Skip to main content

Engineering: ఇంజనీరింగ్‌పై తగ్గుతున్న క్రేజ్‌: ఏఐసీటీఈ

చేరికలు క్రమేణా కుదించుకుపోతుండడంతో దేశంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ తగ్గుదల ఏటా సగటున లక్ష వరకు ఉంటోంది.
Engineering
ఇంజనీరింగ్‌పై తగ్గుతున్న క్రేజ్‌: ఏఐసీటీఈ

ఇంజనీరింగ్తో పాటు మేనేజ్మెంట్ కోర్సులలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం 2012–13లో దేశంలో 26.9 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా ఇప్పుడు 23.61 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014–15లో గరిష్ట స్థాయిలో 31.83 లక్షల సీట్లున్నాయి. అప్పటి నుంచి సీట్ల సంఖ్యలో ఏటా లక్ష చొప్పున తగ్గుదల కనిపించింది. సరైన బోధనా సిబ్బంది లేకపోవడం, లేబొరేటరీలు, ఇతర ప్రమాణాలను సంస్థలు పాటించకపోవడంతో విద్యార్థులలో నైపుణ్యాలు కొరవడి ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఈ ప్రభావంతో క్రమేణా ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల చేరికలు పడిపోతుండటంతో కాలేజీలు సీట్ల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో ఆయా రంగాల్లోని అంశాలపై పరిజ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవలసి వస్తోంది. పాత సంప్రదాయ కోర్సులకు ఆదరణ తగ్గుతుండడంతో కాలేజీలు క్రమేణా వాటిని వదులుకుంటున్నాయి. ఇవన్నీ ఇంజనీరింగ్ కోర్సులలో సీట్ల సంఖ్య తగ్గడానికి కారణంగా యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.

మేనేజ్మెంట్ కోర్సుల్లో కొంత వ్యత్యాసం..

పదేళ్లుగా దేశంలో మేనేజ్మెంట్ కోర్సుల డేటా పరిశీలిస్తే 2012–13 నుంచి 2014–15 వరకు సీట్లు పెరగ్గా ఆ తర్వాత తగ్గాయి. 2017–18లో మేనేజ్మెంట్ సీట్ల సంఖ్య 3.94 లక్షలు కాగా 2018–19లో 3.74 లక్షలకు, 2019–20లో 3.73 లక్షలకు తగ్గాయి. తరువాత పెరుగుదల నమోదైంది. 2021–22లో 4.04 లక్షలకు చేరాయి.

ఇంజనీరింగ్ వెలవెల..

మేనేజ్మెంట్ కోర్సులతో పోలిస్తే గత ఐదేళ్లలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎక్కువ సీట్లు ఖాళీగా ఉన్నాయి. మేనేజ్మెంట్ సీట్లు 34 – 37 శాతం వరకు ఖాళీగా ఉండగా ఇంజనీరింగ్ సీట్లు 45 – 48 శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. బీఈ, బీటెక్ తర్వాత వెంటనే ఉద్యోగాలు రాకపోవడం కూడా దీనికి కారణం. అలాంటి వారు మేనేజ్మెంట్ కోర్సులలో చేరుతున్నట్లు తేలుతోంది. సివిల్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తమ కోర్ విభాగాల్లో ఉద్యోగాలు లేక మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. స్కిల్ ఇండియా తాజా నివేదికల ప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థులు 46.82 శాతం, మేనేజ్మెంట్ విద్యార్ధులు 46.59 శాతం ఉపాధి పొందినట్లు వెల్లడిస్తున్నాయి. వివిధ సంస్థలు ఇంజనీరింగ్ అర్హతలతోపాటు మేనేజ్మెంట్ నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యమిస్తుండడంతో అటువైపు మొగ్గు చూపుతున్నట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలోనూ ఇవే రకమైన గణాంకాలు

దేశంలోని పరిస్థితినే రాష్ట్రంలో ఏఐసీటీఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు 2.99 లక్షలుండగా 2021–22 నాటికి 2.37 లక్షలకు తగ్గాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో 2014–15లో 51,750 సీట్లుండగా 2021–22 నాటికి 39,451కి తగ్గాయి.

ఇంజనీరింగ్ సీట్ల వివరాలు..

సంవత్సరం

దేశంలో

రాష్ట్రంలో

2014–15

31,83,015

2,99,486

2015–16

30,93,426

2,94,548

2016–17

29,99,138

2,85,300

2017–18

28,70,688

2,77,893

2018–19

27,11,878

2,59,869

2019–20

25,41,212

2,50,208

2020–21

24,42,392

2,43,657

2021–22

23,61,753

2,37,421

Published date : 28 Sep 2021 11:37AM

Photo Stories