Skip to main content

Lecturer Job Notification Released: 4,356 లెక్చరర్‌ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌, వేతనం నెలకు 1.90 లక్షలు

Lecturer Job Notification  Released   Teaching Posts    Medical and Health Department Announcement  Hyderabad Government Medical Colleges Recruitment
Lecturer Job Notification Released

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 4,356 అధ్యాపక పోస్టులను కాంట్రాక్టు, గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 3,155 పోస్టులను కాంట్రాక్టు, 1,201 పోస్టులను గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయనుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్‌ పోస్టులు 498, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 786, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 1,459, ట్యూటర్‌ 412, సీనియర్‌ రెసిడెంట్స్‌ పోస్టులు 1,201 భర్తీ చేయనున్నారు.

వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అంటే ఏడాది కాలానికి వీరిని నియమిస్తారు. మెడికల్‌ కాలేజీల్లో జాతీ య మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తనిఖీలు చేయనున్నందున పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించారు. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయా లజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్,కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, ఆర్ధోపెడిక్స్, గైనకాలజీ, రేడియాలజీ, అనెస్థీషియా, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 

స్థానికులకు ప్రాధాన్యత
ఈ నెల 16వ తేదీన ఆయా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ప్రొఫెసర్‌ పోస్టుకు 8 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెల వేతనం రూ.1.90 లక్షలు కాగా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.లక్షన్నర, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు, సీనియర్‌ రెసిడెంట్‌కు రూ.92,575, ట్యూటర్‌కు రూ.55 వేలు ఇవ్వనున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు. అయితే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. స్థానికులు లేనప్పుడు ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయస్సు ఈ నెల 31వ తేదీ నాటికి 69 ఏళ్లకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

సాహసోపేత నిర్ణయం: మంత్రి 
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకులు, సిబ్బంది కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏటా రూ.634 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు.

Published date : 13 Mar 2024 10:59AM

Photo Stories