New Govt Engineering College: ఇంజినీరింగ్ వైపు అడుగులు
దీంతో విద్యాపరంగా కోస్గి ప్రాంతం ఉన్నత విద్యా కేంద్రంగా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందనుంది. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తూ ఈ ఏడాది జనవరి 22న రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులకు ఉన్నత విద్యా శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధికారిక అనుమతులు ఇస్తూ 2024– 25 ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది. ఇకపై స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ కోర్సులతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రుల కల నెరవేరినట్లయ్యింది.
చదవండి: ఇంజనీరింగ్ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్
గతంలో రేవంత్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయగా ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఏకంగా రాష్ట్రంలోనే తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తుండటంతో శరవేగంగా సాగుతున్న విద్యారంగ అభివృద్ధి పనులపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోనే తొలి కళాశాల
రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మగాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అనుబంధంగా కొనసాగుతున్నాయి.
కాగా.. కోస్గిలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మాత్రం కంట్రోల్ ఆఫ్ ద కమిషనరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (సీటీఈ) ప్రత్యక్ష నియంత్రణలో ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో 1972 సంవత్సరంలో హైదరాబాద్, అనంతపూర్, కాకినాడలో మాత్రమే ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు ఉండేవి.
తర్వాత అవి జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలలుగా మారాయి. కాగా రాష్ట్రంలో సీటీఈ పరిధిలో పనిచేసే మొదటి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను కోస్గిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు.
అందుబాటులో కోర్సులు..
ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటికే జేఎన్‌టీయూ అధికారుల బృందం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి సౌకర్యాలు, మౌలిక వసతులతోపాటు ఇతర అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.
2024– 25 విద్యా సంవత్సరం నుంచే ఇంజినీరింగ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఏఐ అండ్ ఎంఎల్, డాటా సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టారు. ప్రతి కోర్సులో 60 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని ఆదేశించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే పాలిటెక్నిక్ కోర్సులతోపాటు ఇంజినీరింగ్ కోర్సులకు సైతం అడ్మిషన్లు చేపట్టాలని, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కోర్సులకు కలిపి మొదటి సంవత్సరం 200 మంది విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.