Odisha Balasore Train Accident : ఒడిశా రైళ్ల ప్రమాదం కళ్లు తెరిపిస్తుందా.. ప్రమాదానికి కారకులెవరు.. కారణాలేమిటి..?
187 మృత దేహాలను ఇంకా గుర్తించాల్సివుందంటున్నారు. జూన్ 2న సంజె చీకట్లు అలుముకుంటున్న వేళ హౌరా నుంచి చెన్నైకి వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లోకి ప్రవేశించి అక్కడున్న గూడ్స్ రైలును ఢీకొట్టడం, ఆ ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన బోగీల్లో ఒకటి రెండు పక్క ట్రాక్‌పై పడడం, ఆ ట్రాక్‌పై వెళ్లే బెంగళూరు– హౌరా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సైతం ప్రమాదంలో చిక్కుకోవడం ఊహకందని ఉత్పాతం.
మృతుల సంఖ్య 275 వరకూ ఉండగా, 1100 మంది గాయపడ్డారు. వీరిలో కనీసం వందమంది వరకూ తీవ్ర గాయాలపాలైనవారున్నారు. విద్రోహ చర్యనో, సాంకేతిక తప్పిదమో ఇంకా నిర్ధారించాల్సే ఉన్నా ఆ దుర్ఘటన వందలాది కుటుంబాల భవితవ్యాన్ని తలకిందులు చేసింది. అనేకులు శాశ్వత అంగవైకల్యం బారినపడ్డారు. సహాయ బృందాలు వచ్చేలోగా స్థానికులు చూపిన చొరవ ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఇది విద్రోహ చర్య కావొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెబుతున్నారు. కారకులెవరో కూడా తెలిసిందంటున్నారు.
ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కూడా ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడాన్ని కొట్టిపారేయ లేమన్నది రైల్వే అధికారుల మాట. చెప్పడానికి ఇది బాగానేవున్నా.. ఆ వ్యవస్థలో లోపాన్ని గుర్తించి మొన్న ఫిబ్రవరిలో నైరుతి రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ రాసిన లేఖ విషయంలో దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలేమిటో ఉన్నతాధికారులు వెల్లడించాలి.
ఆ లేఖలోని అంశాలు భీతి గొలుపుతాయి. ఆ నెల 8న బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఇప్పుడు బాలాసోర్‌లో కోరమండల్‌కు ఎదురైన లాంటి సమస్యే వచ్చింది. మెయిన్ లైన్‌లో పోవచ్చని వచ్చిన సిగ్నల్‌కు భిన్నంగా ట్రాక్ మారటాన్ని గమనించి లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు.లేకుంటే అది కూడా పెను ప్రమాదంలో చిక్కుకునేది.
మన దేశంలో అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరసగా పట్టాలెక్కుతున్నాయి. అహ్మదాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు నడుస్తున్నాయి. కానీ మన రైల్వేల పనితీరు అంతంత మాత్రమే. రోజూ మన రైళ్లు 2 కోట్ల 20 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. 1950లో ఉన్న మన రైల్వే ట్రాక్‌ల నిడివి 53,596 కిలోమీటర్లయితే, ఇప్పుడది 68,100 కి.మీ.కి చేరుకుంది. అప్పట్లో మన రైల్వే ట్రాక్‌ల నిడివిలో సగం కన్నా తక్కువగా.. అంటే 21,800 కి.మీ. మాత్రమే ఉన్న చైనాలో 1997 నాటికి 66,000 కిలోమీటర్లకు చేరుకోగా, ప్రస్తుతం అది 1,55,000 కి.మీ ఉందని అంచనా.
అంటే మనకు రెట్టింపు అన్నమాట. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న కేటాయింపులతో పోలిస్తే ఇప్పుడు రైల్వే కేటాయింపులు అయిదు రెట్ల వరకూ పెరిగిన మాట వాస్తవమే అయినా... దానికి తగినట్టు సదుపాయాలు పెరుగు తున్న దాఖలా గానీ, మెరుగైన బోగీలు తెస్తున్న తీరు గానీ కనబడటం లేదు. భద్రతా అంశాలు సరేసరి. తరచుగా రైళ్లలో ప్రయాణించేవారికి ఇవన్నీ నిత్యానుభవం.
ప్రభుత్వ రంగ ఉద్యోగాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి. రైల్వే శాఖ కూడా దీనికి మినహాయింపు కాదు. మొన్న జనవరి గణాంకాల ప్రకారం ఆ శాఖలో 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా పడి వున్నాయి. వీటిల్లో చాలా పోస్టులు భద్రత, నిర్వహణ, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించినవే. సెంట్రల్ రైల్వేలో భద్రతకు సంబంధించిన విభాగంలో 28,650 పోస్టులుంటే అందులో సగం ఖాళీలే. కొత్త రైళ్లు వస్తున్నాయి. వాటి వేగం కూడా పెరుగుతోంది. కానీ అందుకు తగినట్టుగా ట్రాక్‌లు ఉంటున్నాయా? సిబ్బంది పెరుగుతున్నారా? పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (07-13 మే 2023)
వేగవంతమైన రైళ్లు వచ్చాయని సంబరపడుతున్నాం గానీ.. ఇప్పటికీ మన రైళ్ల సగటు వేగం గంటకు 50 కిలోమీటర్లు మించడం లేదు. దీన్ని అయిదేళ్లలో 75 కిలోమీటర్లకు పెంచుతామని 2017లో రైల్వే బోర్డు ప్రకటించింది. కానీ అది కలగా మిగిలిందని ఇటీవలే కాగ్ అక్షింతలు వేసింది. జపాన్, చైనా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌లలో రైళ్ల సగటు వేగం 150 – 250 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. మన రైళ్ల సగటు వేగం నాసిరకంగా ఉన్నా భద్రతాపరంగా మెరుగైన స్థితిలో ఉండలేకపోతున్నాం.
రైళ్లు పెరిగినా, వాటి వేగం పుంజుకున్నా అందుకు అనుగుణంగా ట్రాక్‌లు పెరగకపోవటం వల్ల ఉన్న ట్రాక్‌లపైనే ఒత్తిడి పెరుగుతోంది. ట్రాక్‌ల నిర్వహణ, విద్యుత్, సిగ్నలింగ్ వ్యవస్థల పర్యవేక్షణ వంటివి సక్రమంగా సాగటం లేదు. మరమ్మత్తుల కోసం రైళ్లను ఆపాల్సి రావటంతో ‘సూపర్ ఫాస్ట్’ భుజకీర్తులు తగిలించుకున్న రైళ్లు కూడా సకాలంలో గమ్యం చేరటం లేదు.
రైళ్లను ఎక్కువగా వినియోగించేది సామాన్యులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పౌరులు. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న కోరమండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ల మృతుల్లో ఎక్కువ మంది వలస వెళ్లక తప్పని బడుగుజీవులే కావటం యాదృచ్ఛికం కాదు. బాలాసోర్ ఉదంతం మన పాలకుల కళ్లు తెరిపించాలి. ఇతర సర్కారీ కొలువుల మాటెలావున్నా భద్రతకు అగ్ర ప్రాధాన్యమిచ్చి రైల్వేల్లో కొన్నేళ్ళుగా అలా ఉంచేసిన లక్షలాది ఖాళీలన్నిటినీ భర్తీ చేయాలి. ఆదాయం తప్ప మరేమీ పట్టని ధోరణి ఇకనైనా మారాలి. మౌలిక సదుపాయాల మెరుగుదల, భద్రతకు ప్రాధాన్యం లాంటి అంశాల్లో రాజీ పనికిరాదు.
Supreme Court: రూ.2 వేల నోటు రద్దుపై అత్యవసర విచారణకు సుప్రీం నో