Skip to main content

ఎటూ తేలని ఎంసెట్‌.. ఈసెట్‌ పరీక్ష వాయిదా..

జూలై 13న జరగాల్సిన ECET పరీక్షను వాయిదా వేస్తున్నామని, ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు.
EAMCET And ECET Exams postponed
ఎటూ తేలని ఎంసెట్‌.. ఈసెట్‌ పరీక్ష వాయిదా..

అయితే జూలై 14న జరగాల్సిన EAMCETపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న వర్ష బీభత్స పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపామని చెప్పారు. వర్షాలు తగ్గని పక్షంలో EAMCET కూడా వాయిదా తప్పదని, దీనిపై జూలై 12 వరకూ వేచి చూస్తామని అన్నారు. అయితే దీనిపై జూలై 13న నిర్ణయిద్దామని ముఖ్యమంత్రి కార్యాలయం(CMO) ఉన్నత విద్యామండలికి తెలిపినట్లు సమాచారం. జూలై 14, 15 తేదీల్లో EAMCET మెడికల్, అగ్రికల్చర్‌ విభాగం పరీక్ష జరగాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో EAMCET మెడికల్‌ విభాగం ప్రవేశ పరీక్షనైనా వాయిదా వేస్తే మంచిదని ఉన్నత విద్యా మండలి భావించింది. ఇదే విషయమై జూలై 11న‌ ఉన్నతాధికారులు చర్చించారు. అయితే, ఎంసెట్‌ విభాగానికి ఐటీ కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న సంస్థ వాయిదాపై సాంకేతిక పరమైన కారణాలు లేవనెత్తింది. తాము జాతీయ స్థాయి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని EAMCET తేదీలను ఖరారు చేశామని, ఇప్పుడీ పరీక్ష వాయిదా వేస్తే, మళ్లీ తేదీలను సెట్‌ చేయడం కష్టమని తెలిపింది. ఈ నేపథ్యంలో మండలి ఉన్నతాధికారులు తర్జనభర్జనలో పడ్డారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వర్షాలు ఇలాగే ఎడతెరిపి లేకుండా ఉంటే, ఎంసెట్‌ నిర్వహణ కష్టమేనని ప్రభుత్వ వర్గాలూ భావిస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో పరీక్షలు నిర్వహిస్తే, వానల కారణంగా అనుకోని ఘటనలు జరిగితే ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడినట్టు తెలిసింది. కన్సల్టెన్సీ సంస్థ మాటలు నమ్మి ఈ పరిస్థితుల్లో ఎంసెట్‌ నిర్వహించడం సరికాదని ఆయన కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. అయితే, వర్షాలు ఇదే స్థాయిలో ఉంటే జూలై 13న ఎంసెట్‌ పరీక్షపైనా నిర్ణయం తీసుకుందామని మండలి అధికారులకు సీఎంవో తెలిపినట్టు సమాచారం.

చదవండి: 

ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

విజయానికి అనురించాల్సిన వ్యూహాలు... ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం!

Published date : 12 Jul 2022 03:33PM

Photo Stories