TS EAMCET 2024: టీఎస్ ఇంజనీరింగ్ సెట్ పరీక్ష.. ఎక్కువ ప్రశ్నలు ఆ చాప్టర్ల నుంచే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష మూడో రోజు ప్రశాంతంగా ముగిసింది. గడచిన రెండు రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన సెట్ జరిగితే, గురువారం ఇంజనీరింగ్ సెట్ తొలి రోజు జరిగింది. ఈ విభాగానికి 2,54,539 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,01,956 మంది తొలి రోజు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాల్సి ఉండగా 96,228 (94.4 శాతం) మంది పరీక్షకు హాజరైనట్టు ఈఏపీసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు.
సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంలో అత్యధికంగా 99 శాతం హాజరు కన్పించింది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్ జిల్లాల్లో ఇంజనీరింగ్ సెట్ కేంద్రాలకు 90 శాతంపైనే విద్యార్థులు హాజరయ్యారు. అకాల వర్షం కారణంగా ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశామని సెట్ కో–కన్వీనర్ విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
అన్ని చోట్లా జనరేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎక్కడా విద్యార్థులకు ఎలాంటి సమస్య తెలెత్తలేదని తెలిపారు. అయితే, హైదరాబాద్‌లోని పలు కేంద్రాల్లో కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కొద్దిసేపు కంప్యూటర్లు తెరుచుకోలేదు. సమస్య పరిష్కరించేసరికి 15 నిమిషాలు పట్టిందని కూకట్‌పల్లి విద్యార్థిని మనోజ్ఞ తెలిపారు. మరో రెండు రోజులు ఇంజనీరింగ్ సెట్ జరగాల్సి ఉంది.
పేపర్ మధ్యస్తం
తొలి రోజు ఇంజనీరింగ్ సెట్ పేపర్ మధ్యస్తంగా ఉన్నట్టు విద్యార్థులు, అధ్యాపకులు తెలిపారు. మేథమెటిక్స్‌లో ఇచ్చిన ప్రశ్నలు తెలిసినవే అయినప్పటికీ, సమాధానాలు రాబట్టేందుకు సుదీర్ఘంగా ప్రయత్నించాల్సి వచ్చినట్టు వరంగల్ విద్యార్థి అభిలాష్ తెలిపారు. సమాధానాల కోసం ఎక్కువ సేపు ప్రయత్నించాల్సి వచ్చినట్టు, దీనివల్ల ఇతర ప్రశ్నలు రాయలేక పోయామని ఖమ్మం విద్యార్థిని అలేఖ్య తెలిపారు.
అయితే, సాధారణ విద్యార్థి 35 నుంచి 40 ప్రశ్నలకు సమాదానం తేలికగా చేసే వీలుందని మేథ్స్ సీనియర్ అధ్యాపకుడు ఎంఎన్‌రావు తెలిపారు. ఎక్కువ ప్రశ్నలు ఆల్‌జీబ్రా, ట్రిగ్నామెట్రీ, స్ట్రైట్‌లైన్స్, పెయిర్స్ ఆఫ్ లైన్స్, త్రీడీ చాప్టర్ల నుంచి వచ్చినట్టు ఆయన విశ్లేషించారు. రసాయనశాస్త్రంలో 25 ప్రశ్నలు తేలికగా, నేరుగా ఉన్నట్టు నిపుణులు తెలిపారు. ఆర్గానిక్ కెమెస్ట్రీ, ఆటమిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, పిరియాడిక్ టేబుల్, ఎస్,పీ,డీ బ్లాక్ ఎలిమెంట్స్ చాప్టర్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు తేలికగా ఉన్నట్టు విశ్లేషించారు.
ఫిజిక్స్ పేపర్ మధ్యస్థంగా ఉందని, 20 ప్రశ్నలు తేలికగా చేసే వీలుందని అధ్యాపకులు తెలిపారు. ఫార్ములా, కాన్సెప్ట్ విధానం నుంచి ప్రశ్నలు ఇచ్చారు. మెకానిక్స్, ఎస్హెచ్ఎం, విక్టరీస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, వేవ్స్, ఆప్టిక్స్ చాప్టర్ల నుంచి తేలికగా సమాధానం ఇవ్వగల ప్రశ్నలు వచ్చినట్టు చెప్పారు.
Tags
- TS EAPCET 2024
- TS EAPCET 2024 Exam Dates
- TS EAPCET 2024 Notification
- ts eapcet 2024 exam schedule
- TS EAPCET-2024
- EAPCET
- EAPCET Agriculture
- EAPCET Pharmacy
- EAPCET Results
- State Board of Higher Education
- Telangana State Board of Higher Education
- SakshiEducationUpdates
- EAMCET
- Joint Entrance Examination
- EngineeringExam
- PharmacyExam
- AgricultureExam
- AdmissionTest