EAMCET 2022: ఎంసెట్‌పై కరోనా ఎఫెక్ట్.. కనీస మార్కులు సాధించలేదు..
గత రెండేళ్లుగా వార్షిక పరీ క్షలు సరిగ్గా జరగకపోవడం, సక్రమంగా బోధన సాగకపోవడం, EAMCET ప్రిపరేషన్‌కు అనువైన వాతావరణం లేకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్‌లో 1,72,238 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారిలో 1,56,860 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 1,26,140 మంది అర్హత సాధించారు. అంటే దాదాపు 20 వేల మంది పరీక్షే రాయలేదు. పరీక్ష రాసినా 30 వేల మంది అర్హత (కనీస మార్కులు 40) సాధించలేదు. అర్హులైన వారిలో దాదాపు 60 వేల మందికి కోరుకున్న బ్రాంచి, కాలేజీలో సీటు రావడం కష్టంగానే ఉంది. వారంతా 40 వేలపైన ర్యాంకు వాళ్లే. కొందరికి ఇంటర్‌లో 90 శాతం మార్కులొచ్చినా ఎంసెట్‌లో 50కి మించి మార్కులు రాలేదు.
▶ College Predictor 2022 - AP EAPCET | TS EAMCET
సన్నద్ధతలో సమస్యలు..
కరోనా కారణంగా 2020లో పరీక్షలు లేకుండానే టెన్త్ విద్యార్థులను పాస్ చేశారు. 2021లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు పొందిన ఈ విద్యార్థులకు చాలాకాలం ప్రత్యక్ష బోధన జరగలేదు. ఆ తర్వాత బోధన సాగినా సిలబస్ తగ్గించారు. పరీక్షలు కూడా ముందు లేవని ఆ తర్వాత ఆలస్యంగా నిర్వహించారు. దీంతో ఫస్టియర్ పరీక్షల్లో కేవలం 46 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం కనీస మార్కులతో అందరినీ పాస్ చేసింది. ఈ విద్యార్థులే ఇంటర్ సెకండియర్ పాసై ఎంసెట్ రాశారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లపాటు ఎంసెట్ ప్రిపరేషన్ సరిగ్గా సాగలేదని విద్యార్థులు చెబుతున్నారు.
▶ Top Engineering Colleges 2022 - Andhra Pradesh | Telangana
వెయిటేజీ లేకపోవడం..
ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థికి సాధారణంగా ఎంసెట్‌లో కలసి వస్తుంది. అయితే కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తేశారు. ఎంసెట్‌లో 50 మార్కులు వచ్చి ఇంటర్‌లో 85 శాతం స్కోర్ చేస్తే 25 వేలలోపు ర్యాంకు వచ్చే వీలుంది. కరోనాకు ముందు 80 మార్కులు ఎంసెట్‌లో, ఇంటర్ సబ్జెక్టుల్లో 85 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు 10 వేల లోపు ర్యాంకుల్లో ఉన్నారు. ఇంటర్ మార్కులు లేకపోవడంతో ఎంసెట్‌లో 80 మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఈసారి 20 వేల ర్యాంకులోకి వెళ్లారు. ఇందులో గ్రామీణ ప్రాంత విద్యార్థులు, చిన్న పట్టణాలకు చెందిన వారు ఎక్కువగా నష్టపోయినట్లు కనిపిస్తోంది.