల్‌లోని మూడు విభాగాలను సూచిస్తుంది. అవి ధర్మం (38 అధ్యాయాలు), సంపద (70 అధ్యాయాలు), ప్రేమ (25 అధ్యాయాలు). ఈ విగ్రహం 95 అడుగుల (29 మీ) ఎత్తు , 38 అడుగుల (11.5 మీ) పీఠంపై ఉంది. ఎత్తైన రాతి శిల్పం విగ్రహం 3681 రాళ్లను కలిగి ఉంది. తమిళ తత్వవేత్త తిరువల్లువర్‌కు నివాళులర్పించేందుకు కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తిరువల్లువర్ ప్రసిద్ధ తమిళ కవి. ఈ విగ్రహం కన్యాకుమారి సముద్రంలో కొంత దూరంలో ఉన్న పెద్ద రాతిపై ప్రతిష్టించబడింది.

9. భారతదేశంలోనే ఎత్తైన బుద్ధుడి విగ్రహం ఎక్క‌డంటే..

బుద్ధుడి విగ్రహం

సిక్కిం రాష్ట్రంలో గౌతమ బుద్ధుని అందమైన విగ్రహం ఉంది. ఈ విగ్రహం తథాగత త్సల్ అని పిలువబడే రావంగల్‌లోని బుద్ధ పార్క్‌లో ఉంది. ఇది 39 మీటర్లు (128 అడుగుల) ఎత్తులో బుద్ధుడి విగ్రహం ఉంది. ఇది భారతదేశంలోనే ఎత్తైన బుద్ధుడి విగ్రహంగా పేరొందింది. 2006 నుంచి 2013 మధ్య నిర్మించారు. ఆ రావంగ్లా హిమాలయన్ బౌద్ధ సర్క్యూట్‌లో భాగం.

10. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ ఇక్క‌డే..

అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్

దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇందుకోసం 425 మంది సిబ్బంది రేయింబళ్లు శ్రమించారు. విగ్రహం ఎత్తు 125 అడుగులుంటే, 36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటైంది. విగ్రహం కోసం 791 టన్నుల స్టీల్ వాడినారు. 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగించారు.

☛ Happiest State in India : భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఇదే..! వీళ్ల సంతోషానికి కార‌ణం..

Published date : 25 Apr 2023 05:55PM

Photo Stories