SpaDeX: ఇస్రోకు మరో విజయం.. అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్

ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిందని ఇస్రో (ISRO) జనవరి 16వ తేదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
స్పేడెక్స్ (SpaDeX) డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా, భారతదేశం ప్రపంచంలో స్పేడెక్స్ జంట ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ (డాకింగ్) సాంకేతికతను సాధించిన నాలుగో దేశంగా అవతరించింది.
ఈ విజయంతో.. ఇస్రో తన కీర్తిలో మరొక కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత భారతదేశం డాకింగ్ సాంకేతికతను సాధించిన దేశంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘనతను అభినందించి, భారత భవిష్యత్ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలు దీని ద్వారా మరింత బలపడతాయని తెలిపారు.
జనవరి 16వ తేదీ ఉదయం 9 గంటలకు చేజర్ (SDX-01), టార్గెట్ (SDX-02) అనే జంట ఉపగ్రహాలను అనుసంధానం చేసిన ఇస్రో, డాకింగ్ తర్వాత ఈ ఉపగ్రహాలను ఒకే ఉపగ్రహంగా కంట్రోల్ చేస్తూ, తదుపరి దశలలో వీటిని విడగొట్టడం, ఇంధన, విద్యుత్ సరఫరా వ్యవస్థల బదిలీని పరీక్షించనున్నట్లు వెల్లడించింది.
SpaceX: చంద్రుడిపైకి ఒకేసారి.. రెండు ల్యాండర్ల ప్రయోగం
ఈ ప్రయోగానికి ముందు..
గత ఏడాది డిసెంబర్ 30వ తేదీ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (PSLV-C60) రాకెట్ ద్వారా చేజర్, టార్గెట్ ఉపగ్రహాలను పంపారు. వాటిని 475 కిలోమీటర్ల పొడవైన వేర్వేరు కక్ష్యాల్లో ప్రవేశపెట్టారు. తరువాత, వాటిని ఒకే కక్ష్యలోకి తీసుకురావడానికి పలుమార్లు ప్రయత్నించారు. కానీ వేగాల సారూప్యత లేకపోవడంతో.. జనవరి 12వ తేదీ కొన్ని సాంకేతిక ఇబ్బందులతో డాకింగ్ సాధ్యంకాలేదు.
ఆ తర్వాత.. జనవరి 16వ తేదీ 15 మీటర్ల దూరంలో ఉన్న చేజర్ ఉపగ్రహాన్ని 3 మీటర్ల సమీపానికి తెచ్చి లేజర్ రేంజ్ ఫైండర్, డాకింగ్ సెన్సార్ల సహాయంతో ఎట్టకేలకు విజయవంతంగా డాకింగ్‌ను పూర్తి చేశారు.
ఈ స్పేడెక్స్ డాకింగ్ విజయంతో.. భవిష్యత్తులో చంద్రయాన్-4, గగన్‌యాన్ వంటి అంతరిక్ష ప్రయోగాలకు కీలకమైన సాంకేతికత సిద్ధం అయినట్లు ఇస్రో పేర్కొంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ ఈ విజయం సాధించిన బృందానికి అభినందనలు తెలిపారు.
Union Cabinet: శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్.. దీని నిర్మాణానికి రూ.3,985 కోట్లు