Vernal Equinox: వసంతపు వెలుగులు.. రాత్రింబవళ్లు సమానం!!
వసంత విషువత్తు (స్ప్రింగ్ ఈక్వినాక్స్) సందర్భంగా మార్చి 20వ తేదీ అంతరిక్షం నుంచి భూ గ్రహం ఇలా కనిపించింది. అచ్చెరువొందించే ఈ ఫొటోను యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మెటరోలాజికల్ శాటిలైట్స్ (ఈయూఎంఈటీఎస్‌ఏటీ) విడుదల చేసింది.
సంవత్సరంలో రెండు రోజులు భూమిపై రాత్రింబవళ్ల నిడివి సమానంగా ఉంటుంది. ఆ రోజుల్లో సూర్యుడు భూమధ్య రేఖపై నేరుగా ఉండటమే ఇందుకు కారణం. వీటినే విషువత్తులుగా పిలుస్తారు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఇవి ఏర్పడతాయి. మొదటిదైన వసంత విషువత్తు ఏటా మార్చి 20కి అటూ ఇటుగా వస్తుంది. ఆ రోజుతో ఉత్తరార్ధ గోళం అధికారికంగా శీతాకాలం నుంచి వసంత కాలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడినుంచి ఆ ప్రాంతంలో పగటికాలం, ఉష్ణోగ్రతలు పెరుగుతూ రాత్రుళ్ల నిడివి తగ్గుతూ వస్తాయి. రెండోదైన శరద్విషువత్తు (ఆటమల్ ఈక్వినాక్స్) సెప్టెంబర్ 22కు ఇటూ ఇటుగా వస్తుంది. విషువత్తులకు జ్యోతిశ్శాస్త్రంలో చాలా ప్రాధాన్యముంటుంది.