High Court: ‘ఆఫ్ క్యాంపస్’ల అంశాన్ని పునఃపరిశీలించండి
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వరకు నిర్ణయం తీసుకోకుండా.. ఇప్పుడు అనుమతి ఇవ్వలేమని పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించింది. విద్యా చట్టంలోని సెక్షన్ 20కి విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం ఉందని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం పరిశీలన చేసి వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సర్కార్‌కు తేల్చిచెప్పింది.
ఆఫ్ క్యాంపస్ సెంటర్ల ఏర్పాటుపై ఇప్పుడు నిర్ణయం తీసుకోలేమన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జేపీ నారాయణ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, విజ్ఞాన భారతి ఇంజనీరింగ్.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యా సంవత్సరం ప్రారంభం దృష్ట్యా ఆఫ్ క్యాంపస్ సంస్థల ప్రారంభాన్ని వాయిదా వేయాలని నిపుణుల కమిటీ సూచన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ కాలేజీలు అప్పీల్ దాఖలు చేశాయి.
చదవండి: IIIT Hyderabad: 77 ఏళ్ల వయసులో పీజీ పూర్తి..లేటు వయసులో.. కాలేజీ బాట!
సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టివేసిన ధర్మాసనం
ఈ అప్పీళ్లపై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ఆగస్టు 14న విచారణ చేపట్టారు. ఆఫ్ క్యాంపస్ సెంటర్ల ఏర్పాటుపై ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినా ప్రభుత్వం నిర్ణయం వాయిదా వేయడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
అనుమతించాలా? వద్దా? అన్న దానిపై వచ్చే ఏడాది నిర్ణయం తీసుకుంటామని చెప్పడం చట్టవిరుద్ధమన్నారు. వాదన లు విన్న ధర్మాసనం.. ‘తెలంగాణ విద్యా చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగా లేదు.
అందుకే ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమే తప్పు. సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టివేస్తున్నాం. సెక్షన్ 20లోని నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఆఫ్ క్యాంపస్ సెంటర్ల ప్రారంభ అంశాన్ని పునఃపరిశీలన చేయాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.