Skip to main content

ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్)

దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2018, సెప్టెంబర్ 23న ప్రారంభించారు.

జార్ఖండ్‌లోని రాంచీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించిన ప్రధాని.. పేదల సేవకు ఉద్దేశించిన పథకాల్లో ఇది అత్యంత ప్రభావవంతమైందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 23నుంచే ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ‘పీఎంజేఏవై - ఆయుష్మాన్ భారత్ పథకం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం. ఈ పథకం ద్వారా భారత్‌లో లబ్ధిపొందేవారి జనాభా.. అమెరికా, కెనడా, మెక్సికోల జనాభా మొత్తంతో సమానం’ అని మోదీ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా రెండో, మూడో తరగతి నగరాల్లో 2,500 ఆసుపత్రులు ఏర్పాటుకానున్నాయన్నారు. ‘ఇప్పటికే 13వేల ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగమయ్యాయి.

పథకం ప్రత్యేకతలివి..

  • సమాజంలో పదికోట్ల వెనుకబడిన కుటుంబాల్లోని దాదాపు 50 కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వస్తారు.
  • ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. అయితే లబ్ధిదారుడిగా నమోదు చేయించుకునేందుకు ఎన్నికల గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డును చూపించాలి.
  • గ్రామాలు, పట్టణాల్లో జరిపిన తాజా సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ) ఆధారంగా డీ1, డీ2, డీ3, డీ4, డీ5, డీ7 కేటగిరీల్లో ఉన్నవారు లబ్ధిదారులవుతారు. ఎస్‌ఈసీసీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణాల్లో 2.33 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని పొందవచ్చు.
  • ఇప్పటికే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో భాగంగా ఉన్నవారినీ ఆయుష్మాన్‌తో జోడిస్తారు. దేశవ్యాప్తంగా 445 జిల్లాల్లో ఈ పథకం ప్రారంభమైంది.
  • ఈ పథకంలో గుండెకు బైపాస్ శస్త్రచికిత్స, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, మోకాలిచిప్ప మార్పిడులు, మధుమేహం సహా 1,300కు పైగా వ్యాధులు వర్తిస్తాయి.
  • ఒక కుటుంబంలో ఇంతమందికే అన్న నిబంధనేమీ లేదు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు క్యాష్‌లెస్, పేపర్‌లెస్ వైద్యాన్ని అందజేస్తారు.
  • ఈ పథకంలో లబ్ధిదారులు ఆసుపత్రి పాలైతే.. చికిత్స కోసం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం సూచించిన లేదా.. పథకం జాబితాలో ఉన్న ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి.
  • ఇలాంటి ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ మిత్ర హెల్ప్ డెస్క్‌ల్లో సరైన గుర్తింపుకార్డులు చూపించాలి.
  • పథకం అమలును పర్యవేక్షించే నేషనల్ హెల్త్ ఏజెన్సీ (ఎన్‌హెచ్‌ఏ) mera.pmjay.gov.in సైట్‌ను, 14555 హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించింది.
  • లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ ఉన్న లేఖలు ఇస్తారు. వీటిని చూపించి వైద్యం చేయించుకోవాలి.
  • ఇప్పటికే 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు మాత్రం ఒప్పందంపై సంతకాలు చేయలేదు.
Published date : 28 Oct 2021 12:56PM

Photo Stories