Skip to main content

Andhra Pradesh boy shines in World Youth Weightlifting Tournament : ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ టోర్నమెంట్‌లో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు

Andhra Pradesh boy shines in World Youth Weightlifting Tournament
  • అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి తెలుగు తేజం మెరిసింది. ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు శనపతి గురునాయుడు పసిడి పతకంతో అదరగొట్టాడు. గురునాయుడు ప్రతిభతో ఈ టోర్నీలో భారత్‌కు బంగారు పతకాల బోణీ లభించింది. మెక్సికోలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో విజయనగరం జిల్లాకు చెందిన 16 ఏళ్ల గురునాయుడు బాలుర 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. స్నాచ్‌లో 104 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 126 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 230 కేజీలతో గురునాయుడు అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
  • సౌదీ అరేబియా లిఫ్టర్‌ మాజీద్‌ అలీ (229 కేజీలు; స్నాచ్‌లో 105+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 124) రజతం... కజకిస్తాన్‌ లిఫ్టర్‌ యెరాసిల్‌ ఉమ్రోవ్‌ (224 కేజీలు; స్నాచ్‌లో 100+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 124) కాంస్యం సాధించారు. ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్‌ నాలుగు పతకాలు సాధించింది. బాలికల 45 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సౌమ్య కాంస్యం గెలిచింది. సౌమ్య స్నాచ్‌లో 65 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 148 కేజీలతో మూడో స్థానంలో నిలి చింది. ఆకాంక్ష (40 కేజీలు), విజయ్‌ ప్రజాపతి (49 కేజీలు) రజత పతకాలు గెలిచారు.

‘లిఫ్ట్‌’ చేస్తే పతకమే...

  • వేదిక ఏదైనా బరిలోకి దిగితే గురునాయుడు పతకంతోనే తిరిగొస్తున్నాడు. తాష్కెం ట్‌లో జరిగిన 2020 ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌లో గురు 49 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు 2019లో తాష్కెంట్‌లోనే జరిగిన ఆసియా యూత్‌ క్రీడల్లో రజతం గెలిచాడు. గత మూడేళ్లుగా జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో గురు పసిడి పతకాల పంట పండిస్తున్నాడు.
  • 2020లో బుద్ధగయలో జాతీయ పోటీల్లో అతను స్వర్ణం సాధించడంతోపాటు ఐదు రికార్డులు నెలకొల్పాడు. 2021లో పంజాబ్‌లో, ఈ ఏడాది జనవరిలో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో గురునాయుడు బంగారు పతకాలు గెలిచాడు. ‘ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకం సాధించడం, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో విజేతగా నిలిచి ఐఏఎస్‌ అధికారి కావడం తన జీవిత లక్ష్యాలు’ అని సోమవారం మెక్సికో నుంచి ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ గురునాయుడు పేర్కొన్నాడు.

తండ్రి కలను నిజం చేస్తూ... 
గురునాయుడు స్వస్థలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని చంద్రంపేట. అతని తండ్రి రామస్వామి గ్రామీణ క్రీడల్లో రాణించేవారు. ఆ రోజుల్లోనే బాడీబిల్డర్‌గా, వెయిట్‌లిఫ్టర్‌గా పేరుపొందారు. పేదరికం వల్ల తన అభిరుచికి మధ్యలోనే స్వస్తి పలకాల్సి వచ్చింది. తన ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన గురునాయుడిని మాత్రం వెయిట్‌లిఫ్టర్‌గా చేయాలని తపించారు. తన ఆశయాన్ని తన కుమారుడి ద్వారా సాధించాలనే లక్ష్యంతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన చల్లా రాము వద్ద శిక్షణకు పంపించారు. అలా వెయిట్‌లిఫ్టింగ్‌లో ఓనమాలు దిద్దిన గురునాయుడు సికింద్రాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఆర్మీ స్కూల్‌లో సీటు సాధించాడు. సీబీఎస్‌ఈ పదో తరగతిలో ‘ఎ’ గ్రేడ్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. అక్కడే ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చదువుతూ కోచ్‌ దేవా వద్ద శిక్షణ పొందుతున్నాడు. తమ కుమారుడు గురునాయుడు సాధించిన విజయంతో తల్లిదండ్రులైన రామస్వామి, పాపయ్యమ్మ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 Jun 2022 05:09PM

Photo Stories