Dravidian Politics: ద్రవిడవాదంలో వేర్పాటు నినాదం.. ఇది ఒక రాజకీయ ఆట!
ఒకప్పుడు ఈశాన్య భారతదేశంలో ప్రత్యేక దేశం నినాదాలు వినిపించేవి. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు కూడా ఇదే వినిపించేవారు. రెడ్ కారిడార్ నినాదంలో కూడా ఇందుకు సంబంధించిన ఛాయలు ఉన్నాయి.
కానీ తమిళనాడులో ద్రవిడవాదం మోతాదు ఎక్కువగా ఉన్న డీఎంకే వినిపించే వేర్పాటువాదం, తామొక జాతి అని చెప్పుకోవడం వెనుక కుత్సిత రాజకీయం మాత్రమే ఉంది. ఆ పార్టీలో కొందరు ప్రత్యేక దేశం నినాదాన్ని అందుకోవడం చరిత్ర పట్ల మహా ద్రోహం. భారతదేశం ఐక్యంగా ఉండాలన్న భావన కేవలం బీజేపీది అనుకోవడం అజ్ఞానం. ఒక పార్టీ మీద ద్వేషం దేశ ఐక్యతకు విఘాతం కారాదు.
భారత ఈశాన్య ప్రాంతాన్నో, కశ్మీర్ లోయ పరిస్థితులతోనో పోలిస్తే తమిళనాడు ప్రాంతం వేర్పాటువాద నినాదాన్ని అందుకోవలసిన అగత్యం ఏమాత్రం లేదు. కొందరు నాయకుల అజెండా ప్రజలందరి ఆశయం కూడా కాదు. తమిళ సమాజంలో అందుకు సంబంధించిన రుజువులు కూడా లేవు. చెన్నై ఇవాళ నాలుగు మెట్రో నగరాలలో ఒకటి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం (ఏ పార్టీది అయినా) అండ లేకుండా అది సాధ్యమయ్యే దేనా? ఢిల్లీ వివక్షే చూపి ఉంటే జరిగేదేనా?
Article 370: ఆర్టికల్ 370 రద్దు ఎలా చేస్తారంటే..!
ద్రవిడవాదం, అది చెప్పే ప్రాంతీయవాదం, వేర్పాటువాదం, నాస్తికత్వం తమిళనాట కొద్దిమందిలో ఉంటే ఉండవచ్చు. మెజారిటీ ప్రజలు కచ్చితంగా వాటికి దూరంగానే ఉన్నారు. అక్కడి జీవన సరళిని చూసినవారు ఎవరైనా దీనిని ఒప్పుకుంటారు. కాబట్టి తమిళనాడులో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే వాదనలు కుత్సిత రాజకీయానికి సంబంధించినవే. డీఎంకే ఎంపీ ఎ.రాజా తాజాగా భారత్ ఒక దేశం కాదని తీర్పు ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల కూటమి అంటాడు.
ఒక దేశమైతే ఒకే భాష ఉంటుందని వింత భాష్యం చెప్పాడు. తమిళనాడుకు దేశం అనదగ్గ లక్షణాలు ఉన్నాయంటాడు. ఈ దేశంలో అనుసంధాన భాషగా సంస్కృతం చిరకాలం ఉంది. రాజా వాదన మీదే ఒక్క క్షణం నిలబడి ఇంకొక ప్రశ్న వేయాలి. తమిళనాడులోనే ఉన్న కొంగునాడు (కొంత భాగం కేరళ, కర్ణాటకలలో కూడా విస్తరించి ఉంది) ప్రజలు ఇది కూడా ‘నాడు’, కాబట్టి తమదీ ఒక జాతేననీ, తమకూ దేశం కావాలనీ అంటే డీఎంకే ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వస్తుంది? ‘నాడు’ అనేది భౌగోళిక ఉనికికి పేరు. అది మరచిపోతే ఎలా?
