Skip to main content

GATE 2022: గేట్‌ ముగిసింది.. తర్వాత ఏం చేయాలి

గేట్‌–2022.. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో.. ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్, పీహెచ్‌డీల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్ష! అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ).. ఇంజనీరింగ్‌ కొలువుల భర్తీకి మార్గం గేట్‌ స్కోర్‌! గేట్‌–2022 పరీక్ష ఇటీవల ముగిసింది. దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 90 శాతం మేరకు హాజరైనట్లు సమాచారం! ఇప్పుడు ఈ అభ్యర్థులంతా.. గేట్‌ ముగిసింది.. తర్వాత ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. గేట్‌–2022లో ప్రధాన పేపర్ల విశ్లేషణతోపాటు.. మలి దశలో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు అనుసరించే విధానం..పీఎస్‌యూల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రత్యేక కథనం..
Engineering Special: What After GATE 2022? Multiple options for you, PSU Jobs details
Engineering Special: What After GATE 2022? Multiple options for you, PSU Jobs details
  • ముగిసిన గేట్‌–2022 పరీక్షలు
  • ఓ మోస్తరు క్లిష్టతతోపరీక్ష పేపర్లు
  • మలి దశలో ఐఐటీల్లో ప్రత్యేక ప్రవేశ ప్రక్రియ
  • గేట్‌ స్కోర్‌తో పీఎస్‌యూలలోనూ ఉద్యోగాలు
  • తదుపరి దశలపై దృష్టిపెట్టాలంటున్న నిపుణులు

గేట్‌కు ఈ ఏడాది కూడా ఎనిమిది లక్షలకు పైగా అభ్యర్థులు హాజరైనట్లు అంచనా. పరీక్ష పేపర్లు మోడరేట్‌(ఓ మోస్తరు క్లిష్టత)గా ఉన్నాయి. దీంతో కటాఫ్‌ 750కు పైగానే ఉండే అవకాశం ఉంది. ఈ స్కోర్‌ సొంతం చేసుకోగలం అని భావించే అభ్యర్థులు తదుపరి దశలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. గేట్‌–2022లో.. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ పేపర్లకే ఎక్కువ మంది హాజరయ్యారు. మొత్తం అభ్యర్థుల్లో వీరు 60నుంచి 65 శాతం మధ్యలో ఉంటారు. దాదాపు అన్ని పేపర్లు ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నట్లు సబ్జెక్ట్‌ నిపుణులు చెబుతున్నారు. 

కంప్యూటర్‌ సైన్స్‌.. కొంత క్లిష్టంగా

ఈ ఏడాది కంప్యూటర్‌ సైన్స్‌(సీఎస్‌).. పేపర్‌ క్లిష్టత పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. థియరీ ఆఫ్‌ కంప్యుటేషన్‌కు ఎక్కువ వెయిటేజీ ఇచ్చారని చెబుతున్నారు. ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్, జనరల్‌ అప్టిట్యూడ్‌ విభాగాల ప్రశ్నలు మాత్రం కొంత క్లిష్టంగా ఉన్నాయి. రెండు షిఫ్ట్‌లుగా నిర్వహించిన ఈ పేపర్‌లో రెండో షిఫ్ట్‌ క్లిష్టంగా ఉంది. 13 మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్, 14 న్యూమరికల్‌ అప్టిట్యూడ్‌ టైప్‌ కొశ్చన్స్‌ అడగడంతో అభ్యర్థులు సమయాభావ సమస్యకు గురైనట్లు పేర్కొంటున్నారు. ఈ పేపర్‌లో ప్రశ్నలు కూడా ఎక్కువ శాతం కాన్సెప్ట్‌ ఆధారితంగానే కనిపించాయి. అలాగే ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్‌ అండ్‌ డేటా స్ట్రక్చర్‌లకు సమాన వెయిటేజీ ఇస్తూ ప్రశ్నలు కనిపించాయి. న్యూమరికల్‌ అప్టిట్యూడ్‌ ప్రశ్నలు 16 వరకు అడగడంతో సమాధానాలు గుర్తించడంలో అభ్యర్థులకు సమయాభావం ఎదురైంది. కాన్సెప్ట్స్‌ ఆధారిత ప్రశ్నల సంఖ్య 20 శాతం వరకు, థియరీ ఆధారిత ప్రశ్నల సంఖ్య 15 శాతం వరకు ఉన్నాయి. మొత్తం మీద ఈ పేపర్‌లో ఈ ఏడాది అభ్యర్థులు 60 నుంచి 65 మార్కులు పొందే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: Recruitment Trends: ఆఫ్‌–క్యాంపస్‌... రూ.కోట్లలో ప్యాకేజీలు అందుకోండిలా!
 

మెకానికల్‌ ఇంజనీరింగ్‌

గేట్‌ అభ్యర్థుల్లో ఎక్కువ మంది హాజరయ్యే మరో పేపర్‌.. మెకానికల్‌ ఇంజనీరింగ్‌. ఇందులో ఈ ఏడాది జనరల్‌ అప్టిట్యూడ్‌ ప్రశ్నలు సులభంగా ఉన్నాయని, సబ్జెక్ట్‌ ప్రశ్నలు ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయని అంటున్నారు. కోర్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంజనీరింగ్‌ మెకానిక్స్, ఎస్‌ఓఎం, ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్, హెచ్‌ఎంటీలకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చారు. మొత్తం ప్రశ్నల్లో 35 ఎంసీక్యూలు, 6ఎంఎస్‌క్యూలు, 24 న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ కొశ్చన్స్‌ అడిగారు. అధిక శాతం ప్రశ్నలు న్యూమరికల్‌ అప్రోచ్‌తో సమాధానం రాబట్టే విధంగా ఉన్నాయి. ప్రశ్నలన్నీ కాన్సెప్స్, ఇంజనీరింగ్‌ మ్యాథ్స్‌ ఆధారంగా ఉండటంతో బీటెక్‌ స్థాయిలో అకడమిక్స్‌పై పూర్తి పట్టు సాధించిన అభ్యర్థులు ఈ పేపర్‌ను సులువుగానే గట్టెక్కొచ్చని చెబుతున్నారు.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌

గేట్‌లో మరో క్రేజీ పేపర్‌.. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌(ఈసీ). ఈ పేపర్‌లో మొదటి స్లాట్‌ఓ మోస్తరు క్లిష్టతతో, రెండో స్లాట్‌ కొంచెం సులువుగా ఉన్నట్లు నిపుణుల అభిప్రాయం. డిజిటల్‌ సర్క్యూట్స్, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్, అనలాగ్‌ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ అండ్‌ సర్క్యూట్స్‌కు ఎక్కువ వెయిటేజీ లభించింది.

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌(ఈఈ) పేపర్‌లో ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం ఎంఎస్‌క్యూ ప్రశ్నలు అడగక పోవడం. మొత్తం ప్రశ్నల్లో 33 ప్రశ్నలు ఎంసీక్యూలుగా, 22 ప్రశ్నలు న్యూమరికల్‌ టైప్‌ ఆన్సర్‌ కొశ్చన్స్‌గా ఉన్నాయి. ఎలక్ట్రికల్‌ మెషిన్స్, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌ నుంచి 11 ప్రశ్నలు అడిగారు. రెండు స్లాట్ల పేపర్ల క్లిష్టత కూడా మోడరేట్‌గా ఉంది. మొత్తం వంద మార్కులకు నిర్వహించిన ఈ పేపర్‌లో.. ఫండమెంటల్స్‌పై పట్టు ఉన్న అభ్యర్థులు 50 నుంచి 60 మార్కులు పొందే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: Civil Engineering: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..

