Skip to main content

India - NATO: భేటీ వల్ల ఒరిగేదేమిటి ?

సంక్షోభాలు చిక్కబడుతున్నప్పుడు రాగల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అడుగులేయడం ఏ దేశానికైనా తప్పనిసరి.
India - NATO
India - NATO

దౌత్యపరంగా పైకి  ఏం మాట్లాడుతున్నా, పాత విధానాలనే కొనసాగిస్తున్నట్టు కనిపించినా మారుతున్న ప్రపంచపోకడలకు అనుగుణంగా కొత్త ఎత్తుగడలకు దిగడం దేశాలకు అతి ముఖ్యం. నాటో కూటమితో రెండేళ్లక్రితం మన దేశం తొలిసారి రాజకీయ చర్చలు జరిపిందని, ఈ చర్చలు అత్యంత గోప్యంగా ఉంచారని వచ్చిన కథనాలను ఈ నేపథ్యంలో చూడటం తప్పనిసరి. నాటో కూటమి ప్రధాన కార్యక్షేత్రం యూరోప్‌. ఆ ఖండంలోని 28 దేశాలతోపాటు ఉత్తర అమెరికాలోని అమెరికా, కెనడాలకు సైతం అందులో సభ్యత్వం ఉంది. ఇది ప్రధానంగా సైనిక కూటమే అయినా, ఈ దేశాల మధ్య రాజకీయ చెలిమి కూడా కొనసాగుతుంటుంది. అయితే నాటో దీనికి మాత్రమే పరిమితమై ఉండదు. అది రష్యా, చైనా, పాకిస్తాన్‌ తదితర దేశాలతో కూడా రాజకీయ, సైనిక చర్చలు కొనసాగిస్తుంటుంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరోప్‌ దేశాలు ఆర్థికంగా, సైనికంగా బలహీనపడటం... ఈ సంక్షోభ పర్యవసానంగా కమ్యూనిస్టు, సోషలిస్టు భావనల ప్రాబల్యం పెరగడం గమనించిన అమెరికా ‘మార్షల్‌ ప్లాన్‌’ కింద పశ్చిమ, దక్షిణ యూరోప్‌ దేశాలకు భారీయెత్తున ఆర్థిక సాయాన్ని అందించి అవి కోలుకోవడానికి దోహదపడింది. ఆ దేశాల మధ్య రక్షణ, భద్రతా రంగాల్లో సహకార భావనల్ని పెంపొందించింది. ఈ క్రమంలోనే ఆ దేశాలు నాటో కూటమిగా ఆవిర్భవించాయి. పైకి ఎన్ని చెప్పినా ఆనాటి సోవియెట్‌ యూనియన్‌ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడం నాటో ఏకైక లక్ష్యం. అటు తర్వాత అమెరికా ప్రయోజనాలు ప్రపంచంలో ఏమూల దెబ్బతిన్నా నాటో సైనికంగా రంగంలోకి దిగడమే ప్రధాన కార్యక్రమం అయింది.

Also read: Farmers & Food : పండించిన వారికే తిండికి కొరతా !?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడి సాగినంతకాలం నాటోకు గడ్డురోజులే. మీ భద్రత కోసం అమెరికా ప్రజల సొమ్ము ఎందుకు వృథా చేయాలన్నది ట్రంప్‌ తర్కం. ఇకపై ఏ రకమైన సైనిక శిక్షణ, సైనిక స్థావరాల నిర్వహణైనా యూరోప్‌ దేశాలు తగిన మొత్తం చెల్లిస్తేనే సాధ్యమని ఆయన ప్రకటించి, ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించారు. పరిస్థితులు ఎల్లకాలమూ ఒకేలా ఉండబోవన్న జ్ఞానోదయం నాటోకు కలిగింది అప్పుడే. తన దోవ తాను చూసుకోవడం తప్పనిసరన్న గ్రహింపు కలిగింది కూడా ఆ సమయంలోనే. ఆ తర్వాత నాటో తీరు మారింది. ట్రంప్‌ పోయి బైడెన్‌ వచ్చినా, మునుపటి విధానాలే కొనసాగిస్తామని హామీ ఇచ్చినా ఆ కూటమి భరోసాతో లేదు. ఆ తర్వాతే చైనాతో సంప్రదింపులు చేస్తుండటం, పాకిస్తాన్‌కు సైనిక శిక్షణ ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాటో కూటమిలోని వేరే దేశాలు అభ్యంతర పెట్టినా ప్రధాన దేశమైన జర్మనీ రష్యాతో నార్డ్‌ స్ట్రీమ్‌–2 గ్యాస్‌ పైప్‌లైన్‌ ఒప్పందం కుదుర్చుకోవడం ఆ కూటమిలోని పొరపొచ్చాలకు అద్దం పడుతుంది. ఉక్రెయిన్‌పై దురాక్రమణ  తర్వాత రష్యా విషయంలో జర్మనీ వైఖరి మారింది గానీ లేనట్టయితే ఆ బంధం మరింత బలపడేది. 

