Engineering Special: నాలుగేళ్ల బీటెక్ కోర్సు.. ఏటా అనుసరించాల్సిన అభ్యసన ప్రణాళిక ఇదే..
- ప్రతి ఏడాది నిర్దిష్ట ప్రణాళికతోనే చదువు కొనసాగించాలి
- అడ్మిషన్ నుంచి ఆఫర్ లెటర్ వరకు పక్కా వ్యూహం ఉండాలి
- లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
- బీటెక్‌లో చేరిన విద్యార్థులకు నిపుణుల సూచన
ఇంజనీరింగ్‌లో సీటు కోసం ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు.. ఆ తర్వాత స్వేచ్ఛ లభించినట్లు భావిస్తారు. క్యాంపస్‌లో అడుగుపెట్టాక.. తమ స్వప్నం సాకారమైందనే భావనకు వస్తారు. కానీ ఇది ఏ మాత్రం సరికాదు. నేటి పోటీ ప్రపంచంలో.. ముఖ్యంగా ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ ప్రాధాన్యం పెరుగుతున్న పరిస్థితుల్లో.. బీటెక్‌లో చేరిన తొలిరోజు నుంచే తమను తాము తీర్చిదిద్దుకోవాలి. టెక్నాలజీ యుగంలో వస్తున్న మార్పులను వేగంగా పసిగట్టి, వాటిపై పట్టు సాధించాలి. అప్పుడే నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్ చేతికందే సమయానికి ఇండస్ట్రీ వర్గాలకు అవసరమైన నైపుణ్యాలతో సిద్ధంగా ఉంటారు.
కొత్త వాతావరణం
బీటెక్‌లో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు.. కొత్త వాతావరణంలో సాధ్యమైనంత త్వరగా ఇమిడిపోయే ప్రయత్నం చేయాలి. అక్కడి క్యాంపస్ పరిస్థితులపై అవగాహన పొందాలి. ప్రధానంగా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల విద్యార్థులు ప్రవేశాలు పొందే ఐఐటీలు, నిట్‌ల క్యాంపస్‌లలో ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉంది. దీనికి సాధ్యమైనంత త్వరగా ఫుల్‌స్టాప్ పెట్టాలి. అదే విధంగా రాష్ట్రాల స్థాయిలోని కళాశాలల్లోనూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కొత్త వాతావరణంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి విద్యార్థులు ఇంటర్‌పర్సనల్, క్రాస్ కల్చరల్ స్కిల్స్ పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. విద్యార్థుల కోసం కాలేజీల్లో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ సెల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సదుపాయం వినియోగించుకోవాలి.
చదవండి: Recruitment Trends: ఆఫ్–క్యాంపస్... రూ.కోట్లలో ప్యాకేజీలు అందుకోండిలా!
సిలబస్‌పై అవగాహన
బీటెక్ అకడమిక్స్ కోసం విద్యార్థులు స్పష్టమైన అవగాహనతో అడుగులు వేయాలి. ఇంటర్ వరకు చదివిన విధానం వేరు. ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లను అభ్యసించే పద్ధతి, బోధించే తీరు భిన్నం. అందువల్ల విద్యార్థులు ఆందోళన చెందకుండా తొలుత నాలుగేళ్ల సిలబస్‌పై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.ఆ తర్వాత మొదటి సంవత్సరం సబ్జెక్టులు, సిలబస్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలి. మొదటి సంవత్సరం సబ్జెక్ట్‌లు.. ఇంజనీరింగ్ కోర్సుకు పునాది వంటివి. వీటిపై పట్టు సాధిస్తేనే తర్వాత మూడేళ్లు అకడమిక్స్‌లో రాణించడం సులువవుతుంది.
అకడమిక్స్ అభ్యసనం.. విభిన్నంగా
ఇంజనీరింగ్.. ఒక టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సు. దీనికి అనుగుణంగానే ఈ కోర్సులో విద్యార్థులు తాము అకడమిక్స్‌ను చదివే విషయంలోనూ విభిన్నంగా, వినూత్నంగా వ్యవహరించాలి. ఒక్కో సబ్జెక్టుకు రెండు, మూడు రిఫరెన్ ్స పుస్తకాలను తిరగేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పుస్తకాలేంటి? ఎలా చదవాలి? అనే సందేహాలకు లెక్చరర్లను సంప్రదించడం, సీనియర్ల సలహాలు తీసుకోవాలి.