సివిల్‌ ఇంజనీరింగ్‌

సివిల్‌ ఇంజనీరింగ్‌ పేపర్‌ క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జియో టెక్నికల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌కు ఎక్కువ వెయిటేజీ ఇచ్చారు. ఈ విభాగాల నుంచి మొత్తం 11 ప్రశ్నలు అడిగారు. అదే విధంగా ట్రాన్స్‌పోర్ట్‌ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, జియో టెక్నికల్‌ ఇంజనీరింగ్, ఇరిగేషన్‌ హైడ్రాలజీ అంశాలకు ఎక్కువ వెయిటేజీ కల్పించారు. మొత్తంమీద ఈ పేపర్‌ మోస్తరు క్లిష్టంగా ఉందని చెప్పొచ్చు. అభ్యర్థులు 40 నుంచి 45 మార్కులు పొందే అవకాశం ఉంది.

700కు పైగా కటాఫ్‌?

  • ఐఐటీల్లో ప్రవేశాల కోసం గేట్‌లో కటాఫ్‌ మార్కులు 700కు పైగానే ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. నార్మలైజేషన్‌ ప్రక్రియతో రెండు స్లాట్లలో నిర్వహించిన పరీక్షల స్కోర్లను గణించనున్నారు. 650కు పైగా మార్కులు సాధిస్తామనే భరోసా ఉన్న అభ్యర్థులు మలి దశ ఎంపిక ప్రక్రియకు సిద్ధం కావొచ్చని సూచిస్తున్నారు. 
  • గేట్‌ స్కోర్‌ ఆధారంగా మహారత్న,నవరత్న, మినీరత్న హోదా కలిగిన పలు పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థలు ఎంట్రీ లెవల్‌లో నియామకాలు చేపడుతున్నాయి. ఈ సంస్థల నియామకాల విషయంలోనూ.. జనరల్‌ కేటగిరీలో 500 నుంచి 600 మధ్యలో మార్కులు సాధించిన అభ్యర్థులకు మలి దశకు అర్హత లభించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాది కొన్ని పీఎస్‌యూలు ఈడబ్ల్యూఎస్‌ కోటాను కూడా అమలు చేయనున్నాయి. కాబట్టి జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ తగ్గే అవకాశం ఉంది.  


మలి దశ.. సన్నద్ధత ఇలా..

  • గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఐఐటీలు గ్రూప్‌ డిస్కషన్‌/గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అందుబాటులో ఉన్న సీట్లు, దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల జాబితాను షార్ట్‌లిస్ట్‌ చేసి.. వారికి ముందుగా గ్రూప్‌ డిస్కషన్‌/గ్రూప్‌ టాస్క్‌ నిర్వహిస్తారు. ఐఐటీ ఖరగ్‌పూర్, ముంబై వంటి క్యాంపస్‌లు.. గ్రూప్‌ డిస్కషన్‌కు బదులుగా గ్రూప్‌ టాస్క్‌ పేరుతో అభ్యర్థుల్లోని నైపుణ్యాలను పరిశీలిస్తున్నాయి. నలుగురు లేదా అయిదుగురు అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పరచి.. వారి డొమైన్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి ఒక టాస్క్‌ను అప్పగించి నిర్ణీత సమయంలో పూర్తి చేయమని అడుగుతారు. 

చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ

గ్రూప్‌ డిస్కషన్‌/గ్రూప్‌ టాస్క్‌లకు ఎంపికై అందులోనూ విజేతలుగా నిలిచిన వారికి చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎక్కువగా వ్యక్తిగత, అకడమిక్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఇటీవల కాలంలో అభ్యర్థుల్లోని రీసెర్చ్‌ ఆసక్తిని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

వెయిటేజీ విధానం

ఐఐటీలు ప్రవేశాల్లో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తున్నాయి. గేట్‌ స్కోర్‌కు 70 శాతం వెయిటేజీని, జీడీ/జీటీ, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీని ఇస్తూ మొత్తం వంద శాతం వెయిటేజీలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా.. తుది జాబితా విడుదల చేస్తున్నాయి. 