తమిళులకో ప్రత్యేక దేశం కోరికతో ఈవీ రామస్వామి నాయకర్ క్రిప్స్ మిషన్‌కు వినతిపత్రం సమర్పించాడు. దానికి హేతుబద్ధమైన ప్రాతిపదిక ఏమిటో ఇప్పటికీ తెలియదు. ద్రవిడస్థాన్ నినాదంతో, కోరికతో ఏమాత్రం పొంతన లేనిది ముస్లింలకో ప్రత్యేక రాజ్యం. అది జిన్నా, కొందరు ముస్లింల కోరిక. అలాంటి జిన్నాను తనకు వత్తాసుగా తెచ్చుకోవాలని చూసి ఈవీ భంగపడిన సంగతి చరిత్ర ప్రసిద్ధమే. ‘నేను ముస్లింలందరికీ నాయకుడినే; కానీ తమిళులంతా నీ (ఈవీ) వెనుక లేరు’ అన్నది జిన్నా వివరణ. నేటికీ అదే వాస్తవం. తమిళులంతా ద్రవిడవాదం మత్తులో లేరు. ఏనాడూ లేరు.
1942లోనే కాలం చేసిన ఆ వాదాన్ని ఆవాహన చేస్తామని బెదిరిస్తూ డీఎంకే పబ్బం గడుపుకొంటున్నది. ఇదంతా గమనించాక ఈవీ రామస్వామి నాయకర్‌ను పిచ్చాసుపత్రిలో ఉంచవలసిన వ్యక్తిగా ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా భావించారు. కానీ ఇప్పటికీ అలాంటివాడి వికృత వాదంతో పార్టీలు రాజకీయాలు సాగించడమే విషాదం. ఎ.రాజా తాజా ప్రకటన కావచ్చు, ఆ మధ్య ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమా రుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలు కావచ్చు, ఆ ఆవాహన బెదిరింపులో భాగమే. వీటికి తాజా నేపథ్యం ఉంది. దేశ రాజకీయాలలో బీజేపీ ప్రబల శక్తిగా ఎదగడం. ద్రవిడవాద అడ్డా తమిళనాడుకు రాదనుకున్న బీజేపీ... అన్నామలై (తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు) రూపంలో విశ్వరూపం దాల్చడం!
Black Taj Mahal: ప్రేమకు చిహ్నం.. నల్లరాతి తాజ్ మహల్! అది ఎక్కడుంది?
భారత్ ఒక దేశం కాదు, ఉపఖండం అంటాడు రాజా. ఈ ఒక్క అంశమే కేంద్రబిందువుగా ఆయన వాదం సాగడం లేదు. దీనికి రాముడినీ, రామాయణాన్నీ జోడిస్తున్నాడు. ఆ రెండు అంశాల మీద ఆయనకి విశ్వాసం లేదట. లేకపోవచ్చు. కానీ రాజా ఈ రాముడినీ, రామాయణాన్నీ డీఎంకే వేర్పాటువాదానికి తోడు తెచ్చుకునే పిచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. రాముడు భారతదేశ ఉత్తర భాగం వాడనీ, భారతభూమి దక్షిణ భాగంతో సంబంధమే లేదనీ డీఎంకే మొదటి నుంచి భాష్యం చెబుతోంది. ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం వద్ద ఇటీవలే జరిగిన సభలో రాజా ఇవన్నీ మాట్లాడాడు.
నిజానికి ఈ వాదం కూడా తప్పే. దీనికి అన్నామలై ఇటీవలనే చక్కని వివరణ ఇచ్చాడు. తమిళనాడులోనే ఆరణి క్షేత్రంలో శివాలయం ఉంది. దాని పేరు పుత్తరకామెట్టీశ్వరాలయం. దశరథుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసిన తరువాతే ఆయనకు సంతానం కలిగిందని ప్రతీతి. అలాగే రామేశ్వరానికీ, వారణాసికీ నేటికీ చెక్కుచెదరకుండా కొనసాగుతున్న బంధాన్ని మరచిపోరాదు. ఈ జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన బాలరాముడి ప్రతిమకు దక్షిణాది కన్నడిగుడే జన్మనివ్వడం యాదృచ్ఛికం కావచ్చు.
భారతదేశం ఐక్యంగా ఉండాలన్న భావన 1950లలో పుట్టిన భారతీయ జనసంఘ్‌దో లేదా 1980లలో ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీదో అనుకోవడం శుద్ధ అజ్ఞానం. మొత్తం భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తం చేసే ఉద్దేశంతోనే భారత స్వాతంత్య్రోద్యమం సాగింది. దీనికి వందలాది ఉదాహరణలు చూపించవచ్చు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి జీవితమే దీనికి రుజువు. గాంధీజీ పిలుపునకు, సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమానికి తమిళనాడు కూడా కదిలింది.
