Iran Satellite Launch: మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇరాన్
గాజాలో హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీకి మధ్య కొనసాగుతున్న భీకరపోరు కారణంగా మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇది జరిగింది. దేశీయంగా అభివృద్ధి చేసిన సిమోర్గ్ రాకెట్ వాటిని 450 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేర్చినట్లు తెలిపింది. సెమ్నాన్ ప్రావిన్స్‌లోని ఇమామ్ ఖొమైనీ అంతరిక్ష కేంద్రంలో రాత్రివేళ ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది.
ఇందులో మహ్దా అనేది పరిశోధక ఉపగ్రహం కాగా, కేహాన్–2, హతెఫ్–1 అనేవి జీపీఎస్, కమ్యూనికేషన్‌కు సంబంధించిన నానో శాటిలైట్లని ప్రభుత్వ టీవీ తెలిపింది. గాజాపై యుద్ధంలో సైనికపరంగా జోక్యం చేసుకోనప్పటికీ, ఇటీవల జరిగిన ఇస్లామిక్ స్టేట్ భారీ ఆత్మాహుతి దాడి, ఇరాన్ అండదండలున్న హౌతీ తిరుగుబాటుదారులు విదేశీ నౌకలపై దాడులు చేయడం వంటివి ఇరాన్ మతపెద్దలపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టినట్లుగా భావిస్తున్నారు.