ఐఐటీలు.. పీఎస్‌యూలకు సీఓఏపీ విధానం

  • సీఓఏపీ అంటే.. కామన్‌ యాక్సప్టెన్స్‌ పోర్టల్‌. గేట్‌(గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌)లో ర్యాంకు సొంతం చేసుకుని.. ఐఐటీలు, పీఎస్‌యూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. తమకు లభించిన పలు ఆఫర్లను వీక్షించే అవకాశం, తమకు నచ్చిన ఆఫర్‌కు సమ్మతి తెలిపే వీలు కల్పించే ఉమ్మడి వేదికగా సీఓఏపీ నిలుస్తోంది. అంటే.. ఇది దాదాపుగా ఉమ్మడి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ వంటిదే. పలు రౌండ్లలో సీఓఏపీ ద్వారా ఆఫర్లను వీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం అందుబాటులో ఉంటుంది.

సీసీఎంటీ ద్వారా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశం

ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి కామన్‌ కౌన్సెలింగ్‌ ఫర్‌ ఎంటెక్‌(సీసీఎంటీ) పేరుతో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో పేర్కొన్న బ్రాంచ్, ఇన్‌స్టిట్యూట్‌ ప్రాథమ్యాలను, వారు పొందిన ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటూ.. సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ సీసీఎంటీ వెబ్‌ కౌన్సెలింగ్‌ మూడు నుంచి నాలుగు రౌండ్లలో ఉంటుంది. 

పీఎస్‌యూలకు ఇలా

  • గేట్‌ స్కోర్‌తో పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థలు ఎంట్రీ లెవల్‌లో ఇంజనీర్‌ ట్రైనీ, ట్రైనీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వంటి ఉద్యోగాల భర్తీ చేస్తున్నాయి. ఇలా ప్రస్తుతం జాతీయ స్థాయిలో దాదాపు 50 పీఎస్‌యూ సంస్థలు గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్స్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కేడర్‌లో కొలువులకు ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాయి. 
  • గేట్‌ స్కోర్‌ ఆధారంగా మలి దశ ఎంపిక ప్రక్రియలో..గ్రూప్‌ డిస్కషన్,రిటెన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్,పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి.
  • గేట్‌లో కటాఫ్‌ మార్కులు పొందిన వారికి మలిదశ ఎంపికకు పిలుస్తారు. మలిదశలో తొలుత గ్రూప్‌ డిస్కషన్‌ నిర్వహిస్తారు.గ్రూప్‌ డిస్కషన్‌లో విజయం సాధిస్తే రిటెన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. అందులోనూ విజయం సాధిస్తే పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు.
  • పర్సనల్‌ ఇంటర్వ్యూలో నెగ్గితే నియామకం ఖరారైనట్లే.
  • గేట్‌ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీని; గ్రూప్‌ డిస్కషన్, రిటెన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు 25 శాతం వెయిటేజీని కేటాయిస్తున్నాయి.
     

చ‌ద‌వండి: GATE-2022: గేట్‌.. గెలుపు బాట ఇలా!

గేట్‌–2022 ముఖ్యాంశాలు

  • 650 నుంచి 750 మధ్యలో ఉండనున్న ఫైనల్‌ కటాఫ్‌.
  • మలి దశలో సీఓఏపీ ద్వారా ఐఐటీలు, పీఎస్‌యూల ఆఫర్స్‌ యాక్సెప్టెన్స్‌ విధానం.
  • సీసీఎంటీ ద్వారా ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం.
  • ఐఐటీలు, పీఎస్‌యూల్లో మలి దశలో గ్రూప్‌ డిస్కషన్‌ లేదా గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూలు.
  • గేట్‌తో ప్రవేశాలు ఖరారు చేసుకుంటే స్కాలర్‌షిప్‌ సదుపాయం.
  • రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లోనూ ఎంటెక్‌ కోర్సుల్లో గేట్‌ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం.
     

చ‌ద‌వండి: Engineering Careers

Published date : 23 Feb 2022 06:16PM

Photo Stories