Submarine Sindhu Dhwaj : విధుల నుంచి వీడ్కోలు
భారత నౌకాదళం విజయాల్లో కీలక భూమిక పోషించిన సింధు ధ్వజ్ సబ్‌మెరైన్ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విధుల నుంచి నిష్క్రమించింది. దేశ రక్షణకు నిర్విరామంగా అందించిన సేవలకు గాను తూర్పు నౌకాదళం సింధు ధ్వజ్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఐఎన్‌ఎస్ సింధు ధ్వజ్.. ప్రపంచంలోనే అత్యంత సాధారణ సంప్రదాయ జలాంతర్గామి. దీనిని కిలో క్లాస్ సబ్‌మెరైన్‌గా పరిగణిస్తారు. 35 ఏళ్ల క్రితం రష్యా నుంచి కొనుగోలు చేసిన దీనిని అత్యంత పటిష్టమైన సబ్‌మెరైన్‌గా భారత్ తీర్చిదిద్దింది. స్వదేశీ సోనార్, స్వదేశీ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌తో పాటు స్వదేశీ టార్పెడో ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంతో సింధు ధ్వజ్ తన సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకుంది. భారత నౌకాదళం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారు చేస్తున్న ప్రతి సబ్‌మెరైన్ డిజైన్ వెనుక.. సింధు ధ్వజ్‌ని స్ఫూర్తిగా తీసుకుంటుండటం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇన్నోవేషన్ ఫర్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రోలింగ్ ట్రోఫీని పొందిన ఏకైక జలాంతర్గామిగా చరిత్రలో నిలిచింది.
Also read: AP Government: ‘అమృత్ సరోవర్’లో ఏపీకి మూడో స్థానం
మలబార్ విన్యాసాల్లో సత్తా
భారత నౌకాదళంలో చేరిన తర్వాత.. నిరంతరం దేశ రక్షణ కోసం వినియోగించారు. సాగర గర్భంలో నిర్విరామంగా శత్రు సేనల రాకను పసిగట్టేందుకు సింధు ధ్వజ్ ‘స్పెషల్ ఐ’గా విధులు నిర్వర్తించింది. అప్పట్లో తరచుగా మరమ్మతులకు గురవుతుండటంతో పదేళ్ల క్రితమే డీ కమిషన్ చేయాలని భావించారు. అయితే.. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే మలబార్ విన్యాసాల్లో భాగంగా 2015లో జరిగిన ఎడిషన్‌లో సింధు ధ్వజ్ సబ్‌మెరైన్.. అసలు బలం ప్రపంచానికి తెలిసింది. అమెరికా తన సరికొత్త లాస్ ఏంజెలిస్ క్లాస్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ యూఎస్‌ఎస్ సిటీ ఆఫ్ కార్పస్ క్రిస్టీ(ఎస్‌ఎస్‌ఎన్–705)తో విన్యాసాల్లో తలపడింది. ఈ విన్యాసాల్లో అప్పటికే పలుమార్లు మరమ్మతులకు గురైన సింధు ధ్వజ్ మట్టికరవడం ఖాయమనుకున్నారు. కానీ.. అందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ.. అత్యాధునిక సబ్‌మెరైన్‌ని ధ్వంసం చేసినంత పని చేసి.. అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: ఇన్ఫోసిస్ యొక్క CEO & MD గా తిరిగి ఎవరు నియమితులయ్యారు?
చారిత్రక విజయంలో కీలకపాత్ర
మహా సముద్రాల లోతుల్లో చిక్కుకుపోయే సబ్ మెరైన్లలో సిబ్బందిని కాపాడే అతి క్లిష్టమైన పరీక్షని భారత నౌకాదళం విజయవంతంగా పూర్తి చేసిన ప్రయోగంలోనూ సింధు ధ్వజ్ ముఖ్య భూమిక పోషించింది. 2019లో బంగాళాఖాతంలో నిర్వహించిన పరీక్షల్లో ఐఎన్‌ఎస్ సింధు ధ్వజ్‌ను వినియోగించారు. సముద్రం అడుగున ఉన్న సింధు ధ్వజ్ వద్దకు డీప్ సబ్ మెరైన్ రెస్క్యూ వెహికల్ (డీఎస్‌ఆర్వీ)ను నేవీ పంపించింది. రెండూ ఇంటర్ లాక్ అయిన తర్వాత సింధు ధ్వజ్‌లోని నేవీ సిబ్బంది డీఎస్‌ఆర్వీలోకి వచ్చారు. అనంతరం డీఎస్‌ఆర్వీని సింధు ధ్వజ్ సేఫ్‌గా సముద్ర ఉపరితలానికి తీసుకొచ్చింది. ఈ విజయంతో డీఎస్‌ఆర్వీ వినియోగంలో అగ్ర నౌకాదళాల సరసన ఇండియన్ నేవీ చేరింది. ఇలా.. అనేక విజయాల్లో కీలక భూమిక పోషించిన సింధు ధ్వజ్ సబ్‌మెరైన్ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విధుల నుంచి నిష్క్రమించింది. దేశ రక్షణకు నిర్విరామంగా అందించిన సేవలకు గాను తూర్పు నౌకాదళం సింధు ధ్వజ్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆత్మనిర్భర్ భారత్‌లో తయారు చేసిన జలాంతర్గాములకు ఇదే స్ఫూర్తి.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: టైమ్ మ్యాగజైన్ 2022లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో లీడర్స్ కేటగిరీ కింద ఎవరు పేరు పెట్టారు?
సింధు ధ్వజ్ స్వరూపమిదీ
బరువు: 3,076 టన్నులు
బీమ్: 9.9 మీటర్లు
పొడవు : 72.6 మీటర్లు
ఎత్తు: 6.6 మీటర్లు
వేగం: ఉపరితలంపై గంటకు 11 నాటికల్ మైళ్లు, సాగర గర్భంలో 19 నాటికల్ మైళ్లు
ఎన్ని రోజులు నీటిలో ఉండగలదు: 240 మీటర్ల లోతులో ఏకధాటిగా 45 రోజులు
ఆయుధ సంపత్తి: మూడు 9 ఎంఎం, 36 ఎస్‌ఏఎం లాంచర్‌లు, టార్పెడోలు, యాంటీ సబ్‌మెరైన్ టార్పెడోలు
సామర్థ్యం : ఏకధాటిగా 9,700 కి.మీ. దూరం ప్రయాణించగలదు
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి దంత ఆరోగ్య బీమా పథకాన్ని ఏ బీమా కంపెనీ ప్రారంభించింది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP