Skip to main content

T20 World Cup 2022 Final Winner : పాకిస్తాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన‌ ఇంగ్లండ్‌.. విజేతకు ప్రైజ్‌మనీ ఎంతంటే?

టి20 ప్రపంచకప్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ మరోసారి జగజ్జేతగా నిలిచింది. 2010లో పాల్‌ కాలింగ్‌ వుడ్‌ బృందం ట్రోఫీ గెలవగా.. బట్లర్‌ సేన టీ20 ప్రపంచకప్‌-2022 కప్‌ను సొంతం చేసుకుంది.

దీంతో మరోసారి వరల్డ్‌కప్‌ టైటిల్‌ గెలవాలన్న పాక్‌ ఆశలు అడియాసలయ్యాయి. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా న‌వంబ‌ర్ 13వ తేదీ (ఆదివారం) ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడ్డాయి.

సామ్‌ కరన్‌ అదరగొట్టాడు
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఇంగ్లండ్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. ఐదో ఓవర్‌ రెండో బంతికి ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(14 బంతుల్లో 15 పరుగులు)ను అవుట్‌ చేసి సామ్‌ కరన్‌ పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనానికి బాటలు పరిచాడు.

T20 World Cup 2022 : టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే.. ఇప్పటి వరకు ఈ రికార్డుల‌ను ఎవరూ

ఇక ఆదిల్‌ రషీద్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ జోర్డాన్‌ తమ వంతు సాయం చేశారు. సామ్‌ అత్యధికంగా 3, రషీద్‌, జోర్డాన్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. స్టోక్స్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్‌ 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ బాబర్‌ ఆజం 32, షాన్‌ మసూత్‌ 38 పరుగులతో రాణించారు. రిజ్వాన్‌ 15 పరుగులు చేయగా.. షాదాబ్‌ ఖాన్‌ 20 రన్స్‌ తీశాడు. మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు.

ఆదిలోనే షాక్‌.. 
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు షాహిన్‌ ఆఫ్రిది. టీమిండియాతో సెమీస్‌లో హీరోగా నిలిచిన ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌(1)ను తొలి ఓవర్లోనే బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత హ్యారీస్‌ రవూఫ్‌ ఫిలిప్‌ సాల్ట్‌(10)ను పరుగులకే పెవిలియన్‌కు చేర్చాడు. బట్లర్‌(26) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పవర్‌ ప్లేలో 49 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ మూడు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసే సరికి 77 పరుగులతో పటిష్టంగా కనిపించినా.. ఆ తర్వాతి ఓవర్లలో పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు.

Virat Kohli Top Records : కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే.. ఎందుకంటే..?

భయపెట్టిన పాక్‌ బౌలర్లు..
దీంతో 11వ ఓవర్లో 2, 12వ ఓవర్లో 3, 13వ ఓవర్లో 5, 14వ ఓవర్లో 2 పరుగులు మాత్రమే చేసింది ఇంగ్లండ్‌. ఈ క్రమంలో మరో రెండు వికెట్లు పడినా ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌(52) ఆచితూచి ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మహ్మద్‌ వసీం జూనియర్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి ఇంగ్లండ్‌ గెలుపును ఖరారు చేశాడు.

ఈ క్రమంలో ఐదు వికెట్లతో పాక్‌ను చిత్తు చేసిన బట్లర్‌ బృందం టీ20 ప్రపంచకప్‌-2022 చాంపియన్‌గా అవతరించింది. సామ్‌ కరన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా మూడేళ్ల కాలంలో ఇంగ్లండ్‌ ఐసీసీ టైటిల్‌ గెలవడం ఇది రెండోసారి. 2019లో వన్డే వరల్డ్‌కప్‌.. తాజాగా పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడింది ఇంగ్లిష్‌ జట్టు.

టీ20 ప్రపంచకప్‌ 2022 ఫైనల్‌ పాకిస్తాన్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ మ్యాచ్‌ స్కోర్లు :
పాకిస్తాన్‌: 137/8 (20)
ఇంగ్లండ్‌: 138/5 (19)

అప్పుడు.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌ హీరో ఒక్కడే..

benstock

ఇంగ్లండ్‌ విజయంలో ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో కీలక వికెట్‌ పడగొట్టిన స్టోక్స్‌.. అనంతరం బ్యాటింగ్‌లో 52 పరుగులతో అఖరి వరకు నిలిచి జట్టును జ‍గజ్జేతగా నిలిపాడు. పవర్‌ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను స్టోక్స్‌ అదుకున్నాడు. హ్యారీ బ్రూక్‌తో కలిసి కీలక బాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం బ్రూక్‌ ఔటైనప్పటికీ.. స్టోక్స్‌ మాత్రం ఎక్కడ పాక్‌ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. అఖరికి విన్నింగ్‌ రన్స్‌ కూడా స్టోక్స్‌ బ్యాట్‌ నుంచే వచ్చాయి.

T20 World Cup 2022 : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే.. ఈ ఇద్దరి వ‌ల్ల‌నే..

2019 వన్డే ప్రపంచకప్‌లోనూ..
2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకోవడంలోనూ బెన్‌ స్టోక్స్‌ కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 84 పరుగులు చేసిన స్టోక్స్‌.. జట్టుకు తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో కూడా స్టోక్స్‌ ఆఖరి వరకు ఆజేయంగా నిలిచాడు. అయితే మ్యాచ్‌ డ్రా కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. సూపర్‌ ఓవర్‌ కూడా డ్రా కావడంతో.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. సూపర్‌ ఓవర్‌లో కూడా మూడు బంతులు ఎదుర్కొన్న స్టోక్స్‌ 8 పరుగులు సాధించాడు.

విజేతకు ఎంతంటే..?

t20 world cup 2022 winner prize money england

టీ20 ప్రపంచకప్‌ విజేత ఇంగ్లండ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో 1.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 13 కోట్ల రూపాయలు) లభించింది. అదే విధంగా  అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్‌కు  8,00,000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 6.5 కోట్లు) దక్కింది. ఇక సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైన భారత్‌, న్యూజిలాండ్‌కు 4,00,000 డాలర్ల ( సుమారు రూ.3.25 కోట్లు) చొప్పున అందింది. అదే విధంగా సూపర్ 12 దశ నుంచి వైదొలిగిన 8 జట్లకు 70,000 డాలర్ల చొప్పున లభించింది.

Published date : 13 Nov 2022 08:20PM

Photo Stories