Skip to main content

కుదిరితే నేరుగా.. లేదంటే ఆన్‌లైన్‌ తనిఖీలు: ఏఐసీటీఈ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ) ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టాలని జేఎన్‌టీయూ ఆలోచనలు చేస్తోంది.
కరోనా కారణంగా గతేడాది ఎలాంటి తనిఖీలు లేకుండానే అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న అన్ని కాలేజీలకు గుర్తింపును జారీ చేసింది. అయితే ఈసారి మాత్రం కుదిరితే కచ్చితంగా తనిఖీలు చేశాకే గుర్తింపు ఇవ్వాలని భావిస్తోంది. కరోనా అదుపులోకి రాకుండా, లాక్‌డౌన్‌ పరిస్థితులు కొనసాగితే మాత్రం ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌ చేపట్టాలని ఎఫ్‌ఎఫ్‌సీ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది 233 కాలేజీలకు జేఎన్‌టీయూ అనుబంధ గుర్తింపును ఇచ్చింది. అందులో ఇంజనీరింగ్‌ కాలేజీలు 153 ఉండగా ఫార్మసీ కాలేజీలు 70 ఉన్నాయి. ప్రత్యేకంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను నిర్వహించే కాలేజీలు 10 ఉండగా, పలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌తోపాటు ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను నిర్వహిస్తున్నవి ఉన్నాయి. ఇక ఈసారి మాత్రం అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే కాలేజీల్లో ఫ్యాకల్టీ, సదుపాయాలు, ల్యాబ్‌ ఇతరత్రా మౌలిక వసతులపై ఎఫ్‌ఎఫ్‌సీ తనిఖీలు చేపట్టాలనే ఆలోచనల్లో ఉంది. మరోవైపు జూన్‌ 15వ తేదీలోగా ఏఐసీటీఈ నుంచి కాలేజీలకు అనుమతులు వస్తాయని, అవి రాగానే అనుబంధ గుర్తింపు కోసం నోటిఫికేషన్‌ జారీ చేయాలని భావిస్తోంది. యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజులు గడువు ఇచ్చి తదుపరి చర్యలు చేపట్టనుంది.

ఆన్‌లైన్‌ పరీక్షలకు కొనసాగుతున్న ప్రణాళికలు
మరోవైపు జేఎన్‌టీయూ ఆన్‌లైన్‌ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మిడ్‌ టర్మ్‌ పరీక్షలను ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్లో చేపట్టేలా కసరత్తు చేస్తోంది. అవి సక్సెస్‌ అయితే నాలుగో సంవత్సరం సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా చర్యలు చేపట్టనుంది. లాక్‌డౌన్‌ పరిస్థితులను బట్టి ఆ తేదీలు ఖరారు చేయనున్నారు. అంతకంటే ముందే ప్రాజెక్టు, వైవా నిర్వహించాలని భావిస్తోంది. వీలైతే జూలై మొదటివారంలోనే ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
Published date : 31 May 2021 02:28PM

Photo Stories