GATE Results 2024: గేట్‌లో మెరిసిన అనకాపల్లి జిల్లా విద్యార్థులు.. ఒకరిది ఆర్మీ నేపథ్యమైతే, మరొకరిది రైతు కుటుంబం
మునగపాక/రావికమతం: గేట్–2024 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. మునగపాక మండలంలోని గణపర్తి గ్రామానికి చెందిన కర్రి నాయుడు 7వ ర్యాంక్ సాధించాడు. కర్రి పరమేశ్వరరావు, విజయలక్ష్మి దంపతుల ప్రధమ కుమారుడు నాయుడు ప్రస్తుతం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ నాల్గవ సంవత్సరం మైరెన్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఎంటెక్‌లో ప్రవేశించేందుకు గేట్ పరీక్షకు హాజరయ్యాడు.
శనివారం విడుదలైన ఫలితాల్లో నాయుడు ఆలిండియా స్థాయిలో 7వ ర్యాంక్ సాధించాడు. నాయుడు కుటుంబ సభ్యులు కొంత కాలంగా అనకాపల్లి కొత్తూరులో నివాసం ఉంటున్నారు. నాయుడు తండ్రి పరమేశ్వరరావు ఆర్మీలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన నాయుడు కష్టపడి చదివి ఆలిండియా స్థాయిలో మెరుగైన ర్యాంక్‌ను సాధించడం పట్ల గణపర్తి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే రావికమతం మండలం గుమ్మాళ్లపాడు గ్రామానికి చెందిన కె.వి.ఎన్.సంధ్య జాతీయస్థాయిలో 171 ర్యాంక్ సాధించింది. ఈమెది సాధారణ రైతు కుటుంబం. కాళింగ తాతలు, వెంకట రమణమ్మ రెండవ కుమార్తె అయిన సంధ్య టెన్త్ వరకూ చినపాచిల హైస్కూల్‌లో చదివి 9.3 పాయింట్లు సాధించి, ఒంగోలు త్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తోంది. గేట్ పరీక్షకు కోచింగ్ తీసుకుని మొదటి ప్రయత్నంలోనే 171 ఆలిండియా జనరల్ కేటగిరిలో ర్యాంక్ సాధించింది.