ప్రాక్టికాలిటీ, అప్లికేషన్ అప్రోచ్
ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ అంశాన్నైనా ప్రాక్టికల్ దృక్పథంతో, అప్లికేషన్ అప్రోచ్‌తో అభ్యసించడం అలవాటు చేసుకోవాలి. అందుకోసం లేబొరేటరీల్లో ఆయా సబ్జెక్ట్ అంశాలకు సంబంధించి ప్రాక్టికల్స్ శ్రద్ధగా చేయాలి. కేవలం పుస్తకాలకే పరిమితమైతే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చేమోకానీ.. రియల్ టైం నైపుణ్యాలు మాత్రం లభించవు. రియల్ టైమ్ నాలెడ్జ్ లేకుంటే.. భవిష్యత్‌లో కెరీర్ అవకాశాల పరంగా ఇబ్బందులు ఎదురవడం ఖాయం. అవసరమైతే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ సహాయం తీసుకోవడానికి వెనుకంజ వేయకూడదు. పలు ఇన్‌స్టిట్యూట్‌లు మెంటారింగ్ సెల్స్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నాయి. తరగతి గదిలో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి బిడియపడే విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయుక్తమని చెప్పొచ్చు. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
చదవండి: Tech Skills: జావాస్క్రిప్ట్.. అవకాశాల జోరు!
రెండో ఏడాది నుంచి లోతైన అధ్యయనం
ఇంజనీరింగ్ విద్యార్థులు రెండో ఏడాది నుంచి కోర్ సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించాలి. అందుకోసం మూక్స్, ఎన్‌పీటీఈఎల్ వంటి ఆన్‌లైన్ విధానాలతోపాటు ప్రొఫెసర్స్ రాసిన ప్రామాణిక పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అనుసంధానిస్తూ అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంజనీరింగ్‌లో పూర్తిస్థాయిలో సబ్జెక్ట్‌ల బోధన రెండో ఏడాది నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి విద్యార్థులు తమ బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌లు.. వాటికి అవసరమైన క్షేత్ర నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి.
ఇంటర్న్‌షిప్స్ దిశగా
బీటెక్ విద్యార్థులు రెండో ఏడాది చివరి నుంచే ఇంటర్న్‌షిప్స్‌లో చేరేలా ప్రయత్నాలు సాగించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రియల్ టైమ్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటే.. కనీసం రెండు లేదా మూడు ఇంటర్న్‌షిప్స్ చేయడం మేలు. ఏఐసీటీఈ నూతన కరిక్యులం కూడా ఈ మార్గదర్శకాన్ని విడుదల చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు సంబంధిత పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాల కోసం అన్వేషించాలి. ఇందుకోసం క్యాంపస్‌లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్‌తోపాటు, ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇంటర్న్‌షిప్ పూర్తిచేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన వస్తుంది. కంపెనీల అవసరాలకు తగ్గట్లు నైపుణ్యాలు మెరుగుపరచుకునే అవకాశం లభిస్తుంది.
భవిష్యత్తు లక్ష్యాల దిశగా
ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు మూడో ఏడాది నుంచి తమ భవిష్యత్తు లక్ష్యాల సాధన దిశగా స్థిరంగా అడుగులు వేయాలి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ఆఫర్స్ సొంతం చేసుకోవాలనుకునే విద్యార్థులు.. అందుకు అనుగుణంగా ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న టెక్నాలజీలు, నైపుణ్యాలను అందిపుచ్చుకునే మార్గాలను అన్వేషించాలి. ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే అభ్యర్థులు.. గేట్, క్యాట్ వంటి పరీక్షల ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టాలి. అకడమిక్ సిలబస్ అభ్యసనానికి, తాము లక్ష్యంగా చేసుకున్న పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు మధ్య సమతుల్యత ఉండేలా సమయ పాలన పాటించాలి.
చదవండి: Industry 4.0 Skills: బీటెక్ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్ ఉండాల్సిందే!
