Chandrayaan-3: చంద్రయాన్-3 స్లీప్‌మోడ్‌లోనూ సిగ్నల్.. ఇస్రో కీలక అప్‌డేట్
చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 2 రోవర్, సెప్టెంబర్ 4న ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచారు. అయితే చంద్రయాన్-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందుకు సంబందించిన వివరాలను బెంగళూరులో వారు ధ్రువీకరించారు.
అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్-3 ల్యాండర్‌లో వివిధ దేశాలకు చెందిన కొన్ని పరికరాలను అమర్చారు. అయితే అందులో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఓ)లోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ అరే (ఎల్‌ఆర్‌ఏ) చంద్రుడి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని తెలిపారు. డిసెంబర్ 12 నుంచి ఎల్‌ఆర్‌ఏ సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది.
Moon Sniper: చంద్రుడిపై ‘షార్ప్ షూటర్’.. జపాన్ గురి కుదిరేనా..?
చంద్రయాన్-3లో పలు సంస్థలకు చెందిన ఎల్‌ఆర్‌ఏలను అమర్చినా నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఏ నిత్యం పనిచేస్తోందని ఇస్రో చెప్పింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్‌ఆర్‌ఏ పర్యవేక్షణ ప్రారంభిస్తుంది. చంద్రయాన్-3లోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణాన్ని తట్టుకునేలా ఏర్పాటు చేశారు. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి.
చంద్రయాన్-3 మిషన్ విజయంతం..
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని భారత్ ‘శివ శక్తి పాయింట్’గా నామకరణం చేసింది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించింది. 14 రోజులపాటు అక్కడి వాతావరణ, నీటి పరిస్థితి, ఖనిజాల గురించి అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ మిషన్ దాని లక్ష్యాలను అధిగమించింది.