Skip to main content

విషతుల్యమైపోతున్న విద్య

వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు.
ఏ తరగతి గదైనా విద్యార్థులను విద్య గురించి ఆలోచింపచేయాలి. భవిష్యత్తును గురించి భవ్యమైన కలలు కనేటట్టు ప్రేరేపించగలగాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ప్రస్తుతం చాలా తరగతి గదులలో విద్యార్థులు బయటకెళ్లి విషం తాగడం గురించీ, ఉరితాళ్లు పేనుకునే పద్ధతి గురించీ ఆలోచిస్తున్నారు. ఈ అక్టోబర్‌లో మూడు వారాలు గడిచాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలోను ఈ మూడు వారాలలోనే బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య అక్షరాలా యాభై. రోజుకు ఒకరి కంటే ఎక్కువ మంది బడికి బదులు బలవన్మరణాన్ని ఎంచుకున్న సంగతి దాచేస్తే దాగని సత్యం. ఉన్నత పాఠశాలల విద్యార్థులు మొదలుకొని, కాబోయే ఇంజనీర్లు, మెడికోలు కూడా ఇలాంటి ఘోరమైన మార్గాన్ని ఎంచుకున్న వైనాలు మనసున్న ప్రతివారిని కలచివేస్తున్నాయి. మానవత్వం ఉన్న వారందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. అసలు ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచే ఇలాంటి అత్యంత దురదృష్టకర, విషాదకర పరిణామం ఆరంభమైపోయింది. అప్పటి నుంచి చూస్తే దాదాపు వందమంది విద్యార్థులు ఈ వినాశకాలపు విద్యా విధానానికి బలైపోయారు. నిజానికి గడచిన మూడేళ్లుగా ఇదే ధోరణి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనే నారాయణ, చైతన్య కళాశాలల్లో ఆ మూడేళ్లలో మరణించిన వారి సంఖ్య అరవై. 1995-2000 సంవత్సరాల మధ్య 1,400 మంది విద్యార్థులు బలవన్మరణం పాలైనారు. అంటే ఈ ధోరణి ఎంత బలపడుతున్నదో ఇప్పటికై నా అర్థం చేసుకోవాలి. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నాలుగు రోజుల తేడాలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం, ఆగస్ట్ 17, 2017న అనంతపురంలో ఒక మెడికో ఆత్మహత్య చేసుకోవడం ఈ సమస్య తీవ్రతలో మరో కోణాన్ని వెల్లడిస్తున్నాయి. కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులలో ఇంటర్మీడియెట్ విద్యార్థులే అత్యధికం. కార్పొరేట్ కళాశాలలే ఈ పాపాన్ని ఎలాంటి భీతి లేకుండా మూటగట్టుకుంటున్నాయి.

మౌన ప్రేక్షకులమైపోతున్నామా?
భావి భారతానికి నిజమైన సంపద పిల్లలు. వారికి చదువును సమాజం వరంగా ఇవ్వాలి. కానీ చదువు చెప్పే తరగతి గదులలో ఎదురవుతున్న ఒత్తిడికి వీరు ఆత్మహత్యలకు పాల్పడడమే వర్తమానకాలపు అతి పెద్ద విషాదం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న విద్యార్థుల బలవన్మరణాల పరంపర చూసి సమాజం ఇంకా మౌనంగా ఉండడం అంతకంటే పెద్ద విషాదం. రెండు రాష్ట్రాలను కుదిపివేస్తున్న ఈ సమస్యకు వెంటనే పరిష్కార మార్గాలను కనుక్కోవాలి. కార్పొరేట్ కళాశాలల్లో పోటీ పరీక్షలకు తయారయ్యేవారు ఆత్మహత్యలకు పాల్పడడం కొత్త కాదు. కానీ ఇంత జరుగుతున్నా ఆ కళాశాలలు ఏ విధంగా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయో; సమాజం, మేధావులు కూడా వీటికి అలవాటు పడిపోయినట్టు వ్యవహరిస్తున్నారో గమనిస్తే మనసు మరింత వికలమవుతుంది. ప్రతిసారి సంఘటన జరగగానే పత్రికలలో దాని పైన సంపాదకీయాలు, వ్యాసాలు రావడం, చానల్స్‌లో దృశ్యాలు చూపిం చడం, ప్రభుత్వం కమిటీలు వేయడం, మూడునాలుగు రోజులకు ప్రజలు మర్చిపోవడం- ఇదే తంతు. సమస్య పరిష్కారం కోసం నియమించిన సంఘాలు నివేదికలు ఇస్తున్నాయి. కానీ వాటిని బుట్ట దాఖలు చేయడం సర్వసాధారణంగా మారింది. విద్యార్థుల ఆత్మహత్యల వంటి లోతైన సమస్య గురించి కూడా విచారణ సంఘాల పేరుతో నాన్చివేత ధోరణిని ప్రదర్శిం చడం ఏ ప్రభుత్వం విషయంలో అయినా క్షంతవ్యం కాబోదు. ఈ నాన్చివేత, పలాయనవాదం నిజం కాకపోతే ఇలాంటి సమస్య మీద సంఘాలు ఇచ్చిన సిఫారసులను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు? ఇన్ని వందల మంది చనిపోతున్నా ఏ ఒక్కరినీ ఎందుకు బోనులో నిలబెట్టలేదు? ఇప్పటిైకైనా సమస్య తీవ్రతను గురించి మనస్సాక్షితో ఆలోచించవలసిందే. విద్యారంగంలో పెరిగిపోతున్న దుష్పరిణామాల గురించి గతంలో నీరజ కమిటీ సమగ్ర నివేదిక ఇచ్చింది. అన్ని విద్యార్థి వసతి గృహాలను ఆ సంఘం స్వయంగా తిరిగి సమగ్ర నివేదికలను అందచేసింది. ఇప్పటికీ ఆ నివేదిక సిఫారసులు అమలుకు నోచుకోలేదు. అదే అమలు జరిగి ఉంటే విద్యార్థి వసతి గృహాల పరిస్థితులు

