తెలంగాణ టాప్ ఎంసెట్ ర్యాంకర్లు ఏమన్నారంటే...?
జిప్‌మర్‌లో చదవాలన్నది నా కోరిక...
ఎయిమ్స్, జిప్‌మర్‌లో చదవాలన్నదే తన కోరిక అని మండవ కార్తికేయ అన్నాడు. తమ కుమారుడు మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి అని అతని తల్లిదండ్రులు మండవ మోహన్‌రావు, శాంతిశ్రీ పేర్కొన్నారు. ఇంటర్‌లో 998 మార్కులు సాధించాడన్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావాలి...
సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరి గొప్పస్థాయికి ఎదగాలనేది తన లక్ష్యమని హైదర్‌నగర్ పరిధిలోని నిజాంపేట్ రోడ్‌లో నివసించే జోస్యుల వెంకట ఆదిత్య తండ్రి రామకృష్ణ, శ్రీవల్లి పేర్కొన్నారు. తను కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని.. తన కుమారుడిని మంచి హోదాలో చూడాలని కోరుకుంటున్నానని రామకృష్ణ తెలిపారు.
సంతోషంగా ఉంది....
రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్ రావడం హ్యాపీగా ఉందని రావి అభిరామ్ పేర్కొన్నాడు. ప్లానింగ్‌తో చదివడం వల్లే మంచి ర్యాంకు సాధించానని చెప్పాడు. పాండిచ్చేరి జిప్‌మర్‌లో ఎంబీబీఎస్ చేయాలన్నది తన ఆశయమన్నాడు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటే లక్ష్యం..
నీట్‌లో మంచి ర్యాంక్ సాధించి ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు సాధించడమే తన లక్ష్యమని తెరుపల్లి సాయికౌషల్ రెడ్డి తెలిపాడు. ప్రతి రోజు 10 గంటలకు పైగా సమయాన్ని సిద్ధమవడం కోసం కేటాయించినట్లు పేర్కొన్నాడు. ఎంసెట్ మెడిసన్ విభాగంలో మూడవ రాంక్ సాధించడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు వెల్లడించాడు.
అంకాలజిస్ట్ కావాలన్నదే లక్ష్యం...
అంకాలజిస్ట్(కేన్సర్ స్పెషలిస్ట్) కావాలన్నదే తన లక్ష్యమని కన్నెకంటి ఖమ్మంకు చెందిన లాస్య చౌదరి పేర్కొంది. అంకాలజిస్ట్‌నైతే ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం లభిస్తుందని తెలిపింది. తన అమ్మానాన్న వైద్యులు కావడంతో పాటు అక్క సైతం ఓయూలో వైద్యవిద్య చదువుతోందని చెప్పింది.
కష్టపడితే ర్యాంకు సులభమే...
కష్టపడి చదివితే ర్యాంకు సాధించడం సులభమేనని వనస్థలిపురం సుభద్రానగర్ కాలనీకి చెందిన రామస్వామి సంతోష్‌రెడ్డి అన్నాడు. తల్లి సంతోష, తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి తోడ్పాటుతోనే తాను ర్యాంకు సాధించినట్లు తెలిపారు.
తండ్రి బాటలోనే...
తన తండ్రి లాగానే తాను కూడా గొప్ప డాక్టర్‌ను అవుతానంటుంది రంగారెడ్డి జిల్లా పెద్దంబర్‌పేట్‌కు చెందిన శ్రీనిజ. ఆమె తండ్రి డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి యశోదా ఆసుపత్రిలో న్యూరాల జిస్ట్‌గా పని చేస్తున్నారు. తన తల్లి శ్రీదేవి నిరంతరం తనను ప్రోత్సహించిందని ఆమె తెలిపింది.
ఐఐటీ బాంబేలో చేరుతా..
ఉత్తమ ర్యాంకు సాధించడానికి తల్లిదండ్రులు, అధ్యాపకుల సహకారం మరువలేనిదని రామసాని సంతోష్‌రెడ్డి పేర్కొన్నాడు. ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ కోర్సులో చేరుతానని చెప్పాడు. కోర్సు పూర్తి చేసిన తరువాతనే.. భవిష్యత్తులో ఏం కావాలనేది నిర్ణయించుకొంటా.
నాన్న కల నెరవేరుస్తా..
ఐఐటీ సాధించాలన్న తన తండ్రి కర్ణాకర్‌రెడ్డి కల నెరవేస్తానని నల్లగొండ పట్టణానికి చెందిన సోమిడి సాత్వికరెడ్డి పేర్కొంది. అమ్మానాన్న తనను ఎంతో కష్టపడి చదివించారని తెలిపింది. ముంబై ఐఐటీలో సీటు సాధించాలనేది తన చిరకాల స్వప్నమని వివరించింది.
వైద్య కోర్సుపై మక్కువ..
వైద్య కోర్సుపై మక్కువతో ఇంటర్‌లో బైపీసీ గ్రూపు ఎంచకున్నానని నల్లగొండ జిల్లా చిత్తలూరుకు చెందిన బండగొర్ల రామకృష్ణ చెప్పాడు. నీట్ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నానని, తన తల్లితండ్రులు వ్యవసాయ పనులు చేస్తూ ఎంతో కష్టపడి చదివించారని వెల్లడించాడు. నీట్‌లో మంచి ర్యాంకు సాధించాలన్నది తన లక్ష్యమన్నాడు.