Jagananna Thodu: చిరు వ్యాపారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకం?
చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తొలుత 2020, నవంబర్ 25న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులతో పాటు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, బొబ్బిలి వీణ, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు. అధిక వడ్డీ రేట్లతో ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారులకు సహాయం చేయడమే జగనన్న తోడు పథకం ముఖ్య లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులు ఉంటారని అంచనా.
రుణం తీర్చిన వారికి మళ్లీ రుణం...
జగనన్న తోడు పథకం కింద రుణం తీసుకొని... ఆ రుణం మొత్తాన్ని వడ్డీతో సహా సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తే, ఆ వడ్డీని లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా జమ చేస్తుంది. ప్రభుత్వం ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. రుణం మొత్తం తీర్చిన వారికి బ్యాంకులు మళ్లీ రుణాలు మంజూరు చేస్తాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అర్హులకు రుణాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.
అర్హతలు ఇవే...
- గ్రామాలు మరియు పట్టణాల్లో సుమారు ఐదు అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు మరియు అంతకన్నా తక్కువ స్థలంలో... శాశ్వత లేదా తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు.
- చిన్న వ్యాపారి వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో రూ .10,000 కన్నా తక్కువ మరియు పట్టణాల్లో రూ .12,000 కన్నా తక్కువ ఉండాలి.
- ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, ఓటరు కార్డు లేదా మరేదైనా గుర్తింపు కార్డు ఉండాలి.
- రహదారి ప్రక్కన, ఫుట్‌పాత్‌లలో, ప్రభుత్వ, ప్రైవేటు ప్రదేశాల్లో బండ్లపై వ్యాపారం చేసేవారు, గంపలో తలపై సరుకులు తీసుకెళ్లేవారు అర్హులు.
- ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, ఆటోలపై వ్యాపారం చేసే వారు కూడా అర్హులు.
- మూడు ఎకరాల కంటే తక్కువ చిత్తడి భూమి ఉన్నవారు లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట ఉన్న వారు అర్హులు. చిత్తడి, మెట్ట భూమి రెండూ కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉన్నవారు కూడా అర్హులు.
ఎలా దరఖాస్తు చేయాలి?
- లబ్ధిదారులు గ్రామ/వార్డు వాలంటీర్లను సంప్రదించి దరఖాస్తుకు అవసరమైన పత్రాలను అందజేయాలి లేదా గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తును అందించవచ్చు.
- వాలంటీర్లు దరఖాస్తులను సచివాలయాల్లో అందజేస్తారు. అనంతరం దరఖాస్తు పరిశీలన పూర్తయిన తర్వాత... అర్హులైన లబ్ధిదారుల జాబితాను గ్రామ/వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు.
- పథకానికి అర్హత ఉన్నా కూడా లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేకపోతే గ్రామ/వార్డు సచివాలయ అధికారులను సంప్రదించి... మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.
- అర్హులైన వారికి బ్యాంకు అకౌంట్లు లేకపోతే... వారికి గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా బ్యాంకు ఖాతాను తెరుస్తారు.
రుణాల పంపీణి ఇలా...
- గ్రామ/వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించిన తరువాత... జిల్లా కలెక్టర్లు ఆ దరఖాస్తులను బ్యాంకులకు పంపుతారు.
- బ్యాంకులు దరఖాస్తులను పునఃపరిశీలించి రుణానికి అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 10 వేల వరకు జమ చేస్తాయి. ఆయా వివరాలను వాలంటీర్ల ద్వారా సచివాలయ అధికారులు లబ్ధిదారులకు తెలియజేస్తారు.
- సక్రమంగా రుణం చెల్లించే వారికి వడ్డీ తిరిగి చెల్లించే అంశాన్ని గ్రామ/వార్డు సచివాలయ అధికారులు బ్యాంకులతో చర్చించి ప్రాసెస్ చేస్తారు.
చదవండి: రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్