చాలా వరకు మారేవేమో!
పుండోదిక్కున ఉందంటే మందో దిక్కున పెట్టే అలవాటు మన వ్యవస్థది. పిల్లలు చదువు ఒత్తిడి వల్ల చనిపోతున్నారా? లేక వసతిగృహాలలో ఉండే వాతావరణానికీ, ఆయా కళాశాలల అసమర్థ నిర్వహణకూ బలవుతున్నారా? ముఖ్యంగా విద్యార్థినుల వసతి గృహాలను ఎలా నిర్వహించాలి? మొత్తంగా విద్యార్థినీ విద్యార్థుల మానసిక ఒత్తిడికి కారణాలేమిటి? మనసారా సాగవలసిన చదువు విద్యార్థిని ఎందుకు అంత దారుణమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నది? రోజుకు ఎన్నిగంటలు చదివిస్తున్నారు? ఒక విద్యార్థికి మానసిక వికాసానికి ఆ వసతి గృహాలలో ఉన్న వాతావరణం సరైనదేనా? నాలుగు గోడల మధ్య రోజుల కొద్దీ ఉండడం వల్ల పిల్లల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఇలా, ఒక్కటి కాదు, ఈ అంశం బుర్రలోకి రాగానే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ప్రశ్నావళి ఇది.

సృజనకు సంకెళ్లు
వేకువ నాలుగు గంటల నుంచి రాత్రి పది వరకు అప్పుడే ఎదుగుతున్న విద్యార్థుల మేధస్సుల మీద ర్యాంకులు, మార్కుల జమిలి రంపపు కోత యథేచ్ఛగా సాగుతుంది. ఆ వయసు తీవ్రంగా కాంక్షించే ఆటపాటలు ఉండవు. బయటి ప్రపంచంతో సంబంధం లేదు. ఒక్కొక్కగదిలో ఐదారు నుంచి నుంచి పదిమంది వరకు పిల్లలను కుక్కుతారు. రుచి మాట దేవుడెరుగు! భోజనం పరిశుభ్రత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోరు. అన్నిటికంటే క్రూరమైనది చదువు ఒత్తిడి. గంటల కొద్ది బట్టీ పట్టించడం పెద్ద శిక్ష. పిల్లల సామర్థ్యం, యోగ్యతలను చూడకుండా అత్యాశతో యాజమాన్యాలు వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. బందెల దొడ్డిలో పశువులను పెట్టిన తీరులో వారిని నిర్బంధిస్తారంటే అతిశయోక్తి అనిపించుకోదు. అక్కడ నుంచి నిత్యం ఒత్తిడే. పరీక్షలు దగ్గర పడేసరికి అది పతాకస్థాయికి చేరుకుంటుంది. అది తట్టుకోలేకే పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ ఒత్తిడి గురించి వింటే చండామార్కుల వారి లీలలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి స్థితిలో చదువు మీదే కాదు, జీవితం మీద సయితం విరక్తి కలగడానికి కావలసిన అన్ని పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెబితే తప్పా! హైదరాబాద్‌లోని నారాయణ కళాశాల బాధలు తట్టుకోలేక అదృశ్యమైన సాయి ప్రజ్వల తన లేఖలో చేసిన ఆరోపణలు ఇవే కదా! ‘నారాయణ కాలేజీ పిల్ల లను చదువు పేరుతో చంపుతోంది. పిల్లలను కాపాడండి!’ అంటూ ఆ బాలిక రాసిన లేఖ కనువిప్పు కలిగించాలి. ఈ నరకం విస్తృతి ఎంతో ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుంది. ఏపీ విషయమే తీసుకుందాం. అక్కడ మొత్తం 3,500 కళాశాలలు ఉన్నాయి. ఇందులో 525 మాత్రమే ప్రభుత్వ కళాశాలలు. మిగిలినవి దాదాపు కార్పొరేట్ కళాశాలలే. అంటే ఆరేడు లక్షల మంది పిల్లలు నిత్యం ఇలాంటి నరక యాతననే అనుభవిస్తున్నారు. లేదా చూస్తున్నారు.

