Skip to main content

అంబేడ్కర్ వర్సిటీ తెలం‘గానం’

సాక్షి, హైదరాబాద్: సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్టుందనే సామెతలా మారింది అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆంధ్ర విద్యార్థుల పరిస్థితి. ఈ వర్సిటీని తెలంగాణకే పరిమితం చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ వర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలకు 30 వేల మంది హాజరుకాగా అందులో సగానికి పైగా ఏపీకి చెందిన వారున్నారు. ఇటీవల ఈ పరీక్షల ఫలితాలను ప్రకటించిన వర్సిటీ అందులో తెలంగాణ జిల్లాల వారివి మాత్రమే ఉంచింది. ఏపీ అభ్యర్థుల ఫలితాల్నివెల్లడించలేదు. వర్సిటీ వెబ్‌సైట్‌లో కేవలం తెలంగాణ జిల్లాల్లోని వర్సిటీ అధ్యయన కేంద్రాలను మాత్రమే ఉంచి ఏపీలోని 92 అధ్యయన కేంద్రాలను ఎత్తేశారు. దీంతో ఈ వర్సిటీ ద్వారా దూర విద్యనభ్యసిస్తున్న మూడు లక్షల మందికి పైగా ఏపీ విద్యార్ధులు గందరగోళంలో పడ్డారు. వర్సిటీ విభజనతో పాటు ప్రవేశాలు తదితరాలపై కొంతకాలంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం నలుగుతోంది. వర్సిటీ వీసీ పరిష్కార చర్యల కోసం ఏపీ ప్రభుత్వానికి ఐదుసార్లు లేఖలు రాసినా స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం తనవాటా బడ్జెట్‌ను విడుదల చేసినా ఏపీ నయాపైసా ఇవ్వలేదు. దీంతో విసిగిపోయిన వర్సిటీ అధికారులు దాని సేవలను తెలంగాణకే పరిమితం చేయాలనినిర్ణయించారు. ఏపీలోని జిల్లాలనుంచి లక్షలాది మంది ఈ వర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికే వివిధ స్థాయిల్లో విద్యనభ్యసిస్తున్న వారు తెలంగాణలోని అధ్యయన కేంద్రాలను ఆశ్రయించాల్సి రావడంతో ఏమిచేయాలో వారికి పాలుపోవడం లేదు. ఈ సమస్యపై ఏపీ ఉద్యోగుల ఫోరం పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి గంటా శ్రీనివాసరావును కలసినా ఫలితం లేకపోయింది. పైగా ఏటా విడుదల చేయాల్సిన బడ్జెట్‌ను రాష్ర్ట ప్రభుత్వం గాలికొదిలేయడంతో ఏపీ సేవలనుంచి ఈ వర్సిటీ తనంతట తానుగా వైదొలిగింది. ఇది ఏపీ విద్యార్ధులకు శరాఘాతంగా మారింది.

పదేళ్లుగా ఏపీ విద్యార్థుల సంఖ్య

2005-06

60,577

2006-07

56,245

2007-08

58,603

2008-09

64,922

2009-10

62,654

2010-11

61,038

2011-12

57,494

2012-13

55,243

2013-14

44,869

2014-15

45,996

Published date : 02 Jul 2015 01:16PM

Photo Stories