పరీక్షలకు పటిష్ట చర్యలు
డిపార్ట్‌మెంటల్ పరీక్షలు
● 2నుంచి 7వ తేదీ వరకు పరీక్షలు
● పరీక్షలపై అధికారులతో డీఆర్వో సమీక్ష
తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డీఆర్వో కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని తమ చాంబర్‌లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు పుత్తూరులోని శ్రీవెంకటేశ్వర పెరుమాళ్ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు తిరుపతి కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల, రామిరెడ్డిపల్లి ఐయాన్ డిజిటల్ కళాశాలలోను పరీక్షలు ఉంటాయని చెప్పారు. మరోవైపు ఈనెల 3వ తేదీన పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల, గూడూరు ఆదిశంకరా ఇంజినీరింగ్ కళాశాలలోను పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. అబ్జెక్టివ్ పరీక్షలు రెండు సెషన్స్‌ల్లో ఉంటాయని తెలిపారు. ఉదయం 10–12 గంటల వరకు, మధ్యాహ్నం 3–5 గంటల వరకు ఉంటాయన్నారు. మరోవైపు కన్వెన్షనల్ టైప్ పరీక్షలు ఉదయం 10– ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షల సమయంలో అవసరం అయిన మేరకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రధానంగా తాగునీటి వసతి, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు, బస్సు సౌకర్యం, పోలీస్ బందోబస్సు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. చిన్నపాటి పొరపాట్లు చేసినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఏటీఎం రామచంద్రనాయుడు, ట్రాన్స్‌కో ఏఈ గణపతి, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ చంద్రశేఖర్, డాక్టర్ ఉదయశ్రీ , డీటీ చెంచయ్య పాల్గొన్నారు.
6 నుంచి ఉమ్మడి జిల్లాల చెస్ పోటీలు
నగరి : లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి ఉమ్మడి జిల్లాల చెస్‌పోటీలు నిర్వహించనున్నట్లు నగరి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎ.మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కేవీకే ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. 16 ఏళ్లకు పైబడివారికి ఓపెన్ కేటగిరీలో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. రెండు కేటగిరీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు కప్‌లు అందిస్తామన్నారు. జూనియర్స్‌లో 20 మందికి, సీనియర్స్‌లో 10 మందికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు గల బాల, బాలికలు, దివ్యాంగులకు, మహిళలకు ప్రత్యేక బహుమతులు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 94402 13131, 89772 99886 నంబరలో సంప్రదించాలని తెలిపారు.
అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంల నుంచి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబందన్ పురస్కార్–2024కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో విజయేంద్రరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అందజేసే అవార్డులకు ఈనెల 31 లోపు www.award.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. డీవైఈవోలు, ఎంఈవోలు పర్యవేక్షించాలని డీఈవో ఆ ప్రకటనలో సూచించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో వడమాలపేట విద్యార్థుల ప్రతిభ
పుత్తూరు రూరల్: అనకాపల్లి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో గత నెల 29 నుంచి రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి గ్రాప్లింగ్ రెజ్లింగ్ (కుస్తీ పట్టు) పోటీల్లో వడమాలపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆరో తరగతి విద్యార్థి తనుష్ 24 కేజీల విభాగంలో, తొమ్మిదో తరగతి చదువుతున్న అంజలి 34 కేజీల విభాగంలో, ఉదయ్‌కుమార్ 66 కేజీల విభాగంలో, శ్రావణ్‌కుమార్ 84 కేజీల విభాగంలో బంగారు పతకాలను సాధించారు. అలాగే వివిధ కేటగిరీల్లో దేవహర్ష, మోహిత్, కిషోర్, యూనస్, లతాశ్రీ వెండి పతకాలతో మెరిశారు. జైసూర్య, రేవంత్‌కుమార్, భానుప్రకాష్, జగదీష్, ప్రియదర్శిని కాంస్య పతకాలను సాధించి సత్తా చాటారు. బంగారు, వెండి పతకాలు సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.