Also read: Free Trade Agreement: పరిశ్రమల టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిన దేశాలు?

వర్తమాన ప్రపంచంలో మన దేశం ప్రాముఖ్యతేమిటో నాటో సరిగానే గ్రహించింది. అయితే కీలకమైన అంశాల్లో దాని వైఖరికీ, మన వైఖరికీ ఎంతమాత్రం పొసగదు. నాటో రష్యాను బూచిగా చూస్తున్నది. దాని దూకుడు యూరో–అట్లాంటిక్‌ భద్రతకు ముప్పు తెస్తుందని నమ్ముతోంది. మనకు అది మిత్ర దేశం. చైనాతో అమెరికాకు సమస్యలున్న మాట వాస్తవమే అయినా, నాటో మాత్రం ఆ దేశంతో ఉదారంగా ఉంటున్నది. చైనా కారణంగా సవాళ్లు ఎదురవుతున్నది నిజమే అయినా, ఆర్థికరంగంలో ఎదగడానికి ఆ దేశం ఉపకరిస్తుందని నాటో దేశాలు భావిస్తున్నాయి. ఆ ధోరణి మనకు మింగుడుపడనిది. ఇక తాలిబాన్‌ల విషయంలో నాటోది సైతం అమెరికా తోవ. దాన్నొక రాజకీయ శక్తిగా నాటో పరిగణిస్తోంది. ప్రస్తుతం అఫ్ఘాన్‌లో తాలిబాన్‌ల ఏలుబడి వచ్చింది కనుక మన దేశం తప్పనిసరై దానితో ఏదోమేరకు సంబంధాలు నెరపవలసి వస్తోంది. 

Also read: 75th Year of Independence Day of India: జెండా ఊంచా రహే హమారా!

నాటోకూ, మనకూ ఇలా భిన్న ఆలోచనలున్నప్పుడు ఆ కూటమికి దగ్గరకావడం వల్ల ఒరిగేదేమిటన్నది కీలకమైన ప్రశ్న. అయితే సంప్రదింపుల వల్ల మన ఆలోచనల వెనకున్న కారణాలు గ్రహించడం నాటోకు సులభమవుతుంది. 2019 డిసెంబర్‌లో మన దేశానికీ, నాటోకూ జరిగిన చర్చలను ఈ కోణంలో చూడటం అవసరం. కోవిడ్‌ ఉత్పాతంవల్ల తదుపరి సంప్రదింపులు జరగలేదు. నాటోలో సభ్యత్వం తీసుకోవడం, కనీసం సాగరప్రాంత భద్రత వంటి అంశాల్లో భాగస్వామిగా ఉండటం వంటివి మన దేశంపై ప్రభావం చూపకమానవు. ప్రస్తుతం మన దేశం ఏదోమేరకు తటస్థత పాటిస్తున్న భావన కలిగిస్తోంది. నాటో సభ్యత్వం తీసుకున్న మరుక్షణం అది పోయి పాశ్చాత్యదేశాల మిత్రదేశమన్న ముద్రపడుతుంది. అంతర్జాతీయంగా భారత్‌ సమతూకం పాటిస్తున్నదన్న అభిప్రాయం అంతరిస్తుంది. సహజంగానే మన దేశం ఈ పరిస్థితిని కోరుకోదు. రష్యాతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడదు. పైగా పాకిస్తాన్‌ భాగస్వామ్య దేశం హోదాలో నాటోతో సంబంధాలు నెరపుతోంది. అది మన దేశానికి నచ్చదు. సభ్యదేశాలైన టర్కీ, గ్రీస్‌ వంటి వాటితో ఆ కూటమి ఇప్పటికే ఇబ్బందులు పడుతోంది. భారత్, పాకిస్తాన్‌లతో అలాంటి తలనొప్పులు భరించడానికి నాటో సిద్ధపడకపోవచ్చు. ఏదేమైనా నాటోతో సంబంధాలు నెరపే అంశంలో మన దేశం ఆచితూచి అడుగేయాలి. ప్రపంచంలో ఘర్షణ వాతావరణం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మన నిర్ణయాలు ఎలాంటి పర్యవసానాలు కలిగిస్తాయన్నది బేరీజు వేసుకోవాలి.

Also read: World Population Projections Report–2022: జనాభాలో వచ్చే ఏడాది చైనాను అధిగమించనున్న భారత్

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Aug 2022 07:12PM

Photo Stories