లెక్కలేనన్ని లోపాలు
కార్పొరేట్ కళాశాలల్లో వారం రోజులకొకసారి పరీక్షలు నిర్వహిస్తారు. నెలకొకసారి ఆ పరీక్షలు జరపండని కొందరు సూచిస్తున్నారు. ఇది సరైనా పరిష్కారామా? పరీక్షల గురించి ఆలోచించేటప్పుడు తరగతి గదిలోని అన్ని స్థాయిలలోని విద్యార్థులను దృష్టిలో ఉంచుకోవాలి. ఒకదశలో ఇంటర్నల్ మార్కులు కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇది సమంజసమే. అది చాలా దేశాలలో అమలులో ఉన్నది. కానీ ఇక్కడ ఇంటర్నల్‌లో మార్కులు ఎక్కువగా వేస్తున్నారని ఈ పద్ధతికి స్వస్తి చెప్పారు. పరిపాలనాపరమైన దోషాలు కూడా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. దీనిని అడ్డం పెట్టుకుని ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తివేయటం ఎంతవరకు సమంజసం? దీనితో విద్యార్థులు తరగతిలో చెప్పే చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంసెట్‌కు వచ్చి క్వశ్చన్ పేపరు చూస్తే 3 గంటలు పేపరుంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థి ఆలోచనకన్నా సమాచారం కనుక్కోవడానికి ప్రశ్నలు రూపొందిస్తున్నారు. అందుకే సమాధానాలను బట్టీ పట్టిస్తున్నారు. లేకపోతే కాపీ విధానానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. పేపర్ సెట్టింగ్‌ను మార్చకుండా ఈ బట్టీ విధానాన్ని తొలగించలేం. ఈ విధానం 40 ఏళ్లుగా ఇదే మూస పద్ధతిలో కొనసాగుతున్నది. కొన్ని దేశాల్లో పేపర్ సెట్టింగ్‌ను ప్రతి ఏడాది సమీక్షించే విధానం ఉంది. దేశ అవసరాలు, విద్యా ప్రమాణాల మధ్య బేరీజు వేసుకుని ఎప్పటికప్పుడు పేపర్ సెట్టింగ్‌ను వారు మార్చుకుంటారు. సమాచారంపైననే పరీక్ష విధానం ఉంటే బట్టీ విధానం కొనసాగుతూనే ఉంటుంది.

ప్రభుత్వం ఈ పరీక్షా విధానాన్నే మార్చడానికి ప్రయత్నించాలి. అప్పుడే పిల్లలపై ఒత్తిడి తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా, వృత్తి పరమైన కోర్సును ఎంచుకునే పద్ధతిలోనే లోపం ఉన్నది. వృత్తి విద్యా కోర్సుకు వెళ్ళాలంటే విద్యార్థికి ఒక పరీక్ష నిర్వహిస్తేనే సరిపోతుందా? ఒక్క టెస్ట్ పాసయితే సరిపోతుందా? అమెరికా, ఇంగ్ల్లండ్, యూరోపియన్ దేశాలలో వైద్య విద్యకు వచ్చే విద్యార్థి దృక్పథానికి నాలుగైదు కొలబద్దలు పెట్టారు. ఫలానా వృత్తిని ఎన్నుకుంటున్నాడంటే దాని వెనుక హేతువు ఏమిటో ఆ విద్యార్థి నుంచే తెలుసుకోవాలి. తల్లిదండ్రులకు ఫీజు కట్టే స్థోమత ఉంది కాబట్టి సదరు వృత్తి విద్యాకోర్సును ఎన్నుకుంటున్నాడా? ఆ విద్యార్థిలో ఆసక్తిని కనుక్కునేందుకు, సామాజిక స్పృహ కనుక్కునేందుకు ఈ అంశాన్ని కూడా ఒక కొలబద్దగా పెట్టుకున్నారు. తరగతి గదిలో ఆ విద్యార్థి అభివ్యక్తి, వ్యక్తీకరణ, ఇంటర్నల్ మార్కులు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు.

ప్రభుత్వం చేయాల్సిన పనులలో మొదటిది విద్యార్థి వసతి గృహాల క్షాళన. ఇంకా, బోధన, పరీక్షా విధానం, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం విషయంలో నీరజ కమిటీ నివేదికను అమలు పరచాలి. గతంలో చక్రపాణి కమిటీ చేసిన సిఫారసులను బైటపెట్టి చర్చించాలి. పేపర్ సెట్టింగ్ విధానం మారాలి. ఇంటర్నల్ మార్కులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. పరిపాలనా పరమైన దోషాలను మొదట నివారించాలి. తరగతి గది బోధనను శక్తిమంతం చేయాలి. ఇవన్నీ సక్రమంగా అమలు జరుపగలిగితే విద్యార్థుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించవచ్చు.
Published date : 20 Oct 2017 02:22PM

Photo Stories