Skip to main content

Climate Change: వాతావరణ సంక్షోభ రీత్యా.. భౌగోళిక మార్పలు..

Climate Change
Climate Change

ఇది కనివిని ఎరుగని పరిస్థితి. నిత్యం చల్లగా, హాయిగా ఉంటాయని పేరుపడ్డ ప్రాంతాలు కూడా ఇప్పుడు చండభానుడి దెబ్బకు చేతులెత్తేస్తున్నాయి. నిన్నటి దాకా వేసవిలో ఉష్ణపవనాల తాకిడికి భారత్‌ లాంటి అనేక దేశాలు అల్లాడితే, నేడు ఐరోపా ఖండం వంతు. కొద్దిరోజులుగా స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్‌ తదితర ప్రాంతాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పాత రికార్డులను బద్దలుకొట్టి, కొత్త చరిత్ర రాస్తున్నాయి. అయిదేళ్ళ క్రితం దాకా జూలైలో సగటున 20 డిగ్రీల సెల్సియస్‌ ఉండే బ్రిటన్‌లో ఇప్పుడది 40 దాటేసింది. ఉడుకెత్తిస్తున్న ఈ ఉష్ణపవనాలు ఇక తరచూ తప్పవట. కనీసం మరో 40 ఏళ్ళ పాటు 2060ల వరకు ఈ ధోరణి కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిక.  

Also read: Inspiring Story: అక్షరమే ఆమె ఆరోగ్య బలం... 82 ఏళ్ల వయసులో తొలి పుస్తకం

రెండు నెలల క్రితం ఫ్రాన్స్‌లో మునుపెన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన మే నెల ఎదురైంది. మళ్ళీ గత నెల కూడా ఫ్రాన్స్‌ నిప్పులకొలిమి అయింది. ఈసారి ఉష్ణపవనాలు స్పెయిన్, ఇటలీ సహా అనేక దేశాలను అల్లాడించాయి. ఈ నెలలో పోలండ్, తూర్పు ఐరోపాలోని ఇతర ప్రాంతాలు అత్యధిక ఉష్ణోగ్రత బారినపడ్డాయి. జూలై 19న బ్రిటన్‌లో కనివిని ఎరుగని ఉష్ణతాపం కనిపించింది. ప్రసిద్ధ లండన్‌ హీత్రూ విమానాశ్రయంలో భానుప్రతాపం 40 డిగ్రీలు దాటేసింది. ఇప్పటికే ఐరోపాలో అల్లాడుతున్న ప్రజానీకానికి మరో రెండు నెలలైతే కానీ వేసవి ముగియదని గుర్తొచ్చినప్పుడల్లా గుండె గుభేలుమంటోంది. 

Also read: Online Gambling: ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌... యాప్స్‌పై అవగాహన..

భరించలేని వేడి, ఉక్కపోతల బాధ అలా ఉంటే, వేడిగాలుల దెబ్బకు ఫ్రాన్స్, గ్రీస్, పోర్చుగల్, స్పెయిన్‌ – ఇలా అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు రేగడం మరో పెనుసమస్యయింది. వేలకొద్దీ ఎక రాల భూమి, పంట అగ్నికీలలకు ఆహుతి అవుతున్నాయి. మంటల్ని అదుపులో ఉంచడం అగ్ని ప్రమాద నివారక బృందాలకు నిత్యపోరాటమైంది. మంటలతో పాటు దట్టమైన పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో వేలాదిగా ప్రజల్ని అక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్న పరిస్థితి. క్రూరమైన ఎండల తాకిడికి చెలరేగిన మంటలతో లండన్‌లో అగ్నిప్రమాద నివారక బృందాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మునుపెన్నడూ లేనంత బిజీగా  జూలై 19న గడిపాయట. ఇంతటి ఎండలను తట్టుకొనేలా నిర్మించకపోవడంతో బ్రిటన్‌లో రోడ్లు, రైలు పట్టాలు, తీగలు, సిగ్నలింగ్‌ వ్యవస్థలు దెబ్బతిని, రవాణా వ్యవస్థకు ఆటంకాలు ఎదురయ్యాయి. స్కూళ్ళు, ఆఫీసులు మూతబడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also read: ప్రపంచ భౌగోళిక అంశాలు

