Supreme Court To Hear Ban On Trump-డొనాల్డ్ ట్రంప్‌పై బ్యాన్, సుప్రీం తీర్పుపై ఉత్కంఠ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం త్వరలోనే తేలనుంది. అధ్యక్ష పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న ఆయనకు కొలరాడో సుప్రీంకోర్డు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర ప్రైమరీ బ్యాలెట్‌లో పాల్గొనకుండా ట్రంప్‌పై నిషేధం విధించింది.
అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి
తాజాగా దీనిని రద్దుచేయాలని కోరుతూ యూఎస్ సుప్రీం కోర్టులో ట్రంప్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించేందుకు ఆ దేశ సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. ట్రంప్ వేసిన పిటిషన్‌పై విచారణను త్వరిగతిన చేపడతామని, ఫిబ్రవరి 8న తుది వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తెలిపారు. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థిపై ఇలా అనర్హత పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అనర్హత ఎందుకు?
2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత క్యాపిటల్ బిల్డింగ్‌పై జరిగిన దాడి డొనాల్డ్ ట్రంప్ వల్లే జరిగిందని కొలరాడో కోర్టు తెలిపింది. ట్రంప్ ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్ కారణమంటూ 2021 జనవరి 6 వ తేదీన ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్‌లో భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. ఆ ర్యాలీ సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు అమెరికా పార్లమెంట్ భవనంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ట్రంప్ కారణంగానే క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిందని.. అందుకే ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఏడుగురు సభ్యుల బెంచ్ ప్రకటించింది.
తీర్పు అనుకూలంగా వస్తుందా?
అమెరికాలో కొత్తగా ఎన్నికైన జో బైడెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేందుకు ట్రంప్ కుట్ర చేశారని బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు తీర్పు సందర్భంగా కోర్టు వెల్లడించింది.అయితే ఈ దాడి రాజ్యాంగపరంగా తిరుగుబాటు కిందకు వస్తుందా రాదా అనేదానిపై త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది.ఈ బ్యాన్‌పై దేశ సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు ట్రంప్‌కు అనుకూలంగా వస్తే ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకున్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి.
రేసులో ముందంజలో ట్రంప్
ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి ట్రంప్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీలు ఈ నెల 15వ తేదీ ప్రారంభం కానున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ నామినేషన్ రేసులో ట్రంప్ ఇప్పటికే ముందంజలో ఉన్నారు. మిగతా అభ్యర్థులు ఆయన దరిదాపుల్లో కూడా లేరని పలు సర్వేలు చెబుతున్నాయి.