Skip to main content

Wayanad Landslides: వయనాడ్‌లో పర్యావరణ విధ్వంసం.. దీనికి మనిషి దురాశే కారణం!

అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్‌ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ.
Dry and hot conditions in Wayanad due to excessive construction  Construction on hilly areas in Wayanad causing environmental changes Climate change, unplanned growth may be linked to Wayanad landslides

అసలే కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్‌–సెప్టెంబర్‌ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కన్ను తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఊహాతీతంగా పెరుగుతోంది. 

దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది.

పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్‌ చెబుతోంది. 

Apollo 11 Mission: అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు ఇదే..

ఈ విధ్వంసానికి మనిషి దురాశే కారణం.. 
వయనాడ్‌ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ మరియం జకారియా అన్నారు. ‘వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్‌ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ’ అని వివరించారు. 

‘వాయు, సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు దోహదపడుతోంది. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వంటివి తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది’ అని జకారియా అన్నారు.

అటకెక్కిన కమిటీ సిఫార్సులు.. 
అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కేరళ ప్రత్యేకత. కొంత ప్రాంతాలు ఎక్కువ కావడంతో దాదాపుగా సగం రాష్ట్రం 20 డిగ్రీల ఏటవాలు కోణంలో ఉంటుంది. పెలుసుబారిన మట్టితో కూడిన కొండల పై ప్రాంతాలు భారీ వర్షాలకు విరిగిపడటం పరిపాటి.. 

➣ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే!  దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239!

International Space Station: ‘ఐఎస్‌ఎస్‌’ను కూల్చాల్సిన అవసరం ఏంటి.. దీనికి ‘నాసా’ ఏం చెప్పింది?

➣ 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. 
➣ పశ్చిమ కనుమల్లో 61 శాతాన్ని పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతంగా ప్రకటించి పరిరక్షించాలని మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ 13 ఏళ్ల క్రితమే కేంద్రానికి సిఫార్సు చేసింది. 

➣ కేరళలో కొంత ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులూ జరగకుండా చూడాలని పేర్కొంది. 
➣ గనుల తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, జల–పవన విద్యుత్కేంద్రాలు, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం తదితరాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది. 

➣ కానీ ప్రజల జీవనోపాధికి, రాష్ట్రాభివృద్ధికి ఈ సిఫార్సులు గొడ్డలిపెట్టంటూ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. 
➣ వయనాడ్‌లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60 శాతానికి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. 

➣ అదే సమయంలో జిల్లావ్యాప్తంగా తేయాకు తోటల సాగు ఏకంగా 1,800 శాతం పెరిగిపోయిందని వివరించింది. 
➣ కొండ ప్రాంతాల్లో నేల పై పొరల్ని గట్టిగా పట్టి ఉంచే చెట్లు తదితరాలు లేకపోవడం కొద్దిపాటి వర్షాలకే మట్టిపెళ్లలు విరిగిపడటం పరిపాటిగా మారింది.

World Population: 1000 కోట్లు దాటనున్న ప్రపంచ జనాభా.. ఎప్ప‌టిలోపు అంటే..

Published date : 01 Aug 2024 01:50PM

Photo Stories