Cheetahs In India: మళ్లీ భారత్‌కి వస్తున్న చీతాలు... ఈ సారి ఎన్నంటే...!
వేట, ఇతర జంతువుల భారిన పడడం, గ్రామస్తుల చేతిలో హతమవడం.. ఇలాంటి కారణాలతో ఇండియాలో చీతాలే లేకుండా పోయాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు మళ్లీ చీతాలు భారత్ బాట పడుతున్నాయి.
ఈ సారి 12 చీతాలు...!
దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు ఫిబ్రవరి 18న భారత్‌కు చేరుకోనున్నట్లు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు. ఇందులో ఏడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో జోహన్నెస్‌బర్గ్ నుంచి బయలుదేరి గ్వాలియర్‌కు చేరుకోనున్న ఈ చీతాల కోసం మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో పది క్వారంటైన్ ఎన్‌క్లోజర్లు సిద్ధం చేశారు.
చదవండి: చీతా.. చిరుత.. జాగ్వార్.. ఈ మూడింటిలో ఏది గ్రేట్ అంటే..?
పదేళ్ల పాటు ఏటా భారత్‌కు...
74 ఏళ్ల తర్వాత దేశంలో మళ్లీ చీతాలను ప్రవేశపెట్టిన భారత సర్కారు.. వాటి సంఖ్యను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. తొలివిడత కింద గతేడాది సెప్టెంబరులో నమీబియా నుంచి 8 చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కునో పార్కులో ఉన్న ఈ చీతాలు తరచూ వేటాడుతూ మంచి ఆరోగ్యంతో ఉన్నాయి. వాటిలో ఒక ఆడ చీతాకు క్రియాటినైన్ స్థాయులు పెరగటం వల్ల అస్వస్థతకు గురైనా, చికిత్స అనంతరం కోలుకుంది. వచ్చే పదేళ్ల వరకు ఏటా 12 చీతాలను దేశంలోకి దిగుమతి చేసుకునేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.