Skip to main content

తుపాన్లకు పేర్లు... ఎవరు... ఎందుకు పెడతారో తెలుసా?

‘అంఫన్’.. ఇది ప్రస్తుతం మనదేశంలోని కొన్ని రాష్ట్రాలపై విరుచుకుపడుతున్న తుపాన్ పేరు... ఇది అత్యంత తీవ్రమైన తుపాను అని, 1999 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ తరుణంలో తుపానులకు పేర్లు ఎవరు.. ఎందుకు.. ఎలా పెడతారో తెలుసుకుందామా..?
హుద్హుద్.. తిత్లీ.. పెథాయ్ పేర్లు వేరైనా ఇవన్నీ మన రాష్ట్రంలో విరుచుకుపడిన తుపానులు. వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకు తుపానులకు పేర్లు పెట్టడం అవసరం. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపానులకు పేర్లు పెడుతున్నాయి. ఉదాహరణకు తిత్లీ పేరును పాకిస్థాన్, గజను శ్రీలంక సూచించాయి. తాజాగా ఒడిశా, పశ్చిమ బంగాలను భయపెడుతున్న తుపానుకు అంఫన్ అని పేరు పెట్టింది థాయ్లాండ్. అంఫన్ అంటే థాయిలాండ్ భాషలో ఆకాశం అని అర్థం. ప్రస్తుత జాబితాలో చివరి పేరు అంఫన్.

వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు..
కనీసం 61 కి.మీ. వేగం గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అమెరికాలో తుపాన్లను టోర్నెడోలని, చైనాలో ఏర్పడే వాటిని టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే వాటిని సైక్లోన్స్ అని పిలుస్తారు. అలాగే ఆ్రస్టేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుపాన్లను విల్లీవిల్లీస్, వెస్ట్ ఇండీస్ దీవుల్లోని తుపాన్లను హరికేన్స్ అంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబరులో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెట్టారు. ఎవరైనా సరే తుపాన్లకు పేర్లు పెట్టవచ్చు. భారత వాతావరణ విభాగానికి ఈ పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమోదిస్తే ఆ పేరు భారత తరపున జాబితాలో చేరుతుంది.

మొత్తం 13 దేశాలు..
2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కు చేరుకుంది. ఏప్రిల్లో ఈ దేశాలు 169 పేర్లు సూచించాయి. తర్వాత వచ్చే తుపానులకు నిసర్గా (బంగ్లాదేశ్), గతి(భారత్), నివార్ (ఇరాన్), బురేవి (మాల్దీవులు), తౌక్టే (మయన్మార్), యాస్ (ఒమన్) పిలుస్తారు. భారతదేశం గతితో పాటు తేజ్, మురాసు, ఆగ్, వ్యోమ్, జహర్, ప్రోబాహో, నీర్, ప్రభాజన్, ఘుర్ని, అంబుడ్, జలాధి, వేగా వంటి పేర్ల సూచించింది. వాతావరణ శాఖ నిబంధనల మేరకే ఈ పేర్లు పెడతారు. ఉచ్ఛరించడానికి సులువుగా, ఎనిమిది అక్షరాల లోపే పేర్లు ఉండాలి. ఎవరి భావోద్వేగాలు, విశ్వాసాలను దెబ్బతీయకూడదు.
Published date : 21 May 2020 05:27PM

Photo Stories