4.0 నైపుణ్యాలు
ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ పేరిట ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3–డి డిజైన్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. కంపెనీలు కూడా తమ కార్యకలాపాల నిర్వహణలో నిత్యం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెడుతున్నాయి. వీటిని కరిక్యులంలో భాగంగా అభ్యసించే వీలుండదు. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి సర్టిఫికేషన్ కోర్సుల్లో చేరడం లాభిస్తుంది. విద్యార్థులు ఆయా సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో జాబ్ మార్కెట్‌లో ముందంజలో నిలిచే వీలుంటుంది.
అకడమిక్స్‌లో భాగంగా
ప్రస్తుతం ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌ను అకడమిక్స్‌లో భాగంగా బోధిస్తున్నారు. వాటికి సంబంధించి పూర్తి నైపుణ్యాలు సొంతం చేసుకునే విషయంలో ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాల సమస్య ఎదురవుతోంది. దాంతో ఇవి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి విద్యార్థులు తాము స్వయంగా 4.0 స్కిల్స్ నేర్చుకునే దిశగా అడుగులు వేయాలి.
మూక్స్‌తో లేటెస్ట్ టెక్నాలజీ
నేటి ఇంటర్నెట్ యుగంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం.. మూక్స్(మాసివ్‌లీ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్). అంతర్జాతీయంగా పలు ప్రముఖ యూనివర్సిటీలు ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆన్‌లైన్ విధానంలో కోర్సులను అందిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు మూక్స్ ద్వారా తమ సబ్జెక్టులతోపాటు లేటెస్ట్ టెక్నాలజీపైనా అవగాహన పెంచుకోవచ్చు. మన దేశంలోనూ ఎన్‌పీటీఈఎల్ ద్వారా ప్రముఖ ప్రొఫెసర్స్ బోధించే పాఠాలను ఆన్‌లైన్‌లో వినే అవకాశముంది. వీటిల్లో విద్యార్థులకు ఉపయోగపడే వర్చువల్ ల్యాబ్స్ సౌకర్యం సైతం లభిస్తుంది. ఫలితంగా విద్యార్థులు తాజా పరిశోధనలు, టెక్నాలజీ, పరిణామాలు, ప్రాక్టికల్ అంశాలపై అవగాహన పెంచుకోవచ్చు.
ప్రాజెక్ట్ వర్క్.. సొంతంగా
నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో ప్రాజెక్ట్ వర్క్ అత్యంత కీలకం. నాలుగో ఏడాదిలో చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్‌కు విద్యార్థులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రియల్ టైమ్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఫేక్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తే.. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ప్రాజెక్ట్‌కు సంబంధించి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టంగా మారుతుంది. సొంతంగా ప్రాజెక్టు వర్క్ పూర్తిచేస్తే..సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు అలవడతాయి. విద్యార్థుల ప్రాజెక్ట్ వర్క్ రియల్ టైమ్ అవునా?కాదా?అని ప్లేస్‌మెంట్ ప్రతినిధులు ఇట్టే పసిగట్టేస్తారని గుర్తించాలి.
పర్సనాలిటీ డెవలప్‌మెంట్
కంపెనీలు నియామకాల సమయంలో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు కాలేజీలో ఉన్నప్పుడే వ్యక్తిత్వ లక్షణాలు మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, టీమ్ వర్కింగ్ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. కాలేజ్‌లో నిర్వహించే సెమినార్లకు హాజరవడం, తోటి విద్యార్థులతో గ్రూప్ డిస్కషన్స్ వంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొనాలి. అదే విధంగా కాలేజ్‌లో నిర్వహించే కల్చరల్ యాక్టివిటీస్‌లోనూ భాగస్వాములవ్వాలి. ఫలితంగా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ మెరుగవుతాయి.
స్వీయ అధ్యయనం
బీటెక్ విద్యార్థులు మొదటి నుంచి సెల్ఫ్ లెర్నింగ్ అలవాటు చేసుకోవాలి. దీనికోసం ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న అన్నిరకాల వనరులను ఉపయోగించుకోవాలి. లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీలను వినియోగించుకోవాలి. తద్వారా తమ కోర్ సబ్జెక్ట్‌లకు సంబంధించి తాజా పరిణామాలపై అవగాహన పొందాలి. అదే విధంగా రియల్ టైమ్ ప్రాబ్లమ్స్, వాటికి ఆ రంగంలోని నిపుణులు కనుగొన్న పరిష్కారాలను అధ్యయనం చేయాలి. తద్వారా మరింత అవగాహన లభిస్తుంది. ఇలాంటి రియల్ టైమ్ పరిష్కారాల కోసం.. రీసెర్చ్ జర్నల్స్, రీసెర్చ్ పేపర్స్‌ను చదవాలి.
