scholarships: స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు ఆహ్వానం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నేషనల్ మీన్స్–కమ్–మెరిట్ స్కాలర్‌షిప్ కోసం నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 25వ తేదీ వరకూ గడువు పొడిగంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ, తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ.3,50,000 లోపు ఉన్న విద్యార్థులు అందరూ ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు.
కేంద్రియ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు కాదన్నారు. ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్‌సైట్‌లో ఉన్న లింక్‌ను ఓపెన్ చేసి సంబంధిత స్కూల్ కోడ్‌ను నమోదు చేయాలన్నారు. తర్వాత ఇతర పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం వెబ్ సైట్ లేదా సంబంధిత విద్యాశాఖాధికారి కార్యాలయంలో గానీ సంప్రదించాలన్నారు.