Agni-5 Missile: అగ్ని–5 క్షిపణి.. శత్రువుకు వణుకే..!
జాతీయ భావనతో, సాంస్కృతికంగా ఏకత్వం ఉన్న దేశంలో సామాజిక రాజకీయ ఏకత్వం తేవడానికి భారత జాతీయ కాంగ్రెస్, కొన్ని ఇతర అతివాద జాతీయ భావాలను నమ్మిన సంస్థలు పనిచేశాయి. జాతీయ కాంగ్రెస్ తన సభలు తమిళనాడులోనూ (నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ) పలుసార్లు నిర్వహించింది. అడయార్ కేంద్రంగా పనిచేసిన అనీబిసెంట్ భారతీయులందరి స్వేచ్ఛ కోసం పనిచేశారు. కానీ మరొక పక్క తమిళనాడులో బలపడిన జస్టిస్ పార్టీ బ్రిటిష్ వాళ్ల మోచేతి నీళ్లు తాగింది.
భారత్ ఐక్యతకూ, భారతీయులు చైతన్యవంతం కావడానికీ ఇంగ్లండ్ బద్ధవ్యతిరేకి. ఎవరో ఒకరిని వివక్షతో అణచివేయడానికి కుటిలనీతిని అవలంబించడమే బ్రిటిష్ లక్షణం. దాని అవశేషమే ద్రవిడవాదం. దాని పేలికే డీఎంకే. భారతదేశ చరిత్రను బట్టి, సమీప గతాన్ని బట్టి, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ పరిణామాల ఆధారంగా డీఎంకే నేతల వదరుబోతుతనం ఎంత నిర్హేతుకమో అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయాలి. నాలుగు ముక్కలైన పోలెండ్ కలసిపోయింది. రెండు ముక్కలయిన జర్మనీ ఐక్యమైంది.
వేరుకావడం వల్ల కలిగే కష్టనష్టాలను ప్రపంచం గుర్తిస్తున్న క్షణాలివి. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, ఆక్రమిత కశ్మీర్‌లో, బలూచిస్తాన్‌లో ప్రజలు తాము భారత దేశంలో భాగం కావాలనుకుంటున్నామని చెప్పుకోవడం వాస్తవం. ఇన్ని ఉదాహరణలు ఉండగా ఇంత అభివృద్ధి చెందిన దేశంలో వేరే దేశం కోరుకోవడం, అది కూడా తమ పార్టీ బలహీనపడే లేదా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రత్యేక దేశం నినాదాన్ని అందు కోవడం చరిత్ర పట్ల మహా ద్రోహం. ఓట్ల రాజకీయంతో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని భగ్నం చేయాలని అనుకుంటే ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడం అవసరమే.
ఇప్పుడు ఎ. రాజా ప్రకటననీ, అప్పుడు ఉదయనిధి స్టాలిన్ వాగుడునూ బీజేపీ ఖండించింది. అది సహజమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. ‘రాజా వ్యాఖ్యలతో నేను నూరు శాతం విభేదిస్తున్నాను’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ నిర్ద్వంద్వంగా పేర్కొనడం స్వాగతించవలసినదే. ఆ పార్టీ కర్ణాటక ఎంపీ డీకే సురేశ్ రెండు భారతదేశాల గురించి మాట్లాడినందుకు ఇది పాప పరిహారం కావచ్చు.
రేపు ఎన్నికలలో ‘ఇండి’ పేరుతో ఎన్‌డీఏని ఎదుర్కొ నబోతున్న కూటమి భాగస్వాములు తోటి ద్రవిడ భాగస్వామి చేస్తున్న ఇలాంటి ప్రేలాపనలను నిర్ద్వంద్వంగా ఖండించడం అవసరం. భార తీయ జనతా పార్టీని వ్యతిరేకించడం, దానిని అధికారం నుంచి దించా లనుకోవడం తప్పు పట్టవలసిన విషయం కాదు. కానీ ఒక రాజకీయ పార్టీ మీద ద్వేషం భారతదేశ ఐక్యతకు విఘాతం కారాదు.