Skip to main content

Inspiration-4: ఏ పేరుతో స్పేస్‌ఎక్స్‌ సంస్థ మూడు రోజుల అంతరిక్ష యాత్రను చేపట్టింది?

Inspiration-4

ఇన్‌స్పిరేషన్‌–4 పేరుతో స్పేస్‌ఎక్స్‌ సంస్థ చేపట్టిన మూడు రోజుల అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. అపర కుబేరుడు జేర్డ్‌ ఐసాక్‌మ్యాన్‌ నేతృత్వంలో నలుగురు పర్యాటకులతో అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక సురక్షితంగా భూమికి చేరింది. అమెరికాలోని ఫ్లోరిడా తీరం(అట్లాంటిక్‌ మహా సముద్రం)లో సెప్టెంబర్‌ 18న స్పేస్‌ఎక్స్‌ క్యాప్సుల్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయింది. వ్యోమగాములు లేకుండా, ఎలాంటి అంతరిక్ష యాత్రల అనుభవంలేని సాధారణ పౌరులతో అంతరిక్ష యాత్ర చేపట్టడం ఇదే తొలిసారి. ఈ యాత్ర విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరిన్ని పర్యాటక రోదసి యాత్రలకు బాటలు వేసినట్టయింది.

కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి...

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మెరిట్‌ ద్వీపంలో ఉన్న కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సెప్టెంబర్‌ 15న ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 585 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ చక్కర్లు కొట్టింది. క్రూ డ్రాగన్‌ క్యాప్సుల్‌కి అతిపెద్ద బబుల్‌ ఆకారంలో ఉన్న కిటికీని అమర్చారు. ఈ గాజు కిటికీ ద్వారా అందులో ప్రయాణించిన నలుగురు ప్రయాణికులు అంతరిక్షాన్ని తనివితీరా చూశారు. ఈ రాకెట్‌ గమనాన్ని ఆటోపైలట్‌మోడ్‌లో భూమి మీద నుంచే నియంత్రించారు.

 

నలుగురు యాత్రికులు వీరే...

జేర్డ్‌ ఐసాక్‌మ్యాన్‌(38): ఫిష్ట్‌4 పేమెంట్స్‌ అనే చెల్లింపుల ప్రాసెసింగ్‌ కంపెనీని ఆయన నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు కమాండర్‌గా వ్యవహరించిన ఆయన పైలట్‌గానూ శిక్షణ పొందారు. అమెరికా కుబేరుడు అయిన ఈయన ఈ యాత్ర పూర్తి వ్యయ ప్రయాసల బాధ్యతలను తన భుజాలకెత్తుకున్నారు. అయితే ఈ యాత్ర కోసం స్పేస్‌ఎక్స్‌కు ఎంత చెల్లించారో వెల్లడించలేదు. నేరుగా అంతరిక్ష ప్రయాణం చేసిన మూడో బిలియనీర్‌గా చరిత్రలకెక్కారు. 2021, జులైలో వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్, బ్లూ ఆరిజిన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌లు రోదసియాత్రలు చేసిన విషయం తెలిసిందే.

హేలి అర్సెనాక్స్‌(29): ఎముక క్యాన్సర్‌ బారినపడి కోలుకున్న ఈమె... తాను చికిత్సపొందిన టెన్నెస్సీలోని సెయింట్‌ జూడ్‌ ఆస్పత్రిలోనే హెల్త్‌కేర్‌ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రయాణికుల్లో ఒకరైన ఐసాక్‌మ్యాన్‌ ఈ ఆస్పత్రికి 10 కోట్ల డాలర్ల విరాళం ఇచ్చారు. నింగిలోకి దూసుకెళ్లిన అత్యంత పిన్న అమెరికన్‌గా, కృత్రిమ అవయవంతో అంతరిక్ష యాత్ర చేసిన తొలి వ్యక్తిగా హేలి గుర్తింపు పొందారు.

క్రిస్‌ సెంబ్రోస్కీ(42): ఏరోస్పేస్‌ కంపెనీ లాక్‌హీడ్‌ మార్టిన్‌లో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతంలో అమెరికా వైమానిక దళంలో పనిచేశారు. ఈయన కూడా సెయింట్‌ జూడ్‌ ఆసుపత్రికి విరాళమిచ్చారు.

సియాన్‌ ఫ్రాక్టర్‌ (51): ఆరిజోనాలోని కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్‌ అయిన ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళ సియాన్‌ ప్రోక్టర్‌... జియో సైంటిస్ట్, ఆర్టిస్ట్, సైన్స్‌ రచయిత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్రలో ఆమె పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. తద్వారా వ్యోమనౌకకు పైలట్‌గా వ్యవహరించిన తొలి నల్లజాతీయురాలిగా గుర్తింపు పొందారు.

వచ్చే ఏడాది తొలినాళ్లలో మరో ట్రిప్‌...

ముగ్గురు అత్యంత ధనవంతులైన ప్రయాణికులు, ఒక మాజీ నాసా వ్యోమగామితో వారంపాటు కొనసాగే మరో అంతరిక్ష పర్యాటక యాత్ర 2022 ఏడాది తొలినాళ్లలో ఉంటుందని స్పేస్‌ఎక్స్‌ వెల్లడించింది. రష్యాకు చెందిన నటి, దర్శకుడు, జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం ఈ యాత్రలో పాలుపంచుకుంటారని పేర్కొంది.

చ‌ద‌వండి: అధునాతన నౌక ఐసీజీఎస్‌ విగ్రహను తయారు చేసిన సంస్థ?

 

 

Published date : 21 Sep 2021 05:44PM

Photo Stories