అమెరికాలోనూ వేడిగాలులు విలయం సృష్టిస్తున్నాయి. అక్కడ శరవేగంతో వృద్ధి చెందుతున్న నగరాల్లో కోటికి పైగా జనాభా ఉక్కపోతతో మగ్గిపోతున్నారు. టెక్సస్, క్యాలిఫోర్నియా, అలాస్కా – ఇలా కనీసం 13 రాష్ట్రాల్లో దాదాపు వంద కార్చిచ్చుల్లో 30 లక్షలకు పైగా ఎకరాలు బూడిదయ్యాయి. వాతావరణ సంక్షోభ రీత్యా దేశంలో తక్షణం ‘జాతీయ వాతావరణ ఎమర్జెన్సీ’ని ప్రకటించాలని జులై 19న పలువురు సెనేటర్లు సైతం కోరాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ఎమర్జెన్సీ ప్రకటి స్తారో, లేదో కానీ, యమ అర్జెంటుగా కొత్త చర్యలకు దిగక తప్పదు. పునరుద్ధరణీయ ఇంధన విధా నాలనూ, పర్యావరణ అనుకూల రవాణా పద్ధతులనూ అనుసరించేలా సత్వర ఆదేశాలిస్తేనే ఫలితం.   

Also read: తుపాన్లకు పేర్లు... ఎవరు... ఎందుకు పెడతారో తెలుసా?

ఈ దుష్పరిణామాల పాపంలో ప్రపంచ దేశాలన్నిటికీ వాటా ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలన్న లక్ష్యంలో ఇప్పటికీ అమెరికా, చైనా సహా అగ్ర రాజ్యాలు వెనుకబడే ఉన్నాయి. వర్ధమాన దేశాలకు లక్ష్యాలు పెట్టడమే తప్ప, స్వయంగా పెద్దన్నలు చేస్తున్నది తక్కువే. గత రెండే ళ్ళుగా బ్రిటన్‌లో ఆగస్ట్‌ వాతావరణం మారి, కూలర్లు, ఏసీలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్లు కుంగి, ఇంటి గాజు పైకప్పులు కరిగిపోతూ నిత్యం 40 – 45 డిగ్రీలుండే సూడాన్‌ లాగా బ్రిటన్‌ మండిపోతుంటే, వాతావరణంపై అత్యవసర సమావేశానికి హాజరు కాకుండా, ప్రభుత్వ ఖర్చుతో వీడ్కోలు విందు ఇచ్చే పనిలో ఆ దేశ ప్రధాని ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం? ఉప ప్రధాని ఏమో విషయ తీవ్రతను వదిలేసి, ‘ఎండల్ని ఎంజాయ్‌ చేయండి’ అన్నారంటే ఇంకేమనాలి?

Also read: అంతర్జాతీయ సరిహద్దులు

ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల్లో ప్రమాదస్థాయిని మించి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సంగతిని ‘నాసా’ సైతం తాజాగా ధ్రువీకరించింది. గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలతో మన పుడమి ఇంటిని మనమే నాశనం చేసుకుంటున్నామని ఐరాస ప్రపంచ వాతావరణ సంస్థ నెత్తీనోరూ బాదు కుంటోంది. ఏటేటా పెరుగుతున్న ఈ ఉష్ణపవనాలతో లండన్, ఢిల్లీ సహా ప్రపంచంలో కనీసం 10 ప్రధాన నగరాల్లో భవిష్యత్తులో తాగడానికి చుక్కయినా భూగర్భ జలాలు లేకుండా పోతాయని ఓ తాజా నివేదిక. ‘డే జీరో’ అని ప్రస్తావించే ఆ రోజు ఎంతో దూరంలో లేదట. మరో మూడేళ్ళలోనే ఈజిప్ట్‌ రాజధాని కైరోలో, పాతికేళ్ళలో లండన్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందట. 2018లోనే కేప్‌ టౌన్‌ నగరంలో ఇలా పరిస్థితి పీకల మీదకొచ్చింది. చివరకు ‘డే జీరో’ను నివారించేందుకు ఆ నగరంలో నీటి వినియోగాన్ని సగానికి తగ్గిస్తూ, అత్యవసర చర్యలు అమలుచేయాల్సి వచ్చింది. ఇవన్నీ గమనించైనా చేతులు కాలక ముందే తెలివితెచ్చుకోవడం ప్రపంచ దేశాలకు మేలు. భూగోళం వేడెక్కుతోంది. కార్చిచ్చుల దెబ్బకు ఫ్రాన్స్‌లో వేలమంది ఇల్లూవాకిలి పోయిన వేళ, ఆ వేడి పాశ్చాత్య ప్రపంచానికీ తెలిసొస్తోంది. ఇకనైనా దేశాలన్నీ సమష్టిగా కదిలితే మంచిది. త్రికరణశుద్ధిగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే, రాబోయే రోజుల్లో చండప్రచండ తాపం ఎవరినీ వదిలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది. పారాహుషార్‌! 

Also read: ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్టు ఎత్తు ఎంత?

Published date : 21 Jul 2022 04:58PM

Photo Stories