లక్ష్యంపై స్పష్టంగా
బీటెక్‌లో చేరిన ప్రతి విద్యార్థికి ఏదో ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంటుంది. కొందరికి బీటెక్ పూర్తవగానే ఉద్యోగం సొంతం చేసుకోవడం లక్ష్యమైతే.. మరి కొందరు ఉన్నత విద్యను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. తమ లక్ష్యం ఏదైనా.. వాటిపై వీలైనంత ముందుగా స్పష్టత ఏర్పరచుకోవాలి. విద్య, ఉద్యోగం వీటిలో లక్ష్యమేమిటో ముందుగానే నిర్దేశించుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలు పెట్టుకోవడం కూడా మంచిది కాదు. దీనివల్ల ఏ విభాగంలోనూ సరైన నైపుణ్యం సాధించలేరు. అందుకే లక్ష్యంపై స్పష్టత ఎంతో అవసరం. విదేశాల్లో ఎంఎస్ కోసమైతే రెండో సంవత్సరంలోనే టోఫెల్‌ను, మూడో ఏడాదిలోపు జీఆర్‌ఈలకు సన్నద్ధమవ్వాలి. ఎంటెక్, ఎంబీఏ కోసం ‘గేట్’ లేదా ‘క్యాట్’ పరీక్షలకు కూడా మూడో ఏడాది నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి.
బీటెక్ నాలుగేళ్ల వ్యూహాలు.. ముఖ్యాంశాలు
- మొదటి ఏడాది నుంచే అకడమిక్‌గా, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ దిశగా అడుగులు వేయాలి.
- నాలుగేళ్ల సిలబస్‌పై మొదటి నుంచే అవగాహన పెంచుకొనే ప్రయత్నం చేయాలి.
- మొదటి నుంచే స్వీయ అభ్యసనం, తులనాత్మక నైపుణ్యాలు పెంచుకోవాలి.
- రెండో ఏడాది నుంచి పూర్తిగా కోర్ టాపిక్స్ అభ్యసనానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- ప్రాక్టికాలిటీ, అప్లికేషన్ అప్రోచ్‌తో అభ్యసనం సాగించాలి.
- రెండో ఏడాది చివరి నుంచి ఇంటర్న్‌షిప్స్ చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
- భవిష్యత్తు లక్ష్యాలు, వాటిని అందుకునేందుకు అవసరమైన మార్గంలో నడిచేందుకు మూడో సంవత్సరం నుంచి కృషి చేయాలి.
- గేట్, క్యాట్ వంటి ఉన్నత లక్ష్యాలు పెట్టుకున్న విద్యార్థులు.. మూడో ఏడాది నుంచే వాటి సాధనకు సమయం కేటాయించాలి.
- నాలుగో ఏడాది పూర్తిగా ప్రాజెక్ట్ వర్క్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయానికి కృషి చేయాలి.
- ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌పైనా దృష్టిపెట్టాలి. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉన్న సదుపాయాలతో పాటు ఆన్‌లైన్ సదుపాయాలను కూడా వినియోగించుకోవాలి.
క్రిటికల్ థింకింగ్ ఎంతో అవసరం
బీటెక్ నాలుగేళ్ల కోర్సులో.. అడుగడుగునా క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు అలవర్చుకునేందుకు కృషి చేయాలి. రియల్ టైమ్ నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. క్లాస్ రూమ్ లెర్నింగ్‌కే పరిమితం కాకుండా.. ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ.. సంబంధిత నైపుణ్యాలు పెంచుకోవాలి. అప్పుడే కోర్సు పూర్తయ్యే సమయానికి సమర్థవంతమైన ఇంజనీర్లుగా, జాబ్ మార్కెట్లో అవకాశాల కోణంలోనూ ముందంజలో నిలిచే ఆస్కారం లభిస్తుంది.
– ప్రొ.వి.రమణరావు, డైరెక్టర్, నిట్–వరంగల్
చదవండి: Industry 4.0 Skills: బీటెక్ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్ ఉండాల్సిందే!