EAMCET 2023: నోటిఫికేషన్‌పై.. ఎందుకు జాప్యం?
ఎంసెట్‌లో ఇంటర్‌కు వెయిటేజీ ఉండబోదని కూడా అధికారులు చెబుతున్నా దీనిపై జీవో వెలువడలేదు. దీంతో ఎంసెట్‌ను నిర్వహించే పరీక్షకు ఏర్పాట్లు చేయలేకపోతున్నట్టు జేఎన్‌టీయూహెచ్ చెబుతోంది. మరోవైపు కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియను జేఎన్‌టీయూహెచ్ వచ్చే వారంలో చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే కాలేజీల డేటా తెప్పించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఎంసెట్ నిర్వహణ, కౌన్సెలింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేస్తే తప్ప, వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేసే వీలుండదని అంటున్నారు.
చదవండి: ఎంసెట్ హోమ్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
వీలైనంత త్వరగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసులు నిర్వహిస్తేనే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని యూనివర్సిటీల వీసీలు కూడా అంటున్నారు. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ తొలిదశ పూర్తయింది. రెండో విడత ఏప్రిల్‌లో జరగనుంది. కోవిడ్ మూలంగా గత రెండేళ్ళుగా విద్యా సంవత్సరం ఆలస్యంగా నడుస్తోంది. ఈసారైనా సకాలంలో పూర్తి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అన్ని రాష్ట్రాలకూ సూచించింది. త్వరలోనే కొత్త విద్యా సంవత్సరంలో చేపట్టే మార్పులు, చేర్పులతో మార్గదర్శకాలు విడుదల చేయాలని భావిస్తోంది. కానీ మన రాష్ట్ర ఎంసెట్ విషయంలో మాత్రం అధికారులు నిర్లిప్తంగా ఉండటం విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక వర్గాలను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.
చదవండి: EAMCET 2023: ఈసారి ఎంసెట్‌కు ఇంత శాతం సిలబస్ మాత్రమే
స్పష్టత కోరుతున్న విద్యార్థులు
ఎంసెట్ వివరణాత్మక నోటిఫికేషన్ వస్తేనే అన్ని విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ ఏడాదికి 70 శాతం సిలబస్ ఉంటుందా? లేదా? వెయిటేజీ ఇస్తారా? ఇవ్వ రా? అనేది తెలిస్తే ఎంసెట్‌కు ఎలా సన్నద్ధమవ్వాలనే దానిపై స్పష్టత ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. వాస్తవానికి ఈ నెల 7వ తేదీన ఎంసెట్‌తో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మే 7వ తేదీన ఎంసెట్ ఇంజనీరింగ్, మే 12, 13, 14 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ ఎంసెట్ ఉంటా యని తెలిపారు. రెండురోజుల్లో వర్సిటీలు వివరణాత్మక నోటిఫికేషన్లు ఇస్తాయని చెప్పారు. కానీ ఇంతవరకు వెలువడకపోవడంతో ఎందుకు జాప్యం జరుగుతోందో అర్ధం కాక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.
చదవండి: EAMCET: పరిధిలోకి ఈ కోర్సులు
వీలైనంత త్వరలో నోటిఫికేషన్
ఎంసెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. విడుదలకు ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయినా వీలైనంత త్వరలోనే జారీ చేస్తాం. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు సకాలంలోనే క్లాసులు మొదలవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం.
– ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్