TS DSC 2024: ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు.. ఇక్కడ 506 పోస్టులు ఖాళీ
గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం ఫిబ్రవరి 29న కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. గత నోటిఫికేషన్‌లో జిల్లాలో 285 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.
కొత్త నోటిఫికేషన్‌లో 506 పోస్టుల భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఎస్‌జీటీ 354, స్కూల్ అసిస్టెంట్ 132, లాంగ్వేజ్ పండిట్ 15, పీఈటీ 5 పోస్టులు ఉన్నాయి. జిల్లాకు అదనంగా 221 పోస్టులు రావడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పోటీ తీవ్రం..
జిల్లాలో 1011 ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 96 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 4,081 మంది ఉపాధ్యాయులు పాఠాలను బోధిస్తున్నారు. ప్రస్తుతమున్న ఉపాధ్యాయులకు అదనంగా మరో 506 పోస్టులు భర్తీ కానుండటంతో పాఠశాలల్లో టీచర్ల కొరత తీరనుంది.
2017 నుంచి డీఎస్సీ నిర్వహించకపోవడంతో జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు తీవ్రంగా పోటీ ఉండనుంది. గతంలో కంటే కొంత మేర పోస్టులు పెరిగినా పోటీ భారీగానే ఉండనుంది. టెట్ క్వాలిఫై అయిన వారు బ్యాచులు బ్యాచులుగా ఉండడంతో పాటు ఇటీవల గురుకుల పోస్టుల భర్తీ జరుగుతున్న కారణంగా చాలా మంది ప్రిపరేషన్‌లో ఉన్నారు. జిల్లాలో టెట్‌లో పేపర్–1లో 4,228 మంది, పేపర్–2లో 5,102 మంది క్వాలిఫై అయ్యారు.