ICC T20 Rankings : నెంబర్-1 ర్యాంక్ ఈ క్రికెటర్‌కే ..ఇండియా నుంచి ఒక్కరు లేరు
ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాటింగ్ విభాగంలో టాప్-5లో ఒక్క టీమిండియా బ్యాటర్ కూడా లేడు. ఇక బౌలింగ్, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ విభాగంలో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది.
రెండో స్థానంలో..
బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 839 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి దుమ్మురేపాడు. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలాన్ 805 పాయింట్లతో రెండో స్థానంలో.. ఎయిడెన్ మార్క్రమ్ 796 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డెవన్ కాన్వే 747 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. టి20 ప్రపంచకప్‌లో సూపర్ ప్రదర్శన కనబరిచిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 742 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరపున టి20 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కేఎల్ రాహుల్ ఒకస్థానం దిగజారి ఆరో స్థానంలో ఉన్నాడు.
ఇక బౌలింగ్ విభాగానికి వస్తే...
టి20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌తో మెరిసిన వనిందు హసరంగ 797 పాయింట్లతో టాప్ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రెయిజ్ షంసీ 784 పాయింట్లతో రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా రెండు స్థానాలు ఎగబాకి 725 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ్ విభాగంలో మహ్మద్ నబీ 265 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. షకీబ్ అల్ హసన్ (260 పాయింట్లు), లియామ్ లివింగ్‌స్టోన్(179 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.