World Population Projections Report–2022: జనాభాలో వచ్చే ఏడాది చైనాను అధిగమించనున్న భారత్
మరో ఏడాదిలో భారత్ జనాభా.. చైనాను అధిగమించబోతోంది. ఐక్యరాజ్యసవిుతే ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ 15వ తేదీ నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్ల (800 కోట్లు) మార్కును చేరుకోబోతోందని ప్రకటించింది. ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) సందర్భంగా ‘ప్రపంచ జనాభా అంచనా నివేదిక–2022’ను ఐరాసకు చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్, పాపులేషన్ డివిజన్ సోమవారం విడుదల చేసింది.
Also read: World population Day: 2022 నవంబర్ 15 నాటికి 800 కోట్లకి ప్రపంచ జనాభా
1950 నుంచి చూస్తే ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఇప్పుడు అతి తక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2020లో ప్రపంచ జనాభా ఒక శాతంలోపే పెరిగింది. ప్రపంచ జనాభా 2030 నాటికి 850 కోట్లకు, 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుందని అంచనా. 2080 నాటికి 1,004 కోట్లకు చేరుకోవచ్చు. 2100 దాకా ఆ సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఐరాస నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే...
- 2023 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. చైనాను అధిగమిస్తుంది.
- ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2022లో తూర్పు, ఆగ్నేయ ఆసియాలో అత్యధిక జనాభా ఉంది. ఇక్కడ 230 కోట్ల మంది నివసిస్తున్నారు. మొత్తం ప్రపంచ జనాభాలో వీరి వాటా 29 శాతం.
- మధ్య, దక్షిణాసియాలో 210 కోట్ల జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో 26 శాతం.
- మధ్య, దక్షిణాసియాలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు చైనా (140 కోట్లకుపైగా), భారత్ (140 కోట్లకుపైగా).
- 2050 నాటికి పెరిగే జనాభాలో సగానికి పైగా జనాభా కేవలం ఎనిమిది దేశాల్లో నమోదు కానుంది. అవి కాంగో, ఈజిప్‌్ట, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, టాంజానియా.
- 2022లో చైనా జనసంఖ్య 142.6 కోట్లు, భారత్ జనసంఖ్య 141.2 కోట్లు.
- 2050 నాటికి భారత్‌లో జనాభా 166.8 కోట్లకు చేరుకుంటుంది. మరోవైపు చైనా జనాభా 131.7 కోట్లకు పడిపోతుంది.
- 2010 నుంచి 2021 మధ్య పది దేశాల్లో.. ఒక్కో దేశం నుంచి 10 లక్షలకు పైగా జనం ఇతర దేశాలకు వలస వెళ్లారు. పదేళ్లలో భారత్‌ను నుంచి వలస వెళ్లిన వారి సంఖ్య 30.5 లక్షలు.
- ప్రపంచంలో మనిషి సగటు జీవితకాలం 2019 నాటికి 72.8 ఏళ్లకు చేరుకుంది. 2050 నాటికి ఇది 77.2 ఏళ్లకు పెరుగుతుందని అంచనా.
- వెనుకబడిన దేశాల్లో మనిషి సగటు జీవితకాలం ప్రపంచ సగటుతో పోలిస్తే ఏడేళ్లు తక్కువ.
- ప్రపంచ జనాభా విషయంలో 2022 మైలురాయి సంవత్సరమని ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ చెప్పారు. జనాభా ఈ ఏడాది 800 కోట్లకు చేరనుందన్నారు. భూగోళాన్ని రక్షించుకొనేందుకు అంతా ముందుకు రావాలని కోరారు. దీన్ని ఉమ్మడి బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు.
Also read: WEF Global Gender Gap Report 2021: మహిళా సాధికారత 135.6ఏళ్లు దూరం