Tata Neu App: సూపర్ యాప్‌ను ఆవిష్కరించిన టాటా గ్రూప్
ఇటు సంప్రదాయ విధానాలు, అటు ఆధునిక టెక్నాలజీ ప్రయోజనాల మేళవింపుతో వినియోగదారులకు మరింతగా చేరువయ్యేందుకు ఇది తోడ్పడగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ‘ఇవాళ ’న్యూ’ డే (రోజు)! టాటా కుటుంబంలో భాగమైన టాటా డిజిటల్ మీకోసం నేడు టాటా ’న్యూ’ యాప్‌ను తీసుకొచి్చంది. మా బ్రాండ్స్ అన్నింటినీ ఈ శక్తివంతమైన యాప్‌లో తీర్చిదిద్దింది. టాటా ప్రపంచంలో అద్భుతాలను కనుగొనేందుకు ఇదొక సరికొత్త మార్గం. భారత వినియోగదారుల జీవితాలను మరింత సులభతరం, సరళతరం చేయాలన్నది మా లక్ష్యం‘ అని ఆయన పేర్కొన్నారు. ‘ఎయిర్ ఏషియా, బిగ్‌బాస్కెట్, క్రోమా, ఐహెచ్‌సీఎల్, క్యుమిన్, స్టార్‌బక్స్, టాటా 1ఎంజీ, టాటా క్లిక్, టాటా ప్లే, వెస్ట్‌సైడ్ వంటి అత్యంత విశ్వసనీయమైన మా బ్రాండ్లు అన్నీ టాటా న్యూ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉండటం మాకు గర్వకారణం. అలాగే విస్తారా, ఎయిరిండియా, టైటాన్, తని‹Ù్క, టాటా మోటార్స్ కూడా త్వరలోనే ఇందులో చేరతాయి‘ అని చంద్రశేఖరన్ చెప్పారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న బిగ్‌బాస్కెట్, 1ఎంజీ, ఎయిరిండియా మొదలైన యాప్‌లు ప్రస్తుతానికి యథాప్రకారం కొనసాగుతాయని టాటా డిజిటల్ వర్గాలు తెలిపాయి. ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా రంగంలోకి దిగిన టాటా న్యూ .. దేశీయంగా తొలి సూపర్ యాప్ కాగలదని పరిశీలకులు భావిస్తున్నారు.
ఏడాది నుంచీ కసరత్తు ..
దేశీ ఈ–కామర్స్ రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై టాటా గ్రూప్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గత ఏడాది కాలంగా యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. గతేడాది మే నెలలో ఆన్‌లైన్ కిరాణా సరుకుల విక్రేత బిగ్‌బాస్కెట్‌ను టాటా డిజిటల్ కొనుగోలు చేసింది. తద్వారా నేరుగా రిలయన్స్ జియోమార్ట్, అమెజాన్‌లతో పోటీలోకి దిగింది. ఆ తర్వాత నెలలో 75 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 550 కోట్లు) వెచి్చంచి క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్‌లో వాటాలు కొనుగోలు చేసింది. అలాగే ఆన్‌లైన్‌లో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, ఔషధాలు విక్రయించే 1ఎంజీలో మెజారిటీ వాటాలు దక్కించుకుంది.