Skip to main content

National Means Cum Merit Scholarship: ఎన్ఎంఎంఎస్‌కు ఎంపికైనా.. పేరు నమోదైతేనే జాతీయ స్కాలర్‌షిప్‌

నేషనల్‌ మీన్స్ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్ఎంఎంఎస్‌) పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులు తమ పేర్లను నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో నమోదు చేసుకుంటేనే జాతీయ స్కాలర్‌షిప్‌ ఇకపై అందనుంది.
National Means Cum Merit Scholarship
ఎన్ఎంఎంఎస్‌కు ఎంపికైనా.. పేరు నమోదైతేనే జాతీయ స్కాలర్‌షిప్‌

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసి.. అర్హులైనవారు నమోదు చేసుకుంటేనే స్కాలర్‌షిప్‌లు ఇచ్చేలా మార్పు చేసింది. పరీక్షలో మెరిట్‌ సాధించి ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత పోర్టల్‌లో పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. 2020 సంవత్సరానికి సంబంధించి 2021 ఫిబ్రవరిలో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్‌ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులంతా ఈ సంవత్సరం తప్పనిసరిగా నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ https://scholarships.gov.in లో నవంబర్‌ 15 లోగా నమోదు చేసుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన విధించింది. ఇలా పేరు నమోదు చేయని వారికి ఇకపై ఎప్పటికీ ఏ విధంగా స్కాలర్‌షిప్‌ మంజూరు కాదని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలోని వారే కాకుండా 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఎంపికైన వారు గత సంవత్సరంలో పోర్టల్‌లో నమోదు చేసుకుని స్కాలర్‌షిప్‌ పొందుతున్న ప్రతి విద్యార్థి కూడా ఈ సంవత్సరం కూడా రెన్యువల్‌ కోసం తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. అలా చేసుకోని వారికి రానున్న కాలంలో స్కాలర్‌షిప్‌ అందదని పేర్కొంది. పాఠశాలలు/కాలేజీలు తమ విద్యార్థుల వివరాలను డిసెంబర్‌ 15 లోపల ఆమోదించాలి. డీఈవోలు డిసెంబర్‌ 31లోగా వాటికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. విద్యార్థులు పోర్టల్‌లో నమోదు చేసి తమ అప్లికేషన్ ను పాఠశాల, డీఈవో కార్యాలయాలు ఆమోదించాయో లేదో పరిశీలించుకోవాలని సూచించింది. స్కాలర్‌ షిప్‌లకు సంబంధించి ఇతర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్‌సైట్‌ www.bse.ap.gov.in ను సందర్శించవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. డీఈవో కార్యాలయాల్లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు.

Published date : 04 Sep 2021 01:32PM

Photo Stories