Raman micro-spectroscopy: తల్లి పాలలోను ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించిన ఇటలీ శాస్త్రవేత్తలు
పరిశీలన సాగిందిలా..: స్త్రీ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం యూనివర్సిటీ ఆస్పత్రిలో 34 మంది తల్లుల నుంచి నిర్ణీత మొత్తంలో పాల నమూనాలను సేకరించింది. వాటిని రామన్ మైక్రో స్పెక్ట్రోస్కొపీ సాంకేతికత సాయంతో విశ్లేషించింది. ఈ సందర్భంగా 26 మంది పాలలో సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించారు. ఆ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఏ రకమైనవి, వాటి పరిణామం, రంగులను నిర్ధారించారు. కొందరి పాలలో అయితే రెండు, మూడు రకాల మైక్రో ప్లాస్టిక్‌లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి, నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఉపయోగంచే ప్లాస్టిక్ రకాలేనని తేల్చారు.
రకరకాలుగా కలుషితం
ఆహారం, కలుషిత గాలి ద్వారా ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తి మొదలు.. నిల్వ, రవాణా, వండటం, వడ్డించడం, చివరి ప్లాస్టిక్ చెంచాలతో తినడం వరకు అన్ని స్థాయిల్లో ప్లాస్టిక్ చేరుతోంది. ఆహారం ద్వారా శరీరంలోకి వెళుతోంది. ఇక ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు గాలిలో చేరుతున్నాయి. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి, వాటి నుంచి రక్తంలో ప్రవేశించి శరీర భాగాలన్నింటికీ వెళుతున్నాయి. సముద్రాలు, నదులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం 3.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్టు అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తులు నీటిలో కలవడం, వాటి నుంచి అతిచిన్న ముక్కలు నీటిలోకి, జలచరాల్లోకి చేరడం, వాటిని ఆహారంగా తీసుకుంటున్న మన శరీరంలోకి చేరడం జరుగుతోంది. ఇదంతా అత్యంత సూక్ష్మస్థాయిలో ముంచుకొస్తున్న ప్రమాదమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ఐదుగురు తల్లి పాల నమూనాల పరిశీలన ఫలితాలివి
వయసు (ఏళ్లలో) | పాల పరిమాణం | మైక్రో ప్లాస్టిక్స్ | రంగు | పాలిమర్ రకం |
28 | 8.44 గ్రా | 2 | నారింజ | నైట్రోసెల్యులోస్ |
32 | 4.92 గ్రా | 1 | నారింజ | పాలీఇథిలిన్ |
32 | 5.83 గ్రా | 1 | నీలి | పాలీఇథిలిన్ |
38 | 5.09 గ్రా | 2 | నలుపు | పాలీవినైల్ క్లోరైడ్ |
36 | 7.08 గ్రా | 2 | ఎరుపు | పాలీవినైల్ క్లోరైడ్ |
ప్రమాదం ఎంత వరకు?
తల్లి పాలలోని ప్లాస్టిక్ అవశేషాలతో బిడ్డకు ప్రమాదం కలగవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్య నిపుణులు చెప్తున్నారు. చిన్నారుల మెదడు, నాడీ మండలంపై ప్రభావం చూపడంతోపాటు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీయవచ్చని.. ఇది ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే తల్లి పాలలోని మైక్రోప్లాస్టిక్ ద్వారా జరిగే దుష్పరిణామాలపై ఎలాంటి రుజువులు లేవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశంపై మన దేశంలో ఎలాంటి పరిశోధన జరగలేదని, పాశ్చాత్య దేశాల్లో కూడా లోతైన పరిశోధనలేవీ లేవని తెలిపింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP