Skip to main content

Central Education Department: కౌన్సెలింగ్‌ తర్వాతే క్లాసులు..

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలను కట్టడిచేసేందుకు కేంద్ర విద్యాశాఖ నడుం బిగించింది. జాతీయ ఇంజనీరింగ్, మెడికల్, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల మానసిక ఒత్తిడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది.
Central Education Department
కౌన్సెలింగ్‌ తర్వాతే క్లాసులు..

కాలేజీలు మొదలయ్యే ముందే విద్యార్థులకు విద్యా విధానం, ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించాలని భావించింది. ఇందులోభాగంగా కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ కేంద్రాలు (ఐఐఎస్‌ఈఆర్‌), ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌)లను ఆదేశించింది. ఈ సంస్థల్లో 2018 నుంచి 2022 వరకు జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, వాటి కారణాలపై కేంద్రం అధ్యయనం చేసింది.  

ఐఐటీల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు 

గత ఐదేళ్లలో ఐఐటీల్లో 32 మంది, ఎన్‌ఐటీల్లో 21 మంది, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 20 మంది, ఎయిమ్స్‌ సంస్థల్లో 11 మంది విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలించారు. జాతీయ స్థాయిలో తీవ్ర పోటీని తట్టుకుని సీట్లు తెచ్చుకున్న ఈ విద్యార్థులు మానసిక ఒత్తిడి, అనుకోకుండా డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. జాతీయ కాలేజీల్లో చేరిన రెండో సంవత్సరం నుంచి వారికి తెలియకుండానే మానసిక ఒత్తిడి మొదలవుతోందని నిపుణులు చెబుతున్నారు. మొదటి ఏడాదిలో మిగిలిపోయే బ్యాక్‌లాగ్స్‌తో ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారని, కోర్సు ముగిశాక అనుకున్న రీతిలో జీవితంలో స్థిరపడలేమనే నైరాశ్యం వారిలో గూడుకట్టుకుంటోందని జాతీయ ఇంజనీరింగ్‌ సంస్థల డైరెక్టర్లు అభిప్రాయపడుతున్నారు.  

బట్టీ విధానమే కారణమా? 

ప్రతీ రాష్ట్రంలోనూ ఇంటర్మీడియెట్‌ వరకు కాలేజీల్లో బట్టీ విధానంలోనే బోధన సాగుతోందని నిపుణులు అంటున్నారు. జాతీయ పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్‌ కోసం కోచింగ్‌ కేంద్రాలు ఒక తరహా బట్టీ పద్ధతిలోనే బోధన చేస్తున్నాయని చెబుతున్నారు. ఇది అసలైన మేధో విధానం కాకపోవడం, ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత ఇదే పద్ధతి ఉండకపోవడం సమస్యకు మూలంగా పేర్కొంటున్నారు. ఆత్మహత్యల నేపథ్యాన్ని పరిశీలిస్తే గణితం, ఫిజిక్స్‌ ప్రామాణికంగా ఉండే సబ్జెక్టుల్లోనే విద్యార్థులు వెనుకబడుతున్నారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు పూర్తిగా పరిశోధనాత్మకంగా ఉండాలని జాతీయ విద్యావిధానం చెబుతోంది. మేథ్స్‌లో ఏదైనా సమస్యను విశ్లేషణాత్మకంగా పరిష్కరించే విధానం జాతీయ సాంకేతిక విద్యలో ఇప్పుడు కీలకమైంది. బట్టీ విధానంలో వచ్చిన విద్యార్థులు ఇక్కడే గందరగోళానికి గురవుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

 ఏ మాత్రం ధైర్యం కోల్పోతున్నా... 

ఉమ్మడి సీట్ల కేటాయింపునకు సంబంధించిన ఆరు దశల ‘జోసా’కౌన్సెలింగ్‌ పూర్తయింది. మరికొద్ది రోజుల్లో ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో క్లాసులు మొదలవుతాయి. అందువల్ల ముందుగా ప్రతీ బ్రాంచీలోని విద్యార్థులను సమైక్య పర్చాలి. వారిలో ఉత్తేజాన్ని, మనోధైర్యాన్ని కల్పించేలా కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. సమస్యలకు పరిష్కారం సాధించే మార్గాలను ముందే వివరించాలి. ప్రతీ విద్యార్థి వ్యక్తిగత నేపథ్యం, వారి కుటుంబ వివరాలు తెలుసుకోవాలి. కొన్ని రోజులు విద్యార్థులను దగ్గర్నుంచి పరిశీలించాలి. ఏమాత్రం ధైర్యం కోల్పోతున్నట్టు గుర్తించినా అతన్ని ప్రత్యేక పద్ధతిలో కౌన్సెలింగ్‌ చేయాలి. ఈ దిశగా అన్ని కాలేజీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది.  
 
కౌన్సెలింగ్‌ అవసరం : ప్రొఫెసర్‌ బిద్యాధర్‌ సుబుదీ (నిట్‌ డైరెక్టర్, వరంగల్‌) 
విద్యార్థుల ఆత్మహత్యలను సీరియస్‌గా తీసుకోవాలి. మనోనిబ్బరం కోల్పోయిన వారికి ఒకసారి సాదాసీదా కౌన్సెలింగ్‌ ఇస్తే సరిపోదు. దశలవారీగా కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. అతనిలో వచ్చే మార్పులను గమనించాలి. అవసరమైతే తల్లిదండ్రులనూ పిలిచి వారితో ధైర్యం చెప్పించాలి. ప్రతీ ఎన్‌ఐటీలోనూ కౌన్సెలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన మంచిదే. 
 
ఒత్తిడికి లోనవుతున్నారు: డాక్టర్‌ ఎన్‌వీ రమణారావు (నిట్‌ డైరెక్టర్, రాయ్‌పూర్‌) 
జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీటు వచ్చే వరకూ చదవడం వేరు. వచ్చిన తర్వాత చేయాల్సిన కృషి వేరు. ఈ తేడాను గుర్తించలేక విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి వారిని గమనించేందుకు ప్రతీ పది మంది విద్యార్థులకు ఒక మెంటార్‌ను నియమించాం.  

2018–2022 మధ్య జాతీయ సంస్థల్లో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు 

సంస్థ

2018

2019

2020

2021

2022

ఐఐటీలు

8

8

3

4

9

ఎన్‌ఐటీలు

3

8

1

2

7

కేంద్ర వర్సిటీలు

6

4

4

1

5

ఐఐఎస్‌ఈఆర్‌

1

0

0

0

2

ఐఐఎంలు

1

0

1

1

1

ఎయిమ్స్‌

2

0

4

2

3

మొత్తం

21

20

13

10

27

Published date : 16 Aug 2023 12:35PM

Photo Stories