Skip to main content

TS EAMCET Counselling: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యం? ఇప్పటివరకు కాలేజీలకు లభించని అనుమతి

State Council of Higher Education notice   Delayed Engineering Counseling Announcement  TS EAMCET Counselling  Engineering colleges awaiting AICTE recognition

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఈ ఏడాది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కని్పస్తోంది. వచ్చే నెల 27 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఇంజనీరింగ్‌ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి ఎలాంటి గుర్తింపు రాలేదు.

అసలు ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇంకా మొదలు కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కౌన్సెలింగ్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సంబంధిత యూనివర్సిటీలు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తాయి. అయితే దీనికన్నా ముందు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఏఐసీటీఈ 2024–25 విద్యా సంవత్సరానికి క్యాలెండర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం జూన్‌ 10వ తేదీకల్లా అన్ని కాలేజీలకు అనుమతినివ్వాలి. నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకునే కాలేజీలకే అనుమతి లభిస్తుంది. జూన్‌ 10కల్లా అనుమతి రాని కాలేజీలు.. సౌకర్యాలు కల్పించుకుని మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పింస్తారు. ఈ ప్రక్రియను జూన్‌ 30 నాటికి ముగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాలేజీలు ఏఐసీటీఈ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే జూన్‌ 10 నాటికి అనుమతి లభించడం కష్టమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

కొత్త కోర్సుల చేరిక వల్లే ఆలస్యం 
జాతీయ స్థాయిలో విద్యా విధానంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్టు భారత్‌లోనూ క్రెడిట్‌ విధానం అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. టెన్త్‌ వరకూ కొన్ని క్రెడిట్స్, ఇంటర్‌ తర్వాత కొన్ని, డిప్లొమా కోర్సులకు, ఇంజనీరింగ్‌ కోర్సులకు ఇలా.. క్రెడిట్స్‌ విధానం తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రొఫెషనల్‌ కోర్సులను ఏఐసీటీఈ పరిధిలో చేరుస్తున్నారు. 

ఇప్పటివరకూ బీబీఏ, బీసీఏ, బీఎంఎస్‌ వంటి కోర్సులు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ పరిధిలో ఉండేవి. తాజాగా ఏఐసీటీఈ పరిధిలోకి తెస్తూ అన్ని కోర్సులకు కలిపి ఒకే దరఖాస్తు విధానం తీసుకొచ్చారు. అంటే బీబీఏ, బీసీఏ, బీఎంఎస్‌ కోర్సులతో పాటు ఇంజనీరింగ్‌ కోర్సులు కూడా ఇదే దరఖాస్తు విధానంలోకి వచ్చాయన్న మాట. ఈ మేరకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపొందించడానికి కాస్త సమయం పట్టే అవకాశం కని్పస్తోందని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలేజీలకు గుర్తింపు ఆలస్యమయ్యే వీలుందని చెబుతున్నాయి.  

జోసా కౌన్సెలింగ్‌ నాటికి జరిగేనా? 
ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కేంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెలలో కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష పూర్తయింది. త్వరలో జోసా (జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) కౌన్సెలింగ్‌ తేదీలనూ ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఆరు దశలుగా ఉంటుంది. జోసా కౌన్సెలింగ్‌ చివరి తేదీని బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ చివరి దశ చేపడతారు. విద్యార్థులు తొలి దశలో రాష్ట్ర కాలేజీల్లో చేరి, చివరి దశలో జాతీయ కాలేజీల్లోకి వెళ్తారు. ఇలా ఖాళీ అయిన సీట్లను చివరి దశలో భర్తీ చేస్తారు. కానీ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి ఇప్పటికీ రాకపోవడంతో రాష్ట్ర ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత రావడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి.  

ఈలోగానే అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం 
రాష్ట్ర ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్ణయించిన తేదీల్లోనే కొనసాగుతుంది. ఈలోగా ఏఐసీటీఈ అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. ఏఐసీటీఈ అకడమిక్‌ క్యాలెండర్‌ను కూడా ప్రకటించింది. బీబీఏ, బీసీఏ, బీఎంఎస్‌ కాలేజీలను ఏఐసీటీఈ పరిధిలోకి కొత్తగా తేవడం వల్ల కొంత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది.  
– ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్‌) 

Published date : 28 May 2024 12:29